కోర్టుకెక్కిన దెయ్యం!
భూ వివాద పరిష్కారం కోసం ఓ దెయ్యం(Ghost) కోర్టుకెక్కింది. హడలిపోకండి. నిజంగానే దెయ్యం న్యాయస్థానానికి ఎక్కింది. నమ్మశక్యంగా లేని ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) కుషీనగర్‌లో(Kushi nagar) జరిగింది. న్యాయవ్యవస్థను, పోలీసు వ్యవస్థను అయోమయానికి, గందరగోళానికి గురి చేసిన ఈ దెయ్యం కథమేమిటో చూద్దాం. ఓ భూ వివాదంలో(Land Problem) 2011లోనే చనిపోయిన శబ్ద్ ప్రకాశ్(shabd prakash) అనే వ్యక్తి 2014లో ఓ కుటుంబంలోని అయిదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసులు శబ్ద్ ప్రకాశ్ వాంగ్మూలం కూడా రికార్డు చేశారు. తర్వాత ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు(allahabad) చేరింది. పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే నిందితులుగా ఉన్న పురుషోత్తం సింగ్, ఆయన ఇద్దరు సోదరులు, ఇద్దరు కుమారులు ఈ చార్జ్‌షీట్‌పై కోర్టులో సవాల్ చేశారు. శబ్ద్ ప్రకాశ్ అనే వ్యక్తి 2011లోనే చనిపోయాడంటూ నిందితుల తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. సాక్ష్యాధారంగా డెత్ సర్టిఫికెట్‌ను కోర్టుకు సమర్పించాడు. తన భర్త చనిపోయాడన్న విషయాన్ని శబ్ద్ ప్రకాశ్ భార్య మమత కూడా కోర్టకు తెలిపింది. జస్టిస్ సౌరభ్ శ్యామ్ షంష్రే బిత్తరపోయారు. చనిపోయిన వ్యక్తి పోలీసులకు ఎలా కంప్లయింట్ చేస్తాడని కుషీనగర్ ఎస్పీని అడిగారు న్యాయమూర్తి. పైగా శబ్ద్ ప్రకాశ్ వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసినట్టు తెలిసి ఆశ్చర్యపోయారు. హైకోర్టులో అఫిడవిట్‌ను వ్యతిరేకిస్తూ సమర్పించిన పిటిషన్‌పైనా కూడా శబ్ద్ ప్రకాశ్ సంతకం ఉండటం చూసి న్యాయమూర్తి కంగు తిన్నారు. చనిపోయిన వ్యక్తి ఇవన్నీ ఎలా చేస్తాడు అనుకుని కేసును కొట్టివేశారు. అంతే కాదు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాల్సిందిగా కుషీనగర్ ఎస్పీని ఆదేశించారు. చనిపోయిన వ్యక్తి పేరున అఫిడవిట్ దాఖలు చేసిన లాయర్‌ను కూడా తలంటారు జడ్జి!