భారతదేశ ప్రప్రథమ ప్రధానమంత్రి(Prime Minister) పండిట్‌ జవహర్‌లాల్ నెహ్రూ(Pandit Jawaharlal Nehru) భార్య(Wife) మొన్న కన్నుమూశారు. అదేమిటి? కమలానెహ్రూ(Kamala Nehru) 1936లోనే కదా చనిపోయింది? ఇదేమిటి కొత్తగా అన్న అనుమానం వచ్చేస్తున్నది కదూ! ఆమె నెహ్రూ భార్యో కాదో..! కానీ ఆమె తెగ మాత్రం అలాగే నమ్మింది.. ఆ నమ్మకం ఆమె జీవితాన్ని దుర్భరం చేసింది. ఎవరామె? ఏమిటామె కథ? అంటే 64 ఏళ్ల వెనక్కి వెళ్లాలి.

భారతదేశ ప్రప్రథమ ప్రధానమంత్రి(Prime Minister) పండిట్‌ జవహర్‌లాల్ నెహ్రూ(Pandit Jawaharlal Nehru) భార్య(Wife) మొన్న కన్నుమూశారు. అదేమిటి? కమలానెహ్రూ(Kamala Nehru) 1936లోనే కదా చనిపోయింది? ఇదేమిటి కొత్తగా అన్న అనుమానం వచ్చేస్తున్నది కదూ! ఆమె నెహ్రూ భార్యో కాదో..! కానీ ఆమె తెగ మాత్రం అలాగే నమ్మింది.. ఆ నమ్మకం ఆమె జీవితాన్ని దుర్భరం చేసింది. ఎవరామె? ఏమిటామె కథ? అంటే 64 ఏళ్ల వెనక్కి వెళ్లాలి.
అది 1959, డిసెంబర్‌ 6. ఆ రోజున దామోదర నదిపై నిర్మించిన పాంచెట్ డ్యామ్‌(Panchet Dam), జలవిద్యుత్తును ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ప్రధాని నెహ్రూ వచ్చారు. ఆయనకు స్వాగతం చెప్పడానికి కొందరు ఆదివాసీ మహిళలను(Tribe women) దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ అధికారులు పిలిచారు. వారంతా ఆ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన కూలీలు. వారిలో ఓ 15 ఏళ్ల అమ్మాయి కూడా ఉంది! ఆమె పేరు బుద్ధిని మంఝి(Buddhini Manjhi).. సంతాలీ తెగకు చెందిన అమ్మాయి. అన్నట్టు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) కూడా ఆ తెగకు చెందినవారే! వారి కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన నెహ్రూకు ఓ ఆలోచన వచ్చింది. ప్రాజెక్టు కారణంగా చాలా మంది ఆదివాసీలు భూములు కోల్పోయారు. అయినా ప్రాజెక్టు నిర్మాణానికి కష్టపడి పని చేశారు. వారి త్యాగం, సేవానిరతి అమోధం. అందుకని వారితోనే ప్రాజెక్టు ప్రారంభింపచేయాలని భావించారు నెహ్రూ. అందుకోసం బుద్ధిని మంఝిను పిలిపించారు. ఆమెతో బటన్‌ నొక్కించి ప్రాజెక్టు ప్రారంభింపచేశారు. ఓ ప్రాజెక్టును ఓ కూలీ ప్రారంభించడం అదే మొదటిసారి. ఆమె బటన్‌ నొక్కగానే అక్కడ చప్పట్లు మోగాయి. ఆమె మర్యాదపూర్వకంగా నెహ్రూ మెడలో దండవేశారు. నెహ్రూ సరదా సరదాగా ఉంటారన్న సంగతి తెలుసుకదా! ఆయన నవ్వుతూ ఈ ఘనతలు, గౌరవాలు, మర్యాదలు దక్కాల్సింది నాకు కాదు, మీకే అంటూ ఆ దండను తిరిగి ఆమె మెడలో వేశారు. ఆమెకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చి శుభాభివందనాలు తెలిపారు.

