కర్నాటక ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ బెంగళూరు నగరానికి తగినంత
కర్నాటక ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ బెంగళూరు నగరానికి తగినంత నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్.. బెంగళూరులోని అన్ని ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని, తన ఇంటి వద్ద ఉన్న బోరుబావి కూడా ఎండిపోయిందని అన్నారు. ప్రస్తుతం భయంకరమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాము.. అయితే నగరానికి ఎలాగైనా నీటి సరఫరా చేస్తామని ఆయన తెలిపారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా బోరుబావులు ఎండిపోవడంతో బెంగళూరు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. రోజువారీ నీటి వినియోగం పట్ల జాగ్రత్తగా ఉండాలని రెసిడెన్షియల్ సొసైటీలు సూచించాయి. ఈ సంక్షోభం మధ్య, అనేక ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు నీటి పంపిణీ కోసం నివాసితుల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. దీనిపై శివకుమార్ మాట్లాడుతూ.. కొన్ని ట్యాంకర్లలో రూ.600లకు నీటిని సరఫరా చేస్తుండగా, మరికొన్ని ట్యాంకర్లలో రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారని, ధరలను క్రమబద్ధీకరించేందుకు నీటి ట్యాంకర్‌లన్నీ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని కోరారు. ట్యాంకర్లు ప్రయాణించిన దూరం ఆధారంగా ధరను నిర్ణయిస్తామని తెలిపారు.