రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంతం కావడం ఖాయమని.. ఇప్పటికే చాలా మంది సీనియర్లు పార్టీని వీడడం
కాంగ్రెస్ పార్టీ పతనాన్ని దేశ ప్రజలందరూ చూస్తున్నారు. ఒక 10 సంవత్సరాల కిందట 20కి పైగా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే! కానీ మోదీ మేనియా మొదలైనప్పటి నుండి ఆ పార్టీ దారుణంగా పరాజయాలను మూటగట్టుకుంటూ ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతానికి ఆ పార్టీ పూనుకునే అవకాశాలు కనిపించడం లేదు. రాహుల్ గాంధీని హీరోలను రీ లాంచ్ చేసినట్లుగా.. లాంఛింగ్ చేస్తూనే ఉన్నారని బీజేపీ మరో వైపు విమర్శిస్తూనే ఉంది. బీజేపీని అధికారం నుండి దూరం చేయడం మాట దేవుడెరుగు.. కనీసం ప్రధాన ప్రతిపక్షంగా కూడా కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటలేకపోతూ ఉండడం నిజంగా బాధాకరం. కాంగ్రెస్ పార్టీని వీడిన బడా నాయకులు కూడా ఆ పార్టీ పతనాన్ని చూస్తున్నామని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ తాజాగా కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంతం కావడం ఖాయమని.. ఇప్పటికే చాలా మంది సీనియర్లు పార్టీని వీడడం ఆ పార్టీ దురదృష్టకరం అన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీని వీడడం పార్టీకి పెద్దదెబ్బ అని ఆజాద్ అన్నారు. భవిష్యత్‌లో మరికొంత మంది కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు తనకు సమాచారం ఉందని.. ఇప్పుడు తాను ఆ పార్టీలో లేను కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల గురించి తాను మాట్లాడదలచుకోలేదని ఆజాద్ స్పష్టం చేశారు. అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారని.. ఆయన తండ్రి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారని గుర్తు చేశారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మహారాష్ట్ర మాత్రమేనని అన్నారు. యూపీ, బెంగాల్ వంటి రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేశాయన్నారు.