మర్కర్‌వాడీ అనే చిన్న పల్లెటూరు అధికారవర్గాలను వణికిస్తున్నది.
మర్కర్‌వాడీ అనే చిన్న పల్లెటూరు అధికారవర్గాలను వణికిస్తున్నది. మహారాష్ట్ర(maharasta) సోలాపూర్ జిల్లా మల్షిరాస్ తహసీలులో ఉంటుందీ గ్రామం. ఇవాళ దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్న ఆ గ్రామంలో 1900 ఓటర్లు ఉన్నారు. వారు తీసుకున్న నిర్ణయం పాలకులలో దడ పుట్టిస్తోంది. తమ బంగారం బయటపడుతుందేమోనని భయపడుతున్నారు. భయం ఎందుకంటే ఈవీఎంల గుట్టు రట్టు అవుతుందేమోనని! దేశంలో మెజారిటీ ప్రజలకు కలుగుతున్నట్టుగానే ఆ గ్రామ ప్రజలకు కూడా ఈవీఎంపై అనుమానం కలిగింది. మొన్నటి ఎన్నికల్లో తాము ఇచ్చిన తీర్పును తామే బ్యాలెట్ పేపర్ల ద్వారా పునః పరిశీలించుకోవాలనుకున్నారు. ఆ ప్రజలలో కలిగిన చైతన్యం ఇప్పుడు అధికారవర్గాలకు దడ పుట్టిస్తోంది. ప్రజలందరూ కలిసి స్వచ్ఛదంగా అలాంటి పోలింగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. పాలకులకు ఇది తెలిసి గ్రామంలో మూడు రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. పెద్ద సంఖ్యలో పోలీసులను రంగంలోకి దించారు.
మల్షిరాస్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి మర్కర్ వాడీ గ్రామం వస్తుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌పవార్)కు చెందిన ఉత్తమ్‌రావు జన్ఖడ్ 13,147 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ సత్పుతేను ఓడించారు. తమ నాయకుడు గెలిచినప్పటికీ మర్కర్‌వాడీ ప్రజలకు పోలింగ్‌మీద అనుమానం అలాగే ఉండిపోయింది. ఉత్తమ్‌రావ్‌కు కూడా సందేహపడుతున్నారు. గత ఎన్నికల్లో ఆ గ్రామంలో ఆయనకు మంచి మెజారిటీ వచ్చింది. ఈసారి మాత్రం ఓట్లు తగ్గాయి. బీజేపీకి 1003 ఓట్లు వస్తే ఉత్తమ్‌రావ్‌కు 843 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉత్తమ్‌రావుకు ఆ గ్రామంలో బోల్డంత పాపులారిటీ ఉంది. పైగా కులం బలం కూడా ఎక్కువగా ఉంది. ఆ గ్రామంలో అత్యధికులు ఉన్న ధన్గఢ్ సామాజికవర్గానికి చెందినవారే ఉత్తమ్‌రావు. తమ అనుమానాన్ని తీర్చుకోవడం కోసం వారంతా తహసీల్దార్ దగ్గరకు వెళ్లి రీ ఎలక్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయన నో చెప్పడంతో ఈవీఎంలలో ఏదో మతలబు జరిగే ఉంటుందని, అందుకే బీజేపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయని డిసైడయ్యారు. తామే స్వయంగా బ్యాలెట్ పేపర్‌తో మాక్ పోలింగ్‌ను నిర్వహించుకోవాలనుకున్నారు. ఇందుకోసం మంగళవారం రోజును ఎంచుకున్నారు. వారు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలిసి పాలకులు వణికి పోయారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తెచ్చిన కొత్త నేర చట్టాల్లోని భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని 163 సెక్షన్ ప్రకారం ఆ చిన్న ఊరులో కర్ఫ్యూ విధించారు. మంగళవారు వాళ్లు పోలింగ్ ప్లాన్ చేసుకోగా గురువారం వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించారు. పైగా యాభై మంది సాయుధ పోలీసుల్ని మోహరించారు. తాము వేసిన ఓట్లు ఎలా మళ్లిపోయాయో చెక్ చేసుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తుంటే, అధికారులు మాత్రం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎవరెంత భయపెట్టినా, అడ్డుకోవాలనుకున్నా పోలింగ్ నిర్వహించి తీరుతామని అంటున్నారు. అధికారయంత్రాంగం ఇంతగా భయపడుతున్నదంటే ఈవీఎంలలో ఏదో జరిగే ఉంటుందని అనిపిస్తోంది..