గడచిన రెండు వారాల్లో భారతీయ విమానాలకు 400 బాంబు బెదిరింపులు వచ్చాయి. వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నా ప్రభుత్వం
గడచిన రెండు వారాల్లో భారతీయ విమానాలకు 400 బాంబు బెదిరింపులు వచ్చాయి. వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నా ప్రభుత్వం, అధికార యంత్రాంగం, నిఘా సంస్థలు ఏం చేయలేకపోతున్నాయి. ఫలితంగా భారతీయ విమానయాన సంస్థల పరువు ప్రతిష్ట మంటకలుస్తోంది. ప్రయాణికులు భారతీయ విమానాలు ఎక్కడానికి జంకుతున్నారు. నిజంగానే బాంబ్ పెట్టారో, ఉత్తిత్తిగా కాల్ చేస్తున్నారో తెలియక విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేస్తున్నారు. ఈ కారణంగా ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల నష్టం వచ్చింది. సోమవారం ఏకంగా 62 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇందులో ఎయిర్ ఇండియా(Air India) విమానాలు 21, ఇండిగో(Indigo) విమానాలు 21, విస్తారా(Vistara) విమానాలు 20 ఉన్నాయి. ఎక్కువగా బాంబ్ బెదిరింపు ఈ-మెయిల్స్ లండన్(London), జర్మనీ(Germany) నుంచి వస్తున్నట్టు గుర్తించారు కానీ చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన బెదిరింపులన్నీ ఉత్తుత్తివే! అలాగని నిర్లిప్తంగానో, నిర్లక్ష్యంగానో ఉండేందుకు వీలులేదు. క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిందే. ఒకవేళ నిజంగానే బాంబ్ పెట్టి ఉంటే ప్రమాదం తీవ్రంగా ఉంటుంది కాబట్టే అధికారులు టెన్షన్ పడుతుంటారు. ఇప్పటికే ప్రయాణికులతో పాటు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది కూడా బాగా అలసిపోయారు. చాలినంత సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారే అదనంగా ఆరేడు గంటలు పని చేయాల్సి వస్తున్నది. ఇలా ఉత్తుత్తి బెదిరింపులకు పాల్పడే వారికి జీవిత ఖైదు విధిస్తామని హెచ్చరిస్తున్నా చేసేవారు చేస్తూనే ఉన్నారు.