గోల్నాక డీ-మార్ట్ పై కేసు నమోదైంది. ఓ వినియోగదారుడికి అమ్మిన వస్తువుల తూకంలో మోసం జరిగిందనే అభియోగం
గోల్నాక డీ-మార్ట్ పై కేసు నమోదైంది. ఓ వినియోగదారుడికి అమ్మిన వస్తువుల తూకంలో మోసం జరిగిందనే అభియోగం పై జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. గోల్నాక(Golnaka) అన్నపూర్ణ నగర్‌కు చెందిన సాయి అనే వ్యక్తి గురువారం డీ-మార్ట్‌లో సుమారు 8500 రూపాయల విలువ చేసే సరుకులు కొన్నాడు. ఇంటికి వెళ్లి సామాను సర్దుకుంటున్నప్పుడు ఎండు మిరపకాయల ప్యాకెట్ పై అనుమానం వచ్చింది. ప్యాకెట్ పై 500 గ్రాములు, ధర 299 రూపాయలు అని ఉంది. కానీ ప్యాకెట్‌లో మాత్రం 100 గ్రాముల ఎండు మిరపకాయలే ఉన్నాయి.
వెంటనే సాయి డీ-మార్ట్‌కు వెళ్లి విషయాన్ని అక్కడి ఇన్‌చార్జికి చెప్పాడు. అందుకు ఆ ఇన్ చార్జి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని దబాయించాడు. దీంతో సాయి స్థానిక నాయకులను అక్కడకు పిలిచి విషయం చెప్పాడు. స్థానిక నాయకులు జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి(Srinivas Reddy), ఏఎస్సై శ్రీరామ్ సంజీవరావు, శివ తమ సిబ్బందితో వచ్చి తక్కువ తూకం గల ఎండు మిర్చి ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మిగతా వస్తువుల బరువులను అధికారులు తనిఖీ చేశారు. తనిఖీ లలో కొన్ని బాదం ప్యాకెట్లలో బాదం పుచ్చు పట్టినట్లు గమనించారు.వినియోగదారులను మోసం చేయడంతో పాటు ప్యాకెట్ పై అధిక బరువు ముద్రించి లోపల తక్కువ బరువు వస్తువు పెట్టి ఎక్కువ ధర తీసుకున్నందుకు 36(2) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.