ప్రస్తుతం ఎన్నికల్లో కుల సమీకరణలు ప్రధాన ఎజెండాగా మారాయి. అభ్యర్థి గుణగణాల కంటే ఏ నియోజకవర్గంలో ఏ సామాజికవర్గానికి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి? ఏ సామాజికవర్గం ఎన్నికలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది అన్నదానిపైనే ఎన్నికలు ఆధారపడ్డాయి. ఎక్కువ ఓట్లున్న సామాజికవర్గాలను దువ్వడం రాజకీయ పార్టీలకు రివాజుగా మారింది. ఇప్పుడు జరగబోతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఎన్నికల్లో కుల సమీకరణలు ప్రధాన ఎజెండాగా మారాయి. అభ్యర్థి గుణగణాల కంటే ఏ నియోజకవర్గంలో ఏ సామాజికవర్గానికి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి? ఏ సామాజికవర్గం ఎన్నికలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది అన్నదానిపైనే ఎన్నికలు ఆధారపడ్డాయి. ఎక్కువ ఓట్లున్న సామాజికవర్గాలను దువ్వడం రాజకీయ పార్టీలకు రివాజుగా మారింది. ఇప్పుడు జరగబోతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో(Karnataka Assembly Eletions) ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని రాజకీయపార్టీలు లింగాయత(Lingayat)సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. లింగాయతలకు వరాలు కురిపిస్తున్నాయి. కర్ణాటకలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల తర్వాత లింగాయతలదే అత్యధిక జనాభా. అందుకే పార్టీలు లింగాయత ముఖ్యమంత్రి అభ్యర్థి అన్న నినాదాన్ని భుజాన ఎత్తుకున్నాయి. టికెట్ల కేటాయింపులో కూడా లింగాయతలకే అధిక ప్రాధాన్యతను ఇచ్చాయి. బీజేపీకి చెందిన సీనియర్ నేతలు జగదీశ్ షెట్టర్(Jagadish Shettar), లక్ష్మణ సవాది(Laxman Savadi)లు మొన్నీమధ్యనే ఆ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్‌లో చేరారు.
రాజకీయాలలో వీరిద్దరు తలపండినవారే! జగదీశ్ షెట్టర్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. లక్ష్మణ్ సవాది ఉపముఖ్యమంత్రిగా పని చేశారు. వీరికి బీజేపీ టికెట్లు కేటాయించలేదు. దాంతో వీరిద్దరు కాంగ్రెస్(Congress)లో చేరారు. గమనించదగ్గ విషయమేమిటంటే వీరి సామాజికవర్గం లింగాయత కావడం. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే లింగాయతలను చిన్నచూపు చూస్తున్నదని, బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన బి.ఎస్.సంతోష్ ఇందుకు కారణమని జగదీశ్, లక్ష్మణలు ఆరోపించారు. ఇది కాంగ్రెస్‌కు బలమైన అస్త్రంగా మారింది. అప్పట్నుంచి లింగాయత నేతలను బీజేపీ నిర్లక్ష్యం చేస్తున్నదనే వాదనను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళుతోంది. బి.ఎస్ యడియూరప్పను బలవంతంగా గద్దె దింపి దారుణంగా అవమానించిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది. ఈ ప్రచారంతో బీజేపీకి భయం పట్టుకుంది. జగదీశ్ షెట్టర్ కానీ, లక్ష్మణ సవాది కానీ పార్టీ వదిలి వెళతారని బీజేపీ ఏనాడూ అనుకోలేదు.
