Kushboo : ఖుష్బూ సంచలన నిర్ణయం.. ఆ పదవికి రాజీనామా..!
జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి నటి ఖుష్బూ రాజీనామా చేశారు. ఆమె రాజీనామా లేఖను మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆమోదించింది.
జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి నటి ఖుష్బూ రాజీనామా చేశారు. ఆమె రాజీనామా లేఖను మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆమోదించింది. నటి ఖుష్బూ డీఎంకే, కాంగ్రెస్ సహా పార్టీల్లో పనిచేసిన తర్వాత బీజేపీలో చేరారు. పార్టీతో సంబంధం లేకుండా తన అభిప్రాయాలను ధైర్యంగా చెప్పే వ్యక్తి ఖుష్బూ. మహిళల భద్రత కోసం వాదించే ఖుష్బూ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు. గతేడాది ఫిబ్రవరిలో ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు.
ఏ పార్టీలో ఉన్నా తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్తూ నిర్మొహమాటంగా వ్యవహరిస్తుంటారు ఖుష్బూ. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ఖుష్బూ తన గొంతు వినిపించారు. దీంతో ఆమెకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది.
అయితే ఇటీవలి కాలంలో కొన్ని విషయాల్లో ఖుష్బూ మౌనంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది. బీజేపీకి చెందిన బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలపై మహిళా రెజ్లర్లు వరుస నిరసనలు చేసినప్పుడు ఖుష్బూ బాధితులకు మద్దతు ఇవ్వలేదు. మణిపూర్‌లో మహిళలపై దారుణాలకు ఒడిగట్టినప్పుడు కూడా ఖుష్బూ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇది ఖుష్బూ పట్ల సామాన్య జనాలకు అసంతృప్తిని కలిగించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ తరపున ఖుష్బూ చురుగ్గా ప్రచారం చేయలేదని రాజకీయవర్గాల్లో చర్చ నడిచింది. ఖుష్బూ బీజేపీకి దూరంగా ఉంటున్నట్లు కూడా ప్రచారం జరిగింది.
ఈ క్రమంలోనే జాతీయ మహిళా కమిషన్‌కు ఖుష్బూ రాజీనామా చేసి మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు పంపారు. జూన్ 28న ఖుష్బూ పంపిన లేఖను మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఆమోదించింది. మంత్రిత్వ శాఖ డైరెక్టర్ నుండి అందుకున్న లేఖ ద్వారా రాజీనామాను ధృవీకరించారు.