ప్రేమకు హద్దులు, సరిహద్దులు ఉండవు.. ప్రేమించిన వారి కోసం ఎంత వరకైనా వెళతారు. ఎంత దూరమైనా ప్రయాణిస్తారు. అవసరమైతే దేశాలు కూడా దాటుతారు. మొన్నామధ్య పబ్జీ గేమ్‌తో ప్రేమలో కూరుకుపోయిన ఓ మహిళ పాకిస్తాన్‌ నుంచి అక్రమంగా ఇండియాకు వచ్చిన వైనాన్ని చూశాం.

ప్రేమకు హద్దులు, సరిహద్దులు ఉండవు.. ప్రేమించిన వారి కోసం ఎంత వరకైనా వెళతారు. ఎంత దూరమైనా ప్రయాణిస్తారు. అవసరమైతే దేశాలు కూడా దాటుతారు. మొన్నామధ్య పబ్జీ గేమ్‌తో ప్రేమలో కూరుకుపోయిన ఓ మహిళ పాకిస్తాన్‌ నుంచి అక్రమంగా ఇండియాకు వచ్చిన వైనాన్ని చూశాం. ఇప్పుడు ఫేస్‌బుక్‌ పరిచయం మన అమ్మాయిని పాకిస్తాన్‌ వరకు తీసుకెళ్లింది. రాజస్తాన్‌కు(Rajasthan) చెందిన అంజు అనే మహిళకు ఫేస్‌బుక్‌(Facebook) ద్వారా పరిచయం అయ్యాడు పాకిస్తాన్‌కు(Pakistan) చెందిన నస్రుల్లా(Nasrullah). అతడిని కలుసుకోవడానికి భర్త, పిల్లలను వదిలి ఆమె పాకిస్తాన్‌కు వెళ్లారు.

అందరూ ప్రేమకోసమే అంత దూరం అంజు వెళ్లారని అనుకున్నారు. కానీ ఆమె మాత్రం అలాంటిదేమీ లేదని తెలిపారు. తనపై మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. ప్రస్తుతం ఆమె పాకిస్తాన్‌లో సురక్షితంగా ఉన్నానని తెలిపారు. పాకిస్తాన్‌లో ఓ పెళ్లి ఉందని, దానికి హాజరయ్యేందుకు వచ్చానని అంజు తెలిపారు. ఎలాగూ పాకిస్తాన్‌కు వచ్చాను కాబట్టి పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకుంటున్నానని అన్నారు. ఇందుకు తాను చట్టపరమైన విధానాలను అనుసరించినట్టు చెప్పారు. తాను పాకిస్తాన్‌కు వెళుతున్న విషయం ఎవరికీ ఏమీ తెలియదని, తన భర్తతో జైపూర్‌కు వెళుతున్నట్టు చెప్పి ఇక్కడికి వచ్చానని అంజు అన్నారు.

‘ముందు భివాడి నుంచి ఢిల్లీకి వచ్చాను. తర్వాత అక్కడి నుంచి అమృత్‌సర్‌కు వెళ్లాను. అట్నుంచి వాఘా బోర్డర్‌కు వెళ్లి అక్కడి నుంచి పాకిస్థాన్‌లోకి అడుగుపెట్టాను. ఇక్కడ నాకు నస్రుల్లా అనే స్నేహితుడు ఉన్నాడు. రెండుమూడేళ్లుగా అతను నాకు తెలుసు. మేం ఫేస్‌బుక్‌ ద్వారా స్నేహితులం. ఈ విషయం మా అక్క, అమ్మలకు కూడా తెలుసు. మా రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలున్నాయి' అని అంజు వివరించారు. కేవలం పెళ్లి కోసమే పాకిస్తాన్‌ వచ్చానని, తనకు ఇక్కడ ఇంకేం పని లేదని, తనను సీమా హైదర్‌తో పోల్చవద్దని అంజు విన్నవించుకున్నారు. తాను ఇక్కడ సురక్షితంగా ఉన్నానని, నస్రుల్లాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. త్వరలోనే తిరిగి భారత్‌ వస్తానని, భర్తతో మనస్పర్థలు వచ్చాయని, భర్త నుంచి విడిపోయి..

పిల్లలతో కలిసి నివసించాలనుకుంటున్నానని తెలిపారు. మరోవైపు నస్రుల్లా కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఆగస్టు 20న అంజు భారత్‌కు రానున్నదని తెలిపాడు. అంజు తనకు కేవలం స్నేహితురాలు మాత్రమేనని, తమ మధ్య ప్రేమ లేదని పేర్కొన్నాడు. ఆమె పాకిస్థాన్‌కు పర్యటనకు వచ్చిందని, ఆమెను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అన్నాడు. ఆమె వీసా గడువు ఆగస్టు 20న ముగియనుండటంతో అప్పుడే భారత్‌కు తిరిగి వెళ్లనుందని చెప్పాడు. ఆమె మా ఇంట్లోనే మా కుటుంబానికి చెదిన ఆడవారితో కలిసి ప్రత్యేక గదిలో ఉంటోందని తెలిపాడు. జిల్లా యంత్రాంగం తమకు తగిన భద్రత కల్పించిందని తెలిపాడు.

ఉత్తరప్రదేశ్‌లోని కైలోర్‌కు చెందిన అంజు రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో నివాసముంటున్నారు. అరవింద్‌ అనే వ్యక్తితో 2007లో ఈమెకు పెళ్లయింది. ఈ దంపతులకు 15 ఏళ్ల కూతురు, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం అంజు ఓ ప్రైవేటు సంస్థలో బయోడేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో పాక్‌కు చెందిన నస్రుల్లాతో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. అతడిని కలుసుకోవడానికి అంజు నెల రోజుల పాకిస్తాన్‌ వీసాపై అక్కడి ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని అప్పర్‌ దిర్‌ జిల్లా కుల్షో గ్రామానికి వెళ్లారు. అయితే, అంజు పాక్‌లో ఉన్నట్టు తెలియడంతో రాజస్థాన్‌ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఆమె గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిందని, పాక్‌కు వెళ్లడానికి అంజు దగ్గర ప్రయాణ పత్రాలు అన్ని కరెక్ట్‌గానే ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Updated On 25 July 2023 1:22 AM GMT
Ehatv

Ehatv

Next Story