NEET Paper Leak : నీట్ పేపర్ లీకేజీ నిజమే.. ముందురోజు రాత్రే నీట్ పేపర్ అందిందట!
మెడిసిన్(Medicine) చేయాలన్న లక్ష్యంతో దివరాత్రాలు కష్టపడి చదివిన విద్యార్థులు ఇప్పుడు కంటనీరు పెడతున్నారు. నీట్ యూజీ(NEET UG) ప్రవేశపరీక్షలో అక్రమాలు జరిగాయని తెలుసుకుని డిప్రెషన్‌లోకి(Depression) వెళుతున్నారు. ప్రశ్నాపత్రం లీక్ అవ్వడమే(Question Paper leak) కాదు, పరీక్ష నిర్వహణలో కూడా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పరీక్ష నిర్వహంచిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో(NTA) పాటు కేంద్రం కూడా ఆరోపణలలో వాస్తవం లేదని వాదిస్తోంది. కానీ పేపర్ లీక్ నిజమేనని లేటెస్ట్‌గా తెలిసింది. పరీక్షకు ముందు రోజు రాత్రే నీట్ ప్రశ్నపత్రం తమకు అందిందని బీహార్‌లో అరెస్ట్ అయిన కొందరు విద్యార్థలు పోలీసులకు చెప్పారు. నీట్ క్వొశ్చన్ పేపర్ లీకయ్యిందన్న ఆరోపణలపై బీహార్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దర్యాప్తుకు సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో బీహార్ ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ జూనియర్ ఇంజనీర్‌తో పాటు ముగ్గురు నీట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇందులో ఓ విద్యార్థి ఆ జూనియర్ ఇంజనీర్‌కు మేనల్లుడు. అతడు పోలీసులకు విషయాలన్నింటినీ పూసగుచ్చినట్టు చెప్పాడు. ' మేము నీట్‌కు ప్రిపేర్ అవ్వడానికి రాజస్థాన్‌లోని(Rajasthan) కోటాకు(Kota) వెళ్లాం. అక్కడ చదువుకుంటున్న నాకు మామయ్య ఫోన్ చేశారు. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశానని, ఇంటికి రమ్మని చెప్పాడు.. నీట్ పరీక్ష జరగడానికి ఒక రోజు ముందు అంటే మే 4వ తేదీ రాత్రి ఫ్రెండ్స్‌తో పాటు నేను మామయ్య దగ్గరకు వెళ్లాను. మామయ్య నాకు నీట్ ప్రశ్నపత్రం, ఆన్సర్ షీట్ ఇచ్చారు. రాత్రంతా వాటిని మేం బట్టీపట్టాం. మరుసటి రోజు పరీక్షా కేంద్రానికి వెళ్లిన తర్వాత ప్రశ్నపత్రాన్ని చూస్తే.. ముందు రోజు మామయ్య ఇచ్చిన పేపర్‌తో పూర్తిగా మ్యాచ్ అయ్యింది' అని ఆ నీట్ అభ్యర్థి పోలీసులకు చెప్పాడు. ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. మరోవైపు, నీట్ పరీక్ష అక్రమాలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పలు హైకోర్టుల్లో జరుగుతున్న విచారణలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. అన్ని పిటిషన్లను సుప్రీంకు బదిలీ చేయాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ కోరడంతో ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. ఇదే సమయంలో నీట్ యూజీ 2024 పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కేంద్రం, ఎన్‌టీఏకు నోటీసులు జారీ చేసింది. కాకపోతే నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియను ఆపేది లేదని సుప్రీం మరోసరి స్పష్టం చేసింది.