ప్రారంభోత్సవ వేడుకలు ముగిశాయి. ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు. బుద్ధిని మంఝిన్‌ కూడా తన ఊరుకు వెళ్లారు. ప్రస్తుతం ఆ గ్రామం జార్ఖండ్‌లో(Jharkhand) ఉంది. ఆమె తన స్వస్థలానికి మధురస్మృతులతో వెళ్లారు. ప్రధానికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చే అవకాశం ఎందరికి లభిస్తుంది? ప్రధాని చేతుల మీదుగా మెడలో దండ వేయించుకునే అదృష్టం ఎందరికి దక్కుతుంది? తనకు గొప్ప గుర్తింపు లభించిందన్న ఆనందంతో ఊరికి వెళ్లారు. కానీ అక్కడ ఆనందం ఆవిరయ్యింది. నెహ్రూ దండ వేయడం ఆమెకు శాపంగా మారింది. జీవితాంతం ఆ బాధతోనే బతికారు. మొన్న 17వ తేదీన కన్నుమూసేవరకు ఎంతో క్షోభను అనుభవించారు. ఆమె ఊరికి వెళ్లగానే ఊరిపెద్దలు పంచాయితీ పెట్టారు. 'నువ్వు నెహ్రూ మెడలో దండ వేశావు. ఆయన కూడా నీ మెడలో దండవేశాడు. ఇద్దరూ చేతులు కలుపుకున్నారు. తెగ ఆచారం ప్రకారం మీ పెళ్లి అయినట్టే! నువ్వు ఆయన భార్యవే! ఆయన సంతాలీ తెగకు చెందిన వ్యక్తి కాదు కాబట్టి నువ్వు చేసుకున్న ఈ పెళ్లి మన కట్టుబాట్లకు వ్యతిరేకం. నిన్ను తెగ నుంచి వెలివేస్తున్నాం' అని చెప్పారు. పెద్దల తీర్మానంతో బిత్తరపోయారు బుద్దిని. ఆమెకు ఏమీ పాలుపోలేదు. ఒక్కసారి తెగ నుంచి వెలివేసిన తర్వాత ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు? చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. పోనీ ఆమెను ఆ దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌(Damodar Valley Corporation) అయినా ఆదుకుందా? అంటే అదీ లేదు. ప్రారంభోత్సవ వేడుక జరిగిన మూడేళ్ల తర్వాత అంటే 1962లో ఆమెను ఉద్యోగంలోంచి తొలగించింది. అందుకు కారణం ఆమెపై ఆ తెగవారి కోపమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తర్వాత ఆమె జీవితం దుర్భరమయ్యింది. ఎక్కడా పని దొరకలేదు. పైగా అయినవారు కాదన్నారు. బతుకుతెరువు కోసం బెంగాల్‌లోని(Bengal) పురూలియాకు వలసవెళ్లారు. అక్కడ సుధీర్‌ దత్తా(Sudheer Datta) అనే యువకుడు పరిచయం అయ్యాడు. పెళ్లి చేసుకోవడానికి కులం కట్టుబాట్లు అడ్డువచ్చాయి. ఆమెతో సహజీవనం చేశారు. వీరికి ఓ అమ్మాయి పుట్టింది. రత్న అనే పేరుపెట్టుకుని పెంచి పెద్దచేశారు. ఏళ్లు గడుస్తున్నాయి కానీ ఆ తెగవారు పట్టినపంతం వీడలేదు. ఆమెను క్షమించి వెలిని వెనక్కి తీసుకోలేదు. మళ్లీ పాంచెట్‌కు వచ్చారు బుద్ధిని. ఆమె హృదయవిదారకగాధను కొన్ని పత్రికలు వెలుగులోకి తెచ్చాయి. ఆమె ఆవేదన రాజీవ్‌గాంధీకి(Rajiv Gandhi) తెలిసింది. ఆమెను తన దగ్గరకు పిలిపించుకున్నారు. ఆమెకు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ను ఆదేశించారు. ఆ విధంగా ఆమెకు మళ్లీ ఉద్యోగం దొరికింది. తన కూతురు రత్నది కూడా తనలాంటి పరిస్థితే! ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఓ వ్యక్తి వచ్చాడు. అతడితో పెళ్లి చేశారు. చనిపోయేంత వరకు కూతురు, అల్లుడి దగ్గరే ఉన్నారు బుద్ధిని. జీవితాంతం వెలి ముద్రతోనే బతికారు. అలా మన మాజీ ప్రధానమంత్రి నెహ్రూ గిరిజన భార్య ఎలాంటి గౌరవానికి నోచుకోకుండా కన్నుమూశారు.

Updated On 20 Nov 2023 5:53 AM GMT
Ehatv

Ehatv

Next Story