ఆపద సమయంలో సహాయం చేసే వారిని గుర్తు పెట్టుకోవాలని అంటూ ఉంటారు

ఆపద సమయంలో సహాయం చేసే వారిని గుర్తు పెట్టుకోవాలని అంటూ ఉంటారు. అయితే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అలా సాయం చేసే వాళ్లకు ద్రోహం చేస్తుందని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాకరే ఆదివారం అన్నారు. తమ పార్టీ ముంబై నార్త్ ఈస్ట్ లోక్‌సభ అభ్యర్థి సంజయ్ దీనా పాటిల్ కోసం చేసిన ర్యాలీలో ఆదిత్య థాకరే మాట్లాడుతూ.. రెండు పార్టీలు దశాబ్దాల పొత్తును కలిగి ఉన్నప్పటికీ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా శివసేనకు బీజేపీ ద్రోహం చేసిందని అన్నారు. మేము బీజేపీకి ఇంతకు ముందు మిత్రపక్షంగా ఉన్నాము.. కానీ 2019లో మళ్లీ మాకు ద్రోహం చేసింది. అందుకే మేము కాంగ్రెస్, NCP నుండి మద్దతును తీసుకున్నాం. ఆ తర్వాత బీజేపీ మా పార్టీని విచ్ఛిన్నం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది (2022లో). బీజేపీ తనకు మద్దతిచ్చే వారిని మోసం చేస్తుందని ఆదిత్య థాకరే ఆరోపించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తూ ఉందని ఆదిత్య ఆరోపించారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లను అరెస్టు చేయించిందని అన్నారు. అయితే ప్రజల నుండి వ్యతిరేకత వస్తూ ఉండడంతో భారతీయ జనతా పార్టీ తప్పకుండా పశ్చాత్తాప పడాలని అన్నారు.

Updated On 7 April 2024 9:04 PM GMT
Yagnik

Yagnik

Next Story