చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. బిల్లుకు అన్ని పార్టీలు ఐక్యంగా మద్దతు తెలిపాయి. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా రెండు మాత్రమే వచ్చాయి.

AIMIM MPs Asaduddin Owaisi and Imtiaz Jaleel opposes women’s quota bill in Lok Sabha
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు(Women Reservation Bill)కు పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్‌సభ(Loksabha) బుధవారం ఆమోదం తెలిపింది. బిల్లుకు అన్ని పార్టీలు ఐక్యంగా మద్దతు తెలిపాయి. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా రెండు మాత్రమే వచ్చాయి. అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) పార్టీ ఏఐఎంఐఎం బిల్లును వ్యతిరేకించింది. ఈ పార్టీకి లోక్‌సభలో ఇద్దరు సభ్యులున్నారు. మహిళా సాధికారత అంశంపై ప్రపంచానికి అన్ని పార్టీలు ఐక్య సందేశం ఇవ్వాలని హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు.
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, AIMIM ఎంపీ ఇంతియాజ్ జలీల్(Imtiaz Jalil) ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ బిల్లుకు సంబంధించిన చర్చలో ఒవైసీ పాల్గొంటూ.. ఓబీసీ(OBC), ముస్లిం మహిళల(Muslim Woman)కు ఇందులో కోటా ఎందుకు లేదని, సభలో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బిల్లుపై సలహాలను బహిరంగంగా స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అవసరమైతే సవరణలు కూడా చేసుకోవచ్చని సూచించారు. మహిళా రిజర్వేషన్ అంశం గత 27 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని.. ఇప్పుడు దాన్ని అమలు చేయాల్సిన సమయం వచ్చిందని న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్(Arjunram Meghwal) అన్నారు. ప్రభుత్వం ఈ బిల్లును ఎన్నికల బలవంతం వల్ల కాదని, మహిళా సాధికారతకై సహజ స్ఫూర్తితో తీసుకొచ్చిందని షా అన్నారు. బిల్లును తీసుకువచ్చే సమయం, దాని అమలులో జాప్యం, భయాల గురించి ప్రతిపక్షాల ప్రశ్నలను షా(Amith Shah) తిప్పికొట్టారు.
కేంద్ర ప్రభుత్వంలోని 90 మంది కార్యదర్శుల్లో ముగ్గురు కార్యదర్శులు మాత్రమే ఓబీసీకి చెందిన వారేనని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై.. దేశాన్ని సెక్రటరీ నడుపుతున్నారని కొందరు నమ్ముతున్నారని షా అన్నారు. దేశాన్ని ప్రభుత్వం, మంత్రివర్గం, పార్లమెంటు నిర్వహిస్తుందన్నది నిజం. చౌకబారు ఎన్నికల వాగ్దానాలు చేయడం ఒకటని, వాస్తవానికి అట్టడుగు స్థాయిలోని ఓబీసీలు, దళితులు, మహిళల అభ్యున్నతికి కృషి చేయడం మరో ఎత్తు అని షా అన్నారు.
