కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Shah) మణిపూర్(Manipur) పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ.. మణిపూర్ హింసాకాండపై విచారణకు జ్యుడీషియల్ కమిషన్‌ను(Judicial Commission) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) మణిపూర్(Manipur) పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ.. మణిపూర్ హింసాకాండపై విచారణకు జ్యుడీషియల్ కమిషన్‌ను(Judicial Commission) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు ఆరు హింసాత్మక ఘటనలపై కూడా సీబీఐ విచారణ చేపట్టనున్నట్లే పేర్కొన్నారు. హైకోర్టు(High Court) రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరుగుతుందని హోంమంత్రి తెలిపారు. హింసాకాండలో చనిపోయిన ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని, అందులో ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం, ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్నట్లు అమిత్ షా ప్రకటించారు.
ఆయుధాలు కలిగి ఉన్నవారు వాటిని పోలీసులకు అందజేయాలని హోంమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేపటి నుంచి పోలీసులు కూంబింగ్ ప్రారంభిస్తారని.. కూంబింగ్ సమయంలో ఆయుధాలు దొరికితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు గవర్నర్ అధ్యక్షతన ఒక శాంతి కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందులో వివిధ పౌర సంస్థల వ్యక్తులను కూడా చేర్చనున్నారు. హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులతో పాటు ఇతర మంత్రిత్వ శాఖల అధికారులు కూడా మణిపూర్ చేరుకుని ప్రజలకు సహాయం చేస్తారని హోం మంత్రి తెలిపారు.
20 మంది వైద్యులతో(doctors) కూడిన ఎనిమిది వైద్య నిపుణుల బృందాలను కూడా కేంద్ర ప్రభుత్వం మణిపూర్‌కు పంపుతుందని అమిత్ షా తెలిపారు. హింసాకాండ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఈ బృందాలు సహాయం చేస్తాయని పేర్కొన్నారు. ఐదు బృందాలు ఇప్పటికే మణిపూర్‌కు చేరుకోగా, మరో మూడు బృందాలు త్వరలో చేరుకోనున్నాయని వెల్లడించారు. పాఠశాలలను కూడా ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. పరీక్షలు కూడా ప్రణాళిక ప్రకారం నిర్వహించబడతాయని వివరించారు.
మణిపూర్ హైకోర్టు తొందరపాటు నిర్ణయం వల్ల ఇరు వర్గాల మధ్య హింస చెలరేగిందని షా అన్నారు. పుకార్లను పట్టించుకోవద్దని.. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన అమిత్ షా.. ఏ విధంగానైనా సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ (SOO) ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తిరుగుబాటు గ్రూపులను హెచ్చరించారు. మణిపూర్‌లో భద్రతకు సంబంధించిన వివిధ ఏజెన్సీల మధ్య మెరుగైన సమన్వయం కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ అధ్యక్షతన 'ఇంటర్ ఏజెన్సీ యూనిఫైడ్ కమాండ్' ఏర్పాటు చేయనున్నట్లు షా తెలిపారు. హింస సమయంలో నమోదైన కొన్ని కేసులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తుందని షా చెప్పారు.