లింగాయత నాయకులను బీజేపీ తేలిగ్గా తీసుకుంటున్నదన్న ఆరోపణలతో ఉలిక్కిపడింది. ఇప్పటి వరకు తమకు అనుకూలంగా లింగాయతలు ఎక్కడ దూరమవుతారోనన్న ఆందోళన ఆ పార్టీలో మొదలయ్యింది. ఈ కారణంగానే యడియూరప్పకు అవసరానికి మించి ప్రాధాన్యతను ఇవ్వడం మొదలుపెట్టింది. షెట్టర్ రాజీనామా చేసిన రోజునే యడియూరప్పను ప్రొజెక్ట్ చేయసాగింది. పైగా యడియూరప్పతోనే లింగాయతలకు బీజేపీ ఎంతటి ప్రాధాన్యతనిస్తున్నదో చెప్పించింది. ఇది ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చెప్పలేం కానీ, పోయిన వారం యడియూరప్ప నివాసంలో లింగాయత నేతలు, మఠాధిపతులు సమావేశమయ్యారు. పలు తీర్మానాలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే లింగాయత సామాజికవర్గం వారే ముఖ్యమంత్రి అవుతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పసాగారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కూడా ఇంచుమించు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే లింగాయత నేతే సీఎం అవుతారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని ఆయన వ్యాఖ్యానించడం చూస్తుంటే నష్ట నివారణ చర్యకు బీజేపీ తెగ ప్రయత్నిస్తున్నదని అర్థమవుతోంది. బీజేపీ మంత్రుల నోటి వెంట కూడా ఇలాంటి మాటలే వస్తున్నాయి.
తమ పార్టీ లింగాయత అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయడం ఖాయమని, దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రకటన చేయాలని సవాల్ చేశారు. ముఖ్యమంత్రి బొమ్మై కూడా ఇలాంటి ఛాలెంజ్‌లే చేస్తున్నారు. ఎన్నికల్లో లింగాయతల ప్రభావం చాలా ఉంటుందన్న విషయం కాంగ్రెస్‌కు కూడా తెలిసొచ్చింది. అందుకే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దీన్నే ప్రధాన అస్త్రంగా మారింది. సీనియర్ నేత రాహుల్‌గాంధీ అయితే ఆ మంత్రాన్నే జపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ బాగల్‌కోటెలోని బసవకల్యాణలో ప్రత్యేక పూజలు చేశారు. బసవణ్ణ జయంతిని పురస్కరించుకుని ఆయన ప్రతిమకు ప్రత్యేక పూజలు చేశారు. మఠాధిపతులతో సమావేశమయ్యారు. లౌకికవాద సందేశాలు ఇచ్చిన బసవణ్ణ సిద్ధాంతాలకు బీజేపీ కాషాయం పూస్తున్నదని విమర్శించారు.
రాహుల్‌గాంధీ(Rahul Gandhi) లింగాయతలను ఆకట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటే సిద్ధరామయ్య(Siddaramaiah) మాత్రం అనవసరమైన వ్యాఖ్యలు చేసి వివాదాలు రేపుతున్నారు. మొన్న తన నియోజకవర్గం వరుణలో ప్రచారం చేసిన సిద్ధరామయ్య లింగాయత నేతలపై నోరుజారారు. అధికారంలోకి వస్తే లింగాయతలను ముఖ్యమంత్రిని చేస్తారా అని అడిగిన ప్రశ్నకు లింగాయత ముఖ్యమంత్రులంతా అవినీతిపరులేనని బదులిచ్చారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేట్టు చేసింది బీజేపీ. సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని బీజేపీ అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటిల్ వ్యాఖ్యానించి అగ్నిలో ఆజ్యంపోసే ప్రయత్నం చేశారు. ఇది తమకు ఎసరుతెచ్చేట్టుగా ఉందని భావించిన సిద్ధరామయ్య.. లింగాయత నేతలంతా అవినీతిపరులేనని తాను అనలేదని వివరణ ఇచ్చుకున్నారు. గతంలో సీఎంలుగా పని చేసిన నిజలింగప్ప, వీరేంద్రపాటిల్, జెహెచ్ పటేల్‌లు ఆ వర్గానికి మేలు చేసిన వారేనని, తాను ప్రస్తుత ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ అవినీతిపరుడని వ్యాఖ్యానించానని సిద్ధరామయ్య అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లలో లింగాయతలు ఎవరికి మద్దతునిస్తున్నారో అన్నది తేలాలంటే వచ్చే నెల 13వ తేదీ వరకు ఆగాలి..