పూరీ శ్రీ జగన్నాథస్వామి ఆలయంలోని(Puri Jagannatha Swamy temple) రత్న భాండాగారం(Ratna Bhandagar) తలుపులు ఎట్టకేలకు తెరచుకున్నాయి.
పూరీ శ్రీ జగన్నాథస్వామి ఆలయంలోని(Puri Jagannatha Swamy temple) రత్న భాండాగారం(Ratna Bhandagar) తలుపులు ఎట్టకేలకు తెరచుకున్నాయి. అమూల్యమైన ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు రత్న భాండాగారంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇదిలాఉంటే పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం దిగువన ఓ రహస్య గది(Secrete room) ఉందట! ఆ గదికి చేరుకోవడానికి సొరంగ మార్గంలో వెళ్లాలట! ఆ గదిలో కూడా విలువైన సంపదను దాచిపెట్టారని చరిత్రకారులు అంటున్నారు. 1902లో బ్రిటిష్ పాలకుల కాలంలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారని వారుఅంటున్నారు. రత్న భాండాగారం తెరిచి, సంపద లెక్కింపు పని మొదలు పెట్టిన బీజేపీ ప్రభుత్వం సొరంగ మార్గం, రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని చరిత్రకారులు సూచిస్తున్నారు. 'పూరీ రాజు కపిలేంద్రదేవ్ తూర్పు, దక్షిణ రాష్ట్రాలను జయించి, అమూల్యమైన సంపదను తెచ్చి జగన్నాథుడికి సమర్పించాడని చరిత్ర చెబుతోంది. తర్వాత సింహాసనాన్ని అధిష్టించిన పురుషోత్తం దేవ్ పాలనలో కూడా జగన్నాథుడుకి సంపద చేకూరిందని అంటారు. అప్పట్లో శ్రీక్షేత్ర భాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపర్చడానికి రహస్య గది నిర్మించారు. ఇందులో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మికి సంబంధించిన వడ్డాణాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలున్నాయి. ఈ సంపద అమూల్యమైనది. పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువు దీరిన ఆధారాలున్నాయి’ అని ప్రముఖ చరిత్రకారుడు నరేంద్రకుమార్ మిశ్ర చెబుతున్నారు. ముస్లిం దండయాత్రల సమయంలో ఉత్కళ సామ్రాజ్యంపై అనేక దాడులు జరిగాయి. ఆ సందర్భంగా స్వామివారి సంపదను దోచుకోకుండా నాటి రాజు రహస్య గదులు నిర్మించి, వాటిలో దాచినట్లు మరో చరిత్రకారుడు డాక్టర్ నరేశ్‌చంద్ర దాస్ పేర్కొన్నారు