పార్టీ రాష్ట్ర శాఖతో సమావేశమై రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మధ్యప్రదేశ్‌కు వెళ్లనున్నారు. గత 15 రోజుల్లో మధ్యప్రదేశ్‌లో అమిత్ షా పర్యటించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

Amit Shah Madhya Pradesh visit for discuss poll strategy with party leaders in bhopal
పార్టీ రాష్ట్ర శాఖతో సమావేశమై రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) వ్యూహంపై చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) ఈరోజు మధ్యప్రదేశ్‌కు వెళ్లనున్నారు. గత 15 రోజుల్లో మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో అమిత్ షా పర్యటించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. అమిత్ షా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లలో ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షిస్తున్నారని, నిరంతరం పార్టీ నేతలతో సమావేశమవుతూ రాబోయే ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది చివరి నాటికి మధ్యప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్(Rajasthan), తెలంగాణ(Telangana), మిజోరాం(Mizoram) రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇదిలావుంటే.. పార్లమెంటులో మణిపూర్(Manipur) అంశంపై ప్రతిష్టంభన నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభలో ఇద్దరు ప్రతిపక్ష నాయకులకు అమిత్ షా లేఖ రాశారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని.. పార్టీ శ్రేణులకు అతీతంగా అన్ని పార్టీల నుండి సహకారం కోరుతున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అధికారం కోసం కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) జూన్‌లో జబల్‌పూర్ పర్యటనతో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. ఆమె ఇప్పటివరకూ రాష్ట్రంలో రెండుసార్లు పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు ఎన్నికల హామీలను ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా నేతలకు బాధ్యతలు అప్పగించింది. పార్టీ వ్యూహం ప్రకారం.. ప్రియాంక గాంధీ వాద్రా పట్టణ ప్రాంతాల్లో పార్టీ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ(Rahul Gandhi) గిరిజన, దళిత, గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెడతారని సమాచారం. అయితే రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ పక్షాన ఉన్నారనే సంకేతాలు ఉండటంతో బీజేపీ అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ బాధ్యతలను అమిత్ షా భుజాన వేసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమిత్ షా భోపాల్(Bhopal) పర్యటన సందర్భంగా ఆయనకు రక్షణగా సుమారు వెయ్యి మంది పోలీసులు భద్రత కల్పించనున్నారు. పోలీసులు బయటి నుంచి రాష్ట్రంలోకి వచ్చే వారిని భద్రత నిమిత్తం హోటళ్లు, లాజ్‌లు, ధర్మశాలల్లో తనిఖీలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్‌లో తనిఖీలు చేస్తున్నారు. భడ్భదా, హోటల్ తాజ్ ప్రాంతాలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. డ్రోన్లు, పారాగ్లైడర్లు, హాట్ బెలూన్లు ఇతర ఎగిరే వస్తువులను ఎగురవేయడంపై నిషేధం విధించారు. జూలై 26 నుండి 27 సాయంత్రం వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. నిబంధనలు అతిక్రమిస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నిబంధన వాణిజ్య విమానాలకు వర్తించదని పోలీసులు పేర్కొన్నారు. షా భద్రతపై పోలీసు కమిషనర్ హరినారాయణచారి మిశ్రా(Harinarayanachari Mishra) మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
