సొంతంగా పార్టీ పెట్టిన విజయ్ 2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధమవుతున్నారు.
తమిళ హీరో విజయ్ స్టామినా ఏమిటో, జనానికి ఆయనపై ప్రేమాభిమానాలు ఎలాంటివో, ఆయన క్రేజ్ ఎంతటితో ఆదివారం తమిళగ వెట్రి కళగం (TVK) తొలి మహానాడులో రుజువయ్యింది. సొంతంగా పార్టీ పెట్టిన విజయ్ 2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే విల్లుపురం(Villu Puram) జిల్లా వీ సాలై (Vee salai)గ్రామంలో పార్టీ తొలి మహానాడును ఏర్పాటు చేశారు. 'మతం, భాష అంటూ ప్రజల్ని చీల్చి రాజకీయం చేసే శక్తులు, ద్రవిడ నమూనా అంటూ రాష్ట్రాన్ని దోచుకుంటున్న అవినీతిపరులే మా పార్టీకి ప్రధాన శత్రువులు’ అని చెబుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని డీఎంకే(DMK) ప్రభుత్వాలపై పరోక్ష విమర్శలు చేశారు. తమతో కలిసి వచ్చే వారిని అధికారంలో భాగస్వాములను చేస్తామని విజయ్ ప్రకటించారు. ఎనిమిది నెలల కిందట పార్టీని స్థాపించిన విజయ్ సినిమాలకు దూరం కాబోతున్నారు. మహానాడుకు అసంఖ్యాకంగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి విజయ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆవేశపూరితంగా మాట్లాడుతూ ప్రజల్లో జోష్ తెచ్చాడు. 'ద్రవిడ సిద్ధాంతకర్త ఈవీఆర్ పెరియార్(EVR Periyar), కర్మ యోగి కామరాజ్(Karma Yogi Kamaraj), రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్(Dr.BR Ambedkar), వీర నారీ వేలూ నాచియార్ ఆదర్శంగా టీవీకే సాగుతుంది. లౌకిక, సామాజిక, న్యాయ సిద్ధాంతాలతో పార్టీని నడుపుతాం. అందరం సమానమని చాటే సరికొత్త రాజకీయాలను తమిళనాడు(Tamilnadu)లో చూస్తారు’ అని విజయ్ చెప్పారు. 'నన్ను విమర్శించిన వాళ్ల పేర్లను ప్రస్తావించబోను. వాళ్లలా అమర్యాదకరంగా మాట్లాడబోను. సంస్కారయుత రాజకీయాలు చేస్తాను' అని పేర్కొన్నారు. తమిళనాడులో ఎంజీఆర్(MGR), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఎన్టీఆర్(NTR) మాత్రమే సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించారని విజయ్ చెబుతూ ఆ దిశగా తమిళనాడులో మరో కొత్త అధ్యాయం లిఖిస్తామని అన్నారు. ' శాస్త్రసాంకేతి రంగాల్లో మాత్రమే మార్పు రావాలా? రాజకీయాలూ మారాలి. కానీ నన్ను ఈ స్థాయికి తెచ్చిన ప్రజలకు ఏదోఒకటి చేయాలనే అన్నింటికీ సిద్ధపడి రాజకీయాల్లోకి అడుగుపెట్టా. అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్న సినిమా కెరీర్‌ను వదిలి వచ్చా' అని అన్నారు. . నీట్ పరీక్ష విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టిన దళపతి విజయ్(Thalapathy Vijay) ... తన చెల్లెలి మరణం ఎంతగా బాధించిందో నీట్ కారణంగా అరియలూర్‌లో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి ఉదంతమూ అంతే బాధించిందని అని అన్నారు.