ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) తోడేళ్ల దాడులు(Warewolves Attack) పెరుగుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) తోడేళ్ల దాడులు(Warewolves Attack) పెరుగుతున్నాయి. అధికారులు ఎంతగా ప్రయత్నిస్తున్నా నిలువరించలేకపోతున్నారు. బహ్రయిచ్‌లోని మహసీ తహసీల్‌ ప్రాంతంలోని ప్రజలు మార్చి నెల నుంచి తోడేళ్ల దాడులను ఎదుర్కొంటున్నారు. చీకటి పడితే చాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఇప్పటికే తోడేళ్ల గుంపు ఏడుగురు పిల్లలతో పాటు ఎనిమిది మందిని పొట్టన పెట్టుకుంది. 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మహిళలు, పిల్లలు, వృద్ధులే ఎక్కువ. తోడేళ్లు ప్రతీకారం తీర్చుకునే రకమని, గతంలో వాటి పిల్లలను మనుషులు చంపేశారని, అందుకే అవి ప్రతీకారంతో దాడులకు తెగబడుతున్నాయని ఇండియన్‌ ఫారెస్ట్ సర్వీస్‌ రిటైర్డ్‌ అధికారి జ్ఞాన్‌ ప్రకాశ్‌ సింగ్‌ చెప్పారు. పాతికేళ్ల కిందట జౌన్‌పూర్‌, ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోని సాయి నది ఒండ్రు మట్టిలో తోడేళ్లు కనిపించేవని, కొందరు పిల్లలు తోడేళ్ల గుహలోకి వెళ్లి అక్కడున్న తోడేలు పిల్లలను చంపేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగిందని జ్ఞాన్‌ ప్రకాశ్‌ సింగ్‌ తెలిపారు.

ఈ నేపధ్యంలో ఆ తోడేళ్లు ప్రతీకార దాడులకు దిగుతున్నాయని, వాటి దాడుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 50 మందికి పైగా చిన్నారులు మృత్యువాత పడ్డారని వివరించారు. బహ్రైచ్‌లోని మహసీ తహసీల్ గ్రామాల్లో జరుగుతున్న తోడేలు దాడులకూ వాటి ప్రతీకారమే కారణం కావచ్చని జ్ఞాన్‌ ప్రకాశ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలల్లో బహ్రయిచ్‌లో రెండు తోడేళ్ల పిల్లలు ట్రాక్టర్‌ ఢీకొని చనిపోయాయి. దీంతో తోడేళ్లు దాడికి దిగడం మొదలుపెట్టాయి. అటవీ అధికారులు ఆ తోడేళ్లను పట్టుకుని అక్కడికి ఓ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చకియా అడవిలో వదిలిపెట్టారు. చకియా అడవిలో తోడేళ్లు ఉండలేవు. వాటికి అది సహజ నివాసం కాదు. అందుకే అవి అక్కడ్నుంచి ఘఘ్రా నది ఒడ్డున ఉన్న తమ గుహలోకి తిరిగి వచ్చాయి. మనుషుల మీద దాడులకు దిగుతున్నాయి. 'సింహాలు, పులులు, చిరుతపులులు ప్రతీకారం తీర్చుకోవు. కానీ తోడేళ్లకు మాత్రం ఆ స్వభావం ఉంటుంది. తోడేళ్లకు, వాటి పిల్లలకు మనుషుల నుంచి ఏదైనా హాని జరిగితే అవి ఊరుకోవు. మనుషులను వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాయి' అని బహ్రయిచ్‌ డివిజనల్‌ ఫారెస్ట్ ఆఫీసర్‌ అజిత్‌ ప్రతాప్‌సింగ్‌ వివరించారు.

Eha Tv

Eha Tv

Next Story