హాల్ లోకి వెళ్లేందుకు టికెట్లు చూపించగా అక్కడ ఉన్న ఉద్యోగి వారిని అనుమతించలేదు. ఎందుకంటే వారి వేషధారణ బాగాలేదని.. వారు వేసుకున్న వస్త్రాలు బాగా లేవని వారిని సినిమా చూసేందుకు అభ్యంతరం వ్యక్తం చేశాడు.
సినిమా చూసేందుకు వచ్చిన సంచార జాతి (Tribal) వారికి సినిమా థియేటర్ (Movie Theatre) యాజమాన్యం వారిని లోపలికి అనుమతించలేదు . టికెట్లు (Tickets ) కొనుగోలు చేసి లోపలికి వెళ్తున్న సమయంలో అక్కడి సిబ్బంది వారిని అడ్డగించింది. ఎందుకంటే వారి వేషధారణ బాగా లేదని అక్కడి ఉద్యోగి అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో థియేటర్(Theatre) లోకి వారిని అనుమతించకపోవడంతో తమిళనాడులో (Tamil Nadu) తీవ్ర దుమారం రేపుతున్నది. వేషధారణ, తక్కువ జాతి అని వారిపై థియేటర్ యాజమాన్యం వివక్ష చూపడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం,
హీరో శింబు నటించిన ‘పాతు తల’ సినిమా (Pathu Thala Movie) గురువారం విడుదలైంది. ఈ సినిమా చూసేందుకు చెన్నైలోని (Chennai) రోహిణి థియేటర్ (Rohini Theatre) లో ఈ సినిమా మొదటి షో చూసేందుకు సంచార జాతికి చెందిన ఓ కుటుంబం వచ్చింది. రూ.150 చొప్పున నలుగురు టికెట్లు కొనుగోలు చేశారు. హాల్ లోకి వెళ్లేందుకు టికెట్లు చూపించగా అక్కడ ఉన్న ఉద్యోగి వారిని అనుమతించలేదు. ఎందుకంటే వారి వేషధారణ బాగాలేదని.. వారు వేసుకున్న వస్త్రాలు బాగా లేవని వారిని సినిమా చూసేందుకు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీనిని అక్కడ ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సంచార జాతిపై వివక్ష చూపించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. థియేటర్ యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో సాయంత్రం వారిని సినిమాకు అనుమతించారు.
అయితే ఈ విషయం తీవ్ర దుమారం రేపడంతో చివరికి రోహిణి థియేటర్ యాజమాన్యం స్పందించింది. ‘ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఉంది. ఈ సర్టిఫికెట్ ప్రకారం 12 ఏళ్లలోపు వయసు గల వారు సినిమా చూడొద్దు. సినిమా చూసేందుకు వచ్చిన వారి వయసు 2, 6, 8, 10లోపు ఉంది. అందుకే వారిని అనుమతించలేదు. తర్వాత ఆ కుటుంబాన్ని థియేటర్ లోకి తిరిగి అనుమతించాం’ అని రోహిణి సిల్వర్ స్క్రీన్స్ (Rohini Silver Screens) ప్రకటన చేసింది. కాగా U/A సర్టిఫికెట్ ఉంటే ఆ వయసు గల వారిని అనుమతించకూడదనే నిబంధన లేదని ప్రేక్షకులు బదులు ఇస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా సెన్సార్ బోర్డుకు (Censor Board) సంబంధించిన ఉత్తర్వులను బహిర్గతపర్చారు. ఆ నిబంధనల్లో అలాంటిదేమీ లేదని గుర్తు చేస్తున్నారు.
మరోవైపు థియేటర్ యాజమాన్యం చేసిన సంఘటనపై చాలా మంది ఖండిస్తున్నారు. అయితే అప్పటికే ఈ వివాదం తారస్థాయికి చేరింది. ఈ సంఘటనపై సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar) స్పందించాడు. ‘రోహిణి థియేటర్ వద్ద జరిగిన ఘటన నన్ను బాధించింది. కళా ఏ ఒక్కరి సొత్తు కాదు. తర్వాత వారిని థియేటర్ లోపలికి అనుమతించారనే విషయం విన్నా’ అంటూ ట్వీట్ చేశాడు. మరోవైపు కమలహాసన్ ఈ విషయంపై స్పందించారు.... టికెట్ తీసుకున్న తర్వాత కూడా సంచార జాతి ప్రజలను థియేటర్లోకి అనుమతించకపోయిన సంఘటన ....సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత వారిని అనుమతించడం ఖండించదగిన విషయమన్నారు కమల్ హాసన్. దర్శకుడు వెట్రిమారన్ శ్రమజీవులను థియోటర్లోకి రానీయకుండా అడ్డుకోవడం ప్రమాదకరం అని అన్నారు.కాగా ఈ సినిమా హీరో శింబు స్పందించారని సమాచారం. ఆ సంచార జాతి కుటుంబాన్ని పిలిచి మాట్లాడినట్లు తెలుస్తున్నది. ఈ సంఘటనపై స్థానిక కోయంబేడు పోలీసులు రోహిణి థియేటర్ నిర్వాకంపై అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సమాచారం.