ఉత్తరప్రదేశ్‌లోని అన్వర్‌గంజ్-కాస్‌గంజ్ మార్గంలో కాన్పూర్ నుంచి భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ (14117)కు ఆదివారం రాత్రి పెను ప్ర‌మాదం త‌ప్పింది

ఉత్తరప్రదేశ్‌లోని అన్వర్‌గంజ్-కాస్‌గంజ్ మార్గంలో కాన్పూర్ నుంచి భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ (14117)కు ఆదివారం రాత్రి పెను ప్ర‌మాదం త‌ప్పింది. నిండుగా ఉన్న సిలిండర్‌ను ట్రాక్‌పై ఉంచి రైలు పట్టాలు తప్పేందుకు కుట్ర పన్నారు. బర్రాజ్‌పూర్-బిల్హౌర్ మధ్య 100 కి.మీ వేగంతో వెళ్తున్న రైలు సిలిండర్‌ను ఢీకొనడంతో పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్‌ వేసి రైలును ఆపేశాడు. సిలిండర్‌తో పాటు గాజు వత్తి, అగ్గిపుల్ల, అనుమానాస్పద బ్యాగ్‌ను రైల్వే, ఆర్‌పిఎఫ్ అధికారులు సంఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు.

బ్యాగ్‌లో గన్‌పౌడర్ వంటి కొన్ని పదార్థాలు ఉండగా.. ఓ బాటిల్‌లో అనుమానాస్పద ద్రవం లభించింది. ఘటనా స్థలానికి ఏటీఎస్‌, ఎస్టీఎఫ్‌లు చేరుకుని ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం రాత్రి 8:25 గంటలకు కాళింది ఎక్స్‌ప్రెస్ అన్వర్‌గంజ్, రావత్‌పూర్ స్టేషన్ మీదుగా వెళ్లింది. ఆ త‌ర్వాత‌ బర్రాజ్‌పూర్ స్టేషన్ ముందు ముంధేరి క్రాసింగ్ దాటిన వెంటనే ఏదో పెద్ద శబ్దం వినిపించడంతో లోకో పైలట్ ట్రైన్‌ను ఆపేశాడు. ఎమర్జెన్సీ బ్రేక్ వేసి గార్డు రాజీవ్ కుమార్‌కు సమాచారం అందించాడు. ఈ ఘటనపై గార్డు రైల్వేశాఖకు మెమో పంపాడు. అన్వర్‌గంజ్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్, ఆర్‌పిఎఫ్, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదం బర్రాజ్‌పూర్‌కు రెండున్నర కిలోమీటర్ల దూరంలో.. బిల్‌హౌర్ స్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల ముందు జరిగింది.


విచారణలో ట్రాక్‌పై ఇనుము లాంటి వస్తువును రుద్దిన గుర్తులు కనుగొనబడ్డాయి. కన్నౌజ్ RPF ఇన్స్పెక్టర్ OP మీనా డ్రాగన్, సెర్చ్ లైట్ సహాయంతో రైల్వే ట్రాక్, చుట్టుపక్కల పొదలను పరిశీలించారు. ఘటనా స్థలం నుంచి నిండు ఎల్‌పీజీ సిలిండర్లు, అగ్గిపుల్లలు, సీసాలు, ఇతర సున్నితమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎంఎస్ ఖాన్ తెలిపారు. ఈ ఘటనతో రైలు దాదాపు 22 నిమిషాల పాటు నిలిచిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా బిల్హౌర్ స్టేషన్‌లో రైలును కూడా కొంతసేపు నిలిపివేశారు. లక్నో నుంచి బాంద్రా టెర్మినస్‌కు వెళ్లే లక్నో-బాంద్రా ఎక్స్‌ప్రెస్ కూడా బిల్హౌర్ స్టేషన్‌లో నిలిచిపోయింది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story