సినిమా హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఏమన్నా చెల్లుతుంది. కానీ ఆమె ఇప్పుడు లోక్‌సభ సభ్యురాలు. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ(BJP MP).
సినిమా హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఏమన్నా చెల్లుతుంది. కానీ ఆమె ఇప్పుడు లోక్‌సభ సభ్యురాలు. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ(BJP MP).మొన్నటి ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్(Himachal Pradesh)లోని మండీ(Mandi) లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారామె! ఎంపీ కాకమునుపు ఆమె ఎన్నో మార్లు ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని సార్లు తన అజ్ఞానాన్ని ప్రదర్శించుకున్నారు. మొదటి ప్రధానమంత్రి సుభాష్ చంద్రబోస్(Subhas Chandra Bose) లాంటి హస్య గుళికలు కూడా ఆమె నోటి వెంట వచ్చాయి. తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోదంటారు పెద్దలు. అన్నట్టుగానే ఆమె మళ్లీ ఓ చిత్రమైన వాఖ్య చేశారు. రైతుల ఉద్యమాన్ని బంగ్లాదేశతో ముడిపెట్టారు. చైనా(China), అమెరికా(America) వంటి విదేశీ శక్తులు భారత్‌లో పని చేస్తున్నాయన్నారు. తమ అగ్రనాయకత్వం బలంగా లేకుంటే బంగ్లదేశ్(Bangladesh)లో ఏం జరిగిందో భారత్‌లో కూడా అదే జరగడానికి ఎక్కువ సమయం పట్టదు అని కంగనా అన్నారు. "ఇక్కడ రైతుల ఉద్యమాలు ఉన్నాయి. అక్కడ మృతదేహాలు వేలాడుతున్నాయి. అత్యాచారాలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ అల్లర్ల మాదిరిగా రైతుల దగ్గర పెద్ద ప్లాన్ ఉంది. ఇలాంటి కుట్రలా? రైతులంతా ఏమనుకుంటున్నారు? చైనా, అమెరికాలాంటి విదేశీ శక్తులు ఇక్కడ పనిచేస్తున్నాయి' అంటూ తన అపారమైన తెలివితేటలను ప్రదర్శించారు. కంగనా వ్యాఖ్యలతో బీజేపీ ఇరుకునపడింది. వెంటనే ఓ ప్రకటన విడుదల చేసింది. 'కంగనా వ్యాఖ్యలను పార్టీ వ్యతిరేకిస్తోంది. పార్టీ తరపున, పార్టీ విధానాల తరపున ప్రకటనలు, వ్యాఖ్యలు చేసేందుకు ఆమెకు ఎలాంటి అధికారం లేదు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యవద్దని కంగనా రనౌత్‌ను పార్టీ ఆదేశిస్తోంది. సామాజిక ఐక్యత కోసం సబ్‌కా సాత్(Sabka Saath), సబ్‌కా వికాస్(Sabka Vikas),సబ్‌కా విశ్వాస్(Sabka Vivas), సబ్‌కా ప్రయాస్(Sabka Prayas) అనే విధానాన్ని అనుసరిస్తున్నాం' అని ఆ ప్రకటనలో తెలిపింది.
కంగనారైతుల ఆందోళనపై చౌకబారు వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు చాలా సార్లు ఇలాంటి చెత్త వాగుడే వాగారు. అందుకే మొహాలీ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్(CISF)కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ కంగనా చెంప వాయించారు. రైతుల ఉద్యమ సమయంలో కంగనా చేసిన వ్యాఖ్యలకు బదులుగానే ఆమె చెంప చెళ్లుమనిపించానని కుల్వీందర్ కౌర్(Kulwinder Kaur) అనే మహిళా కానిస్టేబుల్ చెప్పుకొచ్చారు. 88 ఏళ్ల మహిళా రైతు మహిందర్ కౌర్ వంగిన నడుముతో పంజాబ్ రైతులతో కలిసి జెండాను పట్టుకుని కవాతు చేస్తున్న దృశ్యాలను నాలుగేళ్ల కిందట బీబీసీ ప్రసారంచేసింది. బీజేపీ ఐటీ సెల్ వెంటనే మహిందర్ కౌర్ ఫోటోను షహీన్‌బాగ్ ధర్నాలో పాల్గొన్న బిల్కిస్ దాదీతో పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది.
ఆ సమయంలో, కంగనా రనౌత్(Kangana Ranaut) బిల్కిస్ దాదీ, మహిందర్ కౌర్ కలిసి ఉన్న ఫోటోలను ట్విట్టర్‌లో(ఎక్స్) పోస్ట్ చేసింది. 'టైమ్ మ్యాగజైన్ వంద మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఉన్న ఈ అమ్మమ్మ, ఇప్పుడు వంద రూపాయల కోసం ఉద్యమానికి అందుబాటులో ఉన్నారు' అని రాసుకొచ్చారు. జులైలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శివుడు, చక్రవ్యూహం, మహాభారత కథ గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత కంగనా మాట్లాడుతూ రాహుల్ గాంధీ పిచ్చి మాటలు చూస్తే, ఆయన ఏవైనా డ్రగ్స్ తీసుకున్నాడేమో పరీక్షించాలనిపిస్తోంది' అని లోకసభలో వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేన పార్టీకి వెన్నుపోటు పొడిచి ఏక్‌నాథ్ షిండే సీఎం అయ్యారు. అప్పుడు ఆమె రాజకీయ నాయకుడు రాజకీయాలు చేయకపోతే, పానీ పూరి అమ్ముతాడా అని తన సోషల్ మీడియా ద్వారా కంగనా ప్రశ్నించారు. 'మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ద్రోహి, మోసగాడు అంటూ అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన శంకరాచార్య మనందరి మనోభావాలను గాయపరిచారు. ఇలాంటి చిన్న చిన్న అంశాల గురించి మాట్లాడి ఆయన హిందువుల గౌరవాన్ని మంటగలుపుతున్నారు' అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. 2021లో ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో '1947లో యాచించడం వల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. 2014 సంవత్సరంలో దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సినీ నటి తాప్సీ, స్వర భాస్కర్‌లపై కంగనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వీరిద్దరిని బీ-గ్రేడ్ యాక్టర్లు అని చెప్పారు కంగనా! మచ్చుకు ఇవి కొన్ని ఉదాహరణలే! ఇప్పుడు రైతుల ఉద్యమంపై అవాకులు చెవాకులు మాట్లాడినందుకు బీజేపీ అధినాయత్వం సీరియస్ అయ్యింది. ఓ క్లారిటీ ఇచ్చుకుంది.