భారతీయ జనతా పార్టీ(BJP) కొత్త జాతీయ అధ్యక్షులు ఎవరనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
భారతీయ జనతా పార్టీ(BJP) కొత్త జాతీయ అధ్యక్షులు ఎవరనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. సారథి ఎంపిక కోసం బీజేపీ అధిష్టానం కసరత్తులు చేస్తున్నది. డిసెంబర్ కల్లా కొత్త అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేయాలన్నది అధిష్టానం భావన. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాల యూనిట్‌ను ఆదేశించింది. ఇప్పటికే సంస్థాగత ఎన్నికల నిర్వహణ కోసం కె.లక్ష్మణ్ సారథ్యంలో ఎన్నికల కమిటీని నియమించారు. రెండు రోజుల కిందట కమిటీ పార్టీ కీలక నేతలతో వర్క్‌షాపును నిర్వహించింది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై మార్గదర్శనం చేసింది. బీజేపీలో మొదట బూత్, తర్వత మండల, అటు పిమ్మట జిల్లా స్థాయిలో ఎన్నికల(ELections) ప్రక్రియను నిర్వహిస్తారు. ఎన్నికల అధికారులు ప్రకటించే తేదీలలో బూత్, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. వీటితో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ఎన్నిక కూడా జరుగుతుంది. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాష్ట్రాల అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. జాతీయ కౌన్సిల్ సభ్యులు జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి రెండు నెలల సమయం పడుతుంది. ఇదంతా డిసెంబర్ రెండో వారానికి పూర్తవుతుంది, ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు.
ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా(JP nadda) పదవీకాలం నిజానికి గత ఏడాది డిసెంబర్‌లోనే ముగిసింది. అయితే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నడ్డా పదవీకాలాన్ని జూన్ 30 వరకు పొడిగించారు. ఇంకా ఆయనే కొనసాగుతున్నారు. బీజేపీ అధినాయకత్వం కొత్త అధ్యక్షుడి కోసం చాలా పేర్లనే అనుకుంది. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి(Kishan reddy) కూడా అధిష్టానం దృష్టిలో ఉన్నారు. ఈయనతో పాటు శివరాజ్‌సింగ్ చౌహాన్(shivaraj sngh) (మధ్యప్రదేశ్), సునీల్ భూపేంద్ర యాదవ్(sunil bhupendra yadav) (రాజస్తాన్), దేవేంద్ర ఫడ్నవీస్ (మహారాష్ట్ర), ధర్మేంద్ర ప్రధాన్ (ఒడిశా)ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దక్షిణాదిలో పాగా వేయాలంటే అధ్యక్ష పదవి ఇక్కడి వారికి ఇస్తేనే మంచిదనే అభిప్రాయంతో అధినాయకత్వం ఉంది. కర్ణాటకలో అధికారాన్ని నిలుపుకోవడం పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో పార్టీని మరింత విస్తరించాలని అనుకుంటోంది.