అందం అంటే ఏమిటని ఎవరైనా అడిగితే జవాబు చెప్పడం చాలా కష్టం.. ఎందుకంటే అందానికి సరైన నిర్వచనం లేదు కాబట్టి. ఈ సంక్లిష్టత నుంచి మనల్ని బయటపడవేసేందుకే బ్ర హ్మదేవుడు మధుబాలను సృష్టించాడేమో! మధుబాల సౌందర్యానికి ప్రతిరూపం. అందం అంటే ఆమే! ఆమెను మించిన సౌందర్యరాశి ఉంటుందా అన్నది కూడా అనుమానమే! ఆమె మోములో ఎలాంటి లోటు కనిపించదు. నిండు పున్నమి చంద్రుడిలా ఉంటుంది.. ఆమెను వీనస్ ఆఫ్ ది ఇండియన్ స్క్రీన్ అని అంటారు కానీ […]

actress madhubala
అందం అంటే ఏమిటని ఎవరైనా అడిగితే జవాబు చెప్పడం చాలా కష్టం.. ఎందుకంటే అందానికి సరైన నిర్వచనం లేదు కాబట్టి. ఈ సంక్లిష్టత నుంచి మనల్ని బయటపడవేసేందుకే బ్ర హ్మదేవుడు మధుబాలను సృష్టించాడేమో! మధుబాల సౌందర్యానికి ప్రతిరూపం. అందం అంటే ఆమే! ఆమెను మించిన సౌందర్యరాశి ఉంటుందా అన్నది కూడా అనుమానమే! ఆమె మోములో ఎలాంటి లోటు కనిపించదు. నిండు పున్నమి చంద్రుడిలా ఉంటుంది.. ఆమెను వీనస్ ఆఫ్ ది ఇండియన్ స్క్రీన్ అని అంటారు కానీ ఆ గ్రీకు దేవతే మధుబాలగా మళ్లి పుట్టిందని అనడం ఉత్తమం..
సరిగ్గా ప్రేమికుల రోజునే అంటే ఇవాళే ఆ అందాల రాశి పుట్టింది. ఆమె అసలు పేరు ముంతాజ్ జెహాన్ బేగం ద్లేహావి..పఠాన్ జాతికి చెందిన ఆమె మాతృభాష పుష్టు. ఉర్దూ కూడా బాగా వచ్చు. చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చింది. 1942లో విడుదలైన బసంత్ వంటి అయిదారు సినిమాల్లో బేబీ ముంతాజ్‌గా నటించింది..1947లో వచ్చిన నీల్‌కమల్ సినిమాలో రాజ్‌కపూర్ సరసన మొదటిసారి హీరోయిన్‌గా నటించింది. 70కి పైగా సినిమాల్లో నటించిన మధుబాల జీవితం విషాదమయం! అచ్చంగా మర్లిన్ మన్రో లాగే ఆమె కూడా 36 ఏళ్ల వయసులో చనిపోయింది. మర్లిన్‌ది ఆత్మహత్య.. మధుబాలదేమో సహజమరణం ..అంతే తేడా. ఆమె పరిపూర్ణంగా నటించిన చివరి చిత్రం మొఘల్ ఏ ఆజం అని చెప్పుకోవచ్చు. మధుబాల చనిపోక ముందే అసంపూర్తిగా మిగిలిపోయిన బాయ్‌ఫ్రెండ్, హాఫ్ టికెట్, పాస్‌పోర్ట్, జ్వాలా వంటి సినిమాల్లో మధుబాల చెల్లెలు చంచల్ నటించారు.
