ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదట!

ఇది విన్నారా? కంగనా రనౌత్‌(Kangana ranauth) స్వీయ దర్శకత్వంలో తీసిన ఎమర్జెన్(emergency)సీ సినిమాకు సెన్సార్‌ బోర్డు(censor Board) సర్టిఫికెట్ ఇవ్వడం లేదట! ప్రధానమంత్రి నరేంద్రమోదీకి(Narendra modi) పరమభక్తురాలు, ఎంపీ అయిన కంగనా రనౌత్‌ సినిమాకు సర్టిఫికెట్‌ ఇవ్వకపోవడమా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! దివంగత భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ(Indra gandhi) ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కంగనా రనౌత్‌ ఈ సినిమాను తెరకెక్కించారన్న విషయం అందరికీ తెలుసు. ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటిస్తున్న సంగతి కూడా తెలుసు. నిజానికి ఈ సినిమా గత ఏడాది నవంబరు 24వ తేదీన విడుదల కావాలి. కానీ అనుకోని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. తర్వాత జూన్‌ 14వ తేదీన విడుదల చేయనున్నట్టు కంగనా తెలిపారు. అదీ వాయిదా పడింది. అందు కారణం కంగనా రాజకీయాల్లోకి రావడం, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవడంతో రాజకీయాలలో బిజీ అయ్యారు. అందుకే సినిమా రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాను ఈ నెల 6వ తేదీన విడుదల చేయనున్నట్టు కంగనా చెప్పారు. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డటంతో ఇప్ప‌టికే వ‌రుస ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటున్నారు కంగనా. ఈ క్రమంలోనే సెన్సార్ బోర్డ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ ఇంకా సర్టిఫికేట్‌ ఇవ్వట్లేద‌ని తెలిపారు. 'త్వ‌ర‌లోనే మా సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంటుంద‌ని ఆశిస్తున్నా. సెన్సార్‌ బోర్డులో చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయి. మేము ఎమర్జెన్సీ సినిమా సెన్సార్ స‌ర్టిఫికేట్ కోసం వెళ్లిన‌ప్పుడు కొంత‌మంది వ్య‌క్తులు పెద్ద డ్రామా చేశారు. నేను సెన్సార్ బోర్డ్‌ను న‌మ్ముతున్న. కానీ వాళ్లు నా సినిమాకు వాళ్లు సర్టిఫికేట్‌ ఇవ్వడం లేదు. సర్టిఫికేట్ జారీ చేయ‌డంలో ఆల‌స్యం చేస్తున్నారు. నా సినిమా కోసం నేను పోరాటం చేయ‌డానికి రెడీగా ఉన్నా. అందుకోసం కోర్టు వ‌ర‌కు వెళ్లడానికి అయినా సిద్ధం' అని కంగనా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను తెలంగాణలో(Telangana) నిషేధం విధించే అవకాశాలున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమర్జెన్సీ సినిమా విడుదలపై ప్రభుత్వం న్యాయపరమైన సంప్రదింపులు జరుపుతూ, నిషేధం అంశాన్ని పరీలిస్తుందని ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ తెలిపారు. మాజీ ఐపీఎస్‌ అధికారి తేజ్‌ దీప్‌ కౌర్ మీనన్‌ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధుల బృందం షబ్బీర్‌ను కలిసి ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం విధించాలని కోరింది. సిక్కు సొసైటీ ప్రతినిధులు సినిమాలో సిక్కు సమాజాన్ని చూపించిన తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. రాష్ట్రంలో సినిమాను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని(CM revanth reddy) షబ్బీర్‌ అలీ రిక్వెస్ట్ చేశారు.

Eha Tv

Eha Tv

Next Story