ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం భారతీయ జనతా పార్టీపై పెద్ద ఆరోపణ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు

Arvind Kejriwal alleges BJP tried to poach 7 AAP MLAs, offered them Rs 25 crore
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Aravind Kejriwal) శనివారం భారతీయ జనతా పార్టీ(BJP)పై పెద్ద ఆరోపణ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party)కి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. పార్టీని వీడేందుకు ఆప్ ఎమ్మెల్యేలకు రూ.25 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) కేసులో సీఎం కేజ్రీవాల్‌ను త్వరలో అరెస్ట్ చేస్తామని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు చెబుతున్నారని కేజ్రీవాల్ అన్నారు.
గత కొన్ని రోజులుగా బీజేపీ ఢిల్లీలోని ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను సంప్రదించింది. కొన్ని రోజుల తర్వాత కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తామని.. ఆ తర్వాత మీరు ఆప్ ఎమ్మెల్యేలను విచ్ఛిన్నం చేయాలని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలతో ఇలా చర్చలు జరిపారు. ఇతరులతో కూడా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటున్నారు. 25 కోట్లు ఇస్తామని, బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకుని ఎన్నికల్లో పోటీ చేయోవచ్చని చెబుతున్నట్లుగా కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే.. తాను 21 మంది ఎమ్మెల్యేలను సంప్రదించినట్లు చెబుతున్నప్పటికీ.. మా సమాచారం ప్రకారం బీజేపీ ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలను మాత్రమే సంప్రదించగలిగారు. అయితే వారు పార్టీని వీడేందుకు నిరాకరించారని వెల్లడించారు.
మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి నన్ను అరెస్టు చేయడం లేదని, వారు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. గత తొమ్మిదేళ్లలో మన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎన్నో కుట్రలు పన్నారు. ఇప్పటి వరకు ఏ విషయంలోనూ విజయం సాధించలేదు. దేవుడు, ప్రజలు ఎల్లప్పుడూ మాకు మద్దతు ఇచ్చారు. మా ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఉన్నారు. ఈసారి కూడా ఈ వ్యక్తులు తమ దుర్మార్గపు ఉద్దేశాలలో విఫలమవుతారని అన్నారు. ఢిల్లీ ప్రజల కోసం మా ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసు. వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మనం చాలా సాధించాం. నకిలీ మద్యం కుంభకోణం సాకుతో వీరిని అరెస్టు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారని ఆరోపించారు.
