KTR Foxconn Company Letter : తెలంగాణలో రాజకీయ వేడి, కాళేశ్వరానికి కౌంటర్‌గా తెరపైకి ఫాక్స్‌కాన్
తెలంగాణ రాజకీయాలు(Telangana Politics) రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఓ వైపు కాళేశ్వరంపై(Kaleshwaram) ప్రతిపక్షాలు పాలకపక్షాన్ని విమర్శిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, అధికార పక్షానికి ఓ లేఖాస్త్రం దొరికింది. అక్టోబర్ 25న తమ రాష్ట్రానికి రావాలంటూ ఫాక్స్‌కాన్ కంపెనీకి(Foxconn Company) డీకే శివకుమార్(DK Shiva Kumar) లేఖ రాసినట్లు కేటీఆర్(KTR) ఓ లేఖను బయటపెట్టా
తెలంగాణ రాజకీయాలు(Telangana Politics) రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఓ వైపు కాళేశ్వరంపై(Kaleshwaram) ప్రతిపక్షాలు పాలకపక్షాన్ని విమర్శిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, అధికార పక్షానికి ఓ లేఖాస్త్రం దొరికింది. అక్టోబర్ 25న తమ రాష్ట్రానికి రావాలంటూ ఫాక్స్‌కాన్ కంపెనీకి(Foxconn Company) డీకే శివకుమార్(DK Shiva Kumar) లేఖ రాసినట్లు కేటీఆర్(KTR) ఓ లేఖను బయటపెట్టారు. హైదరాబాద్‌లో పెట్టదల్చుకున్న కంపెనీని బెంగళూరు తరలించాలని ఆ లేఖ సారాంశం. మీరు బెంగళూరుకు కంపెనీని తరలిస్తే మీకు చాలా ఇన్సెంటివ్‌లు ఇస్తామని, ఫ్రెండ్లీ ప్రభుత్వంలో కంపెనీలు పెట్టాలని కోరినట్లు ఆ లేఖలో ఉంది. ఐటీ ఎగుమతుల్లో బెంగళూరు దేశంలోనే నెం.1 సిటీ అని.. ఎన్నో వేల పరిశ్రమలకు బెంగళూరు నిలయమని, మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఆ లేఖ సారాంశం. అంతే కాదు హైదరాబాద్‌లో ఉన్న చాలా కంపెనీలు బెంగళూరుకు రావాడానికి సుముఖంగా ఉన్నాయని, త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, కంపెనీలు తరలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆ లేఖలో ఉన్నట్లు కేటీఆర్ వెల్లడించారు.
ఈ లేఖపై మంత్రి కేటీఆర్ ఫుల్ ఫైరయ్యారు. కాంగ్రెస్(Congress) ద్వంద్వ నీతికిది నిదర్శనమన్నారు. కేసీఆర్ లేకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని.. ఫాక్స్‌కాన్‌ను బెంగళూరు తరలించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కష్టపడి కంపెనీని తెచ్చుకుంటే ఇలా లేఖలు రాసి మా రాష్ట్రంలో ఉన్న కంపెనీలను తీసుకెళ్తారా అని ప్రశ్నించారు. నాలుగేళ్లు ఫాక్స్‌కాన్ వెంటపడి రాష్ట్రానికి తీసుకొచ్చామని.. లక్ష ఉద్యోగాలిచ్చే కంపెనీని తమ రాష్ట్రానికి తరలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నాలుగైదు నెలల క్రితం కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని ఏప్రిల్ లేదా మేలో తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని కేటీఆర్ అన్నారు. న్యాయవాదుల సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్ ఆ లేఖను అక్కడ ఉన్నవారందరికీ సర్క్యులేట్ చేశారు. కేసీఆరే మళ్లీ సీఎం కాకుంటే ఈ కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తారన్నారు.
అయితే ఈ లేఖను డీకే శివకుమార్ ఖండించారు. తాను ఫాక్స్‌కాన్‌కు ఎలాంటి లేఖ రాయలేదని, తన పేరుతో ఎవరో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారని తెలిపారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాళేశ్వరం అవినీతి బయటపడిందని, కాళేశ్వరం రీడిజైన్‌తో కేసీఆర్ కుటుంబం కమీషన్లు బొక్కిందని విమర్శించారు. మేడిగడ్డ డ్యామ్ పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని కేంద్ర కమిటీ చెప్పిందని కాంగ్రెస్ నేతలంటున్నారు. కేసీఆర్ చేసిన ఆర్థిక నేరం, అవినీతి బయటపడుతుందనే కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ బురద జల్లుతోందన్నారు. కాళేశ్వరం నుంచి దృష్టి మరల్చేందుకు కేసీఆర్, కేటీఆర్ ఈ పన్నాగం పన్నారని విమర్శిస్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగితే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటేననడానికి ఇదే నిదర్శనమని కాంగ్రెస్ చెప్తోంది.