ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న ఓ యువతిని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడో యువకుడు. ఆమె తలపై సిందూరం పెట్టాడు.
ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న ఓ యువతిని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడో యువకుడు. ఆమె తలపై సిందూరం పెట్టాడు. ఆ యువతి తండ్రి అతగాడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. లేకపోతే ఇంకేం ఘాతుకానికి ఒడిగట్టేవాడో! ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీహార్(Bihar)లోని బంకా జిల్లా(Banka District)లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ ముగిసిన తర్వాత ఆ యువతి తన తండ్రితో కలిసి బైక్‌పై ఇంటికి వస్తున్నది. ఆ సమయంలో మొహానికి ముసుగు వేసుకున్న ఓ యువకుడు వారిని అడ్డుకున్నాడు. నాటు తుపాకీతో బెదిరించాడు. ఆ యువతిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడు. తండ్రి అతగాడి చేష్టలను అడ్డుకున్నాడు. ఆమె కారణంగా తాను పూర్తిగా నాశనమయ్యానని, ఆమెను విడిచిపెట్టనని అరుచుకుంటూ బలవంతంగా ఆమె తలపై సిందూరం పెట్టాడు. ఇదంతా ఆ యువకుడితో పాటు వచ్చిన ఓ వ్యక్తి మొబైల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. ఈ ఘటనపై ఆ యువతి మహిళా పోలీసులకు కంప్లయింట్ చేసింది. బభంగమాలో ఉంటున్న సౌరబ్ సోను రోజూ తన వెంటపడి వేధిస్తున్నాడని, పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడని పోలీసులకు తెలిపింది. ఇదే విషయంపై రెండు నెలల కిందట పోలీసులకు ఫిర్యాదు చేస్తే అప్పుడు సౌరబ్‌ను పిలిచి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అయినా అతడికి బుద్ధి రాలేదని, ఇంకా తనను వేధిస్తూనే ఉన్నాడని ఆ యువతి చెప్పింది. సౌరబ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.