దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై పార్టీలు దృష్టి పెట్టాయి.

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై పార్టీలు దృష్టి పెట్టాయి. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకుండానే పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీజాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(ArvindKejriwal) సంచలన ప్రకటన చేశారు. ఆప్ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఇండియా కూటమితో పొత్తుకు తాము సిద్ధంగా లేమని చెప్పారు కేజ్రీవాల్. ఢిల్లీలో శాంతిభద్రతల అంశంపై కూడా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అసలు నేను చేసిన తప్పు ఏంటి..? ఢిల్లీ శాంతిభద్రతల విషయంలో కేంద్రమంత్రి అమిత్ షా(Amit Shah) చర్యలు తీసుకుంటారని ఆశించాను. కానీ, దానికి బదులు పాదయాత్రలో నాపైనే దాడి జరిగింది. మేము ప్రజా సమస్యలను లేవనెత్తాము. మీకు వీలైతే.. గ్యాంగ్‌స్టర్లను అరెస్టు చేయించండి. అంతే కానీ, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేజ్రీవాల్. కేజ్రీవాల్ ప్రకటన నిజంగానే ఇండియా కూటమికి ఎదురుదెబ్బలాంటిదే.
లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తుకు ఆప్ ఒప్పుకోలేదు. 13 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో తాము కూడా పొత్తు లేకుండానే పోటీ చేస్తామని కాంగ్రెస్ కూడా ఇది వరకే ప్రకటించింది.
