దేశంలో రాజకీయాలు(Politics) భ్రష్టపట్టిపోయాయి.
దేశంలో రాజకీయాలు(Politics) భ్రష్టపట్టిపోయాయి. దీన్ని ఎవరైనా ఒప్పుకుంటారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చేవారు 0.001 పర్సంట్ కూడా ఉండరు. డబ్బు గడించడానికే వస్తున్నారు కాబట్టి వారికి సిద్ధాంతాలలో పని ఉండదు. పార్టీ పట్ల విశ్వాసం కూడా ఉండదు. అందుకే నిర్మోహమాటంగా పార్టీని వదిలిపెట్టేసి అధికారపక్షంలోకి జంప్ అవుతున్నారు. ఓ పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి వెళ్లడానికి మనసెలా ఒప్పుతున్నదో! ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు(MLA) ఇలా పార్టీ మారి ప్రభుత్వాలను అస్థిరపరచే సందర్భాలు కూడా చాలానే చూశాం! ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులో ఉన్నా ఆ చట్టానికి దొరక్కుండా పార్టీలు మారుతున్నారు ఎమ్మెల్యేలు. అందుకే హిమాచల్ ప్రదేశ్‌లోని(Himachal Pradesh) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) ఒక కొత్త బిల్లు తెచ్చింది. సభలో ఆ బిల్లు ఆమోదం కూడా పొందింది. ఒక పార్టీ తరఫున గెలిచిన నాయకులు తర్వాత పార్టీ మారితే గనుక జీవితంలో వారికి పెన్షన్లు(Pension) రాకుండా ఉండేలా బిల్లును రూపొందించారు. చూడటానికి చాలా ఆదర్శవంతంగా కనిపిస్తున్నది కదా! కానీ బిల్లు తేవడం వెనుక మరో కారణం ఉంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ చట్టం చేసింది. ఈ బిల్లులో కొన్ని లొసుగులు ఉన్నాయి. ఓ పార్టీ తరఫున గెలిచిన తర్వాత మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే తప్ప పెన్షన్ రాదన్నమాట! అంటే పార్టీ మారే ఎమ్మెల్యేకు పింఛను కూడా దక్కకుండా చేయడం అన్నది పూర్తిగా స్పీకరు చేతుల్లో మాత్రమే ఉంటుందన్నమాట. హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లు తెచ్చింది. ఉదాహరణకు ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యే ఒకరు అధికార పార్టీలోకి వెళ్లారనుకుందాం! అప్పుడు ప్రతిపక్ష పార్టీ ఫిర్యాదు చేసినా స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా నాన్చుతూ ఉంటారు. స్పీకర్‌ను ఎందుకు నానుస్తున్నారని అడిగే రైట్ ఉండదు. అంటే విపక్షంలోంచి అధికారపక్షంలోకి ఎవరు వచ్చినా ఏం ఫర్వాలేదు. అనర్హత వేటు పడే ఛాన్సే ఉండదు. సలక్షణంగా పెన్షన్ వస్తుంది. అధికారపార్టీ నుంచి మరో పార్టీలోకి మారితేనే ఇబ్బంది. అప్పుడు స్పీకర్ ఆగమేఘాల మీద యాక్షన్ తీసుకుంటారు. అనర్హత వేటు వేస్తారు. పెన్షన్‌కు మంగళం పాడతారు. ఇదంతా ఎందుకంటే హిమాచల్‌ప్రదేశ్‌లో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతాపార్టీలో చేరారు. ఇంకో అయిదారుగురు చేరితే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లు తెచ్చింది. పైకేమో ఆదర్శవంతమైన బిల్లులా కనిపిస్తున్నది కానీ కచ్చితంగా ఇది ఆత్మరక్షణ కోసం తెచ్చిన బిల్లే!