మహాత్మా గాంధీని విమర్శించడం ఇప్పుడో ఫ్యాషన్‌ అయ్యింది. మహాత్ముడిపై నిందలు మోపడం, విమర్శలు చేయడం కొత్తేమీ కాదు. 2014 నుంచి ఇది బాగా ముదిరిపోయింది. తెలియనితనంతో నోటికొచ్చింది వాగేస్తూ ఘనకార్యం చేసినట్టుగా ఫీలయ్యేవాళ్లు ఇప్పుడు ఎక్కువయ్యారు. గాంధీని అనేసి కొత్త వివాదాన్ని రేపడం ద్వారా సోషల్‌ మీడియాలో బహు విధంగా ప్రాచుర్యం పొందాలనే దురాలోచన కావచ్చు. చరిత్రకు తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తూ నలుగురి నోళ్లలో నానాలనే భావన కావచ్చు. ఇప్పుడు మాధవిలత అనే ఓ నటీమణి కూడా గాంధీ అసలు మహాత్ముడే కాదంటోంది. మహాత్ముడు అనే పదానికి బహుశా ఆమెకు నిర్వచనం తెలియనట్టుగా ఉంది

మహాత్మా గాంధీని విమర్శించడం ఇప్పుడో ఫ్యాషన్‌ అయ్యింది. మహాత్ముడిపై నిందలు మోపడం, విమర్శలు చేయడం కొత్తేమీ కాదు. 2014 నుంచి ఇది బాగా ముదిరిపోయింది. తెలియనితనంతో నోటికొచ్చింది వాగేస్తూ ఘనకార్యం చేసినట్టుగా ఫీలయ్యేవాళ్లు ఇప్పుడు ఎక్కువయ్యారు. గాంధీని అనేసి కొత్త వివాదాన్ని రేపడం ద్వారా సోషల్‌ మీడియాలో బహు విధంగా ప్రాచుర్యం పొందాలనే దురాలోచన కావచ్చు. చరిత్రకు తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తూ నలుగురి నోళ్లలో నానాలనే భావన కావచ్చు. ఇప్పుడు మాధవిలత అనే ఓ నటీమణి కూడా గాంధీ అసలు మహాత్ముడే కాదంటోంది. మహాత్ముడు అనే పదానికి బహుశా ఆమెకు నిర్వచనం తెలియనట్టుగా ఉంది...

ప్రపంచమంతా గౌరవించే మహోన్నత వ్యక్తి, అసలు రక్తమాంసాలున్న ఇలాంటి మనిషి భూమ్మీద నడిచాడంటే భవిష్యత్తరాలు నమ్మకపోవచ్చన్నాడు విశ్వ విఖ్యాత శాస్ర్తవేత్త అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌. జీసస్‌ నాకు సందేశమిచ్చాడు, గాంధీ దాన్ని ఆచరణలో చూపాడు... మార్టిన్‌ లూధర్‌ కింగ్‌ అన్నమాటిది. అంతటి మహానుభావులే గాంధీని కీర్తించినప్పుడు మాధవిలతవంటి పిల్లకాకులు ఏదో అన్నంత మాత్రాన గాంధీ వ్యక్తిత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. ఆయన వ్యక్తిత్వం చెక్కు చెదరనిది. మేరు సమానమైనది. గాంధీకి మందూ వెనకా అంతా శూన్యమే.. ఆయన మార్గం అనితర సాధ్యం.

ఓ మనిషి వంద శాతం పవిత్రాత్ముడైతే కచ్చితంగా అతను దేవుడే. అందులో ఎలాంటి సందేహం లేదు. అలా కాకుండా ఓ డెబ్బయ్‌ శాతం పవిత్రాత్మను సంపాదించగలిగితే అతడు మహాత్ముడే అవుతాడు. ఆ విషయంలో గాంధీజీ మహాత్ముడే... మహాత్ముడు అన్న పదానికి ఆయన అర్హుడే. ఓ వ్యక్తి సాధారణాత్ముడి నుంచి మహాత్ముడు కావాలంటే ఎన్నో ప్రశ్నలను తనకు తాను వేసుకోవాలి. సమాధానాలను తానే తెలుసుకోవాలి. తప్పులను సరిదిద్దుకోవాలి. అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి. మంచిని ఆచరించే నేర్పు వుండాలి. అందుకు తగిన ఓర్పు వుండాలి. మార్పును స్వీకరించగలిగే సహృదయత వుండాలి. ఇలాంటి లక్షణాలన్నీ గాంధీలో వున్నాయి. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు. పాపం మాధవిలతకు ఇవేమీ తెలియనట్టుగా ఉంది. అప్పుడెప్పుడో మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేశాడని చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత చాలా మంది చాలా సార్లు గాంధీని చంపేశారు. గాంధీయిజం ముసుగేసుకున్న గాడ్సేలు ఇప్పటికీ చంపుతూనే వున్నారు. ఏది పుణ్యం? ఏది పాపం? ఏది సత్యం? ఏదసత్యం? ఏది తెలుపు? ఏది నలుపు? ఓ మహాత్మా....ఓ మహర్షి...

మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ...భారత జాతికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి.. .మానవత్వమే మతమని చాటిన మనీషి. ఆయన అడుగు జాడల్లో యావత్‌ ప్రపంచం నడవాలనుకుంటుంది..కొల్లాయి గట్టితేనేం.. ప్రజల హృదయాలను మంచితనంతో కొల్లగొట్టిన మహానేత... ఆయన పిలుపిస్తే జనమంతా వాలిపోయేవారు.. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని సత్యాగ్రహంతో తరిమికొట్టడం కేవలం గాంధీకే సాధ్యమైంది... అందుకే ఆయన జాతి పిత అయ్యారు. హింసకు అహింస నేర్పిన పరమహంస...ఆయన స్ఫూర్తి పొందని దేశాలు లేవు... బక్క చిక్కిన మనోబలుడు... బోసినవ్వుల దార్శనికుడు...ఇప్పటికీ ఆయన పథమే మనకు అనుసరణీయం...

సత్యమే చెప్పాలి...అప్రియమైన సత్యాన్ని అప్రియంగా చెబితేనే ఇబ్బంది...అంగుళిమాలిలోని అంత చెడులోనూ బుద్ధుడు మనిషిని చూశాడు..అది మన సంప్రదాయం.. అది మన ధర్మం.. గాంధీలో అన్ని సుగుణాలే ఉన్నాయని అనుకోలేం. కాకపోతే వాటిని చూసి ఆవేశపడాల్సిన అవసరం లేదు. బాపూ నిన్ను ఆడిపోసుకుంటున్నవారికి కూడా నీ చల్లని దీవెనను ఇవ్వు. నీ బాటను నడిచే బలం వారికివ్వు...
రఘుపతి రాఘవ రాజారాం...పతిత పావన సీతారాం...ఈశ్వర అల్లా తేరే నాం...సబ్‌కో సన్మతి దే భగవాన్‌..

Updated On 6 April 2023 2:14 AM GMT
Ehatv

Ehatv

Next Story