మధుబాలకు ఇద్దరు అక్కలు ముగ్గురు చెల్లెళ్లు. తండ్రి అతావుల్లా ఖాన్‌కు దమ్మిడి ఆదాయం లేదు..అందుకే మధుబాలను ఎనిమిదో ఏటనే సినిమాల్లో చేర్చాడు. మధుబాల తండ్రికి చక్కటి ఆదాయ వనరుగా మారింది.. పైగా అతావుల్లా బోలడన్ని నిబంధనలు పెట్టాడు. అన్నపానీయాలు ఇంటినుంచే తీసుకెళ్లాలి. సెట్‌లో ఎవరితోనూ మాట్లాడకూడదు. సాయంత్రం ఆరింటికల్లా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికొచ్చేయాలి. ఇంటికి సినిమావాళ్లు ఎవరూ రాకూడదు. సినిమా ఫంక్షన్‌లకు వెళ్లకూడదు. జర్నలిస్టులతో మాట్లాడకూడదు. ఇలాంటి కండిషన్లు పెట్టాడు. చివరాఖరికి ముఖ్యమైనదేమిటంటే సినిమాల ద్వారా వచ్చిన డబ్బంతా తనకే ఇవ్వాలి.. పాపం మధుబాల అలాగే చేసేది. మధుబాల సంపాదించిన డబ్బుతో అలావుల్లా విలాసంగా బతికేవాడు. చాలా మట్టుకు సినిమాలు తీసి తగలేశాడు. సయ్యద్, షాన్ ఎ అవధ్, మెహబూబా, లాలీ చందన్.. ఇలాంటి సినిమాలన్నీ మొదలు పెట్టి మధ్యలో వదిలేశాడు. సయ్యద్ సినిమా మీద మూడు లక్షలు ఖర్చయ్యాక ఆపేశాడు. అతావుల్లా తీసిన నాతా సినిమా అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. దాంతో మధుబాల ఇష్టంగా కొనుక్కున్న బంగళాను తాకట్టు పెట్టవలసి వచ్చింది.
రాజ్ కపూర్, అశోక కుమార్, ప్రదీప్ కుమార్, దేవానంద్, దిలీప్ కుమార్, ప్రేమ్ నాథ్, గురుదత్, షమికపూర్, రెహమాన్, కిషోర్ కుమార్, సునీల్‌దత్, భరతభూషణ్ వంటి అగ్రనటులందరి సరసన మధుబాల నటించింది.
మధుబాలను క్వీన్ ఆఫ్ చారిటీస్‌గా కీర్తించారు.. అందుకు కారణం అపన్నులను ఆదుకోవడంలో ముందుండటమే! అప్పట్లో పోలియో భయంకరంగా ఉండేది. లక్షలాది పిల్లలు దివ్యాంగులయ్యారు. మధుబాల తన ప్రాంతంలోని బాధిత పిల్లలకు ఒక్కొక్కరికి 5 వేల రూపాయలు సాయం చేశారు. అప్పట్లో 5 వేలు అంటే చాలా పెద్ద మొత్తం. అలాగే జమ్ముకాశ్మీర్, పాకిస్థాన్ లోని తూర్పు బెంగాల్ శరణార్థుల సహాయనిధులకి విరివిగా విరాళాలను అందించారు.
1962లో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్సిటిట్యూట్ కు క్రేన్ కెమెరాని బహూకరించారు. ఇప్పటికీ అది పని చేస్తుండటం విశేషం. గాయకుడు కిషోర్ కుమార్‌ను పెళ్లి చేసుకున్న మధుబాల ఆయనతో కలిసి చల్తీ కా నామ్ గాడీ, హాఫ్ టికెట్, ఝుమ్రూ, మహల్ కే ఖ్వాబ్ సినిమాలలో నటించింది. అంతకు ముందు ఈమెకు బ్లడ్ వామిటింగ్స్ అయ్యేవి.. పెళ్లయిన తర్వాత లండన్‌కు వెళ్లినప్పుడు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు గుండెలో రంధ్రం ఉందని తేలింది. రెండేళ్ల కంటే ఎక్కువ కాలం బతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. ఇండియాకు వచ్చిన తర్వాత కొన్ని రోజులే కిశోర్‌కుమార్ ఇంట్లో ఉంది. ఈమెకు సహాయకురాలిని ఏర్పాటు చేసి, వైద్య ఖర్చులు వంటివన్నీ కిశోర్ చూసుకున్నారు. డాక్టర్లు చెప్పినట్టు రెండేళ్లు కాకుండా తొమ్మిదేళ్ల పాటు జీవించింది. అనేక శారీరక బాధలను అనుభవించింది. చివరకు బొంబాయిలోని బ్రీచ్ కాండీ హాస్పటల్లో 1969 ఫిబ్రవరి 23వ తేదీన మరణించింది.
