పట్టుమని అయిదేళ్లు కూడా లేవు కానీ ఆ పిల్లోడు స్కూల్‌కు తుపాకీ(Gun) తెచ్చాడు.

పట్టుమని అయిదేళ్లు కూడా లేవు కానీ ఆ పిల్లోడు స్కూల్‌కు తుపాకీ(Gun) తెచ్చాడు. తేవడమే కాదు, మూడో తరగతి చదువుతున్న పదేళ్ల విద్యార్థిపై కాల్పులు జరిపాడు. అదృష్టం బాగుండబట్టి ఆ పిల్లోడి ప్రాణాలకు ముప్పు జరుగలేదు. కాల్పులు జరిపిన ఆ నర్సరీ విద్యార్థి(Nursery Student) మాత్రం పరారీలో ఉన్నాడు. నమ్మశక్యంగా లేదు కానీ బీహార్‌లోని(Bihar) సుపాల్(Supal) జిల్లా లాల్‌పట్టి ప్రాంతంలో నిజంగా జరిగిన సంఘటన ఇది. సెయింట్‌ జాన్‌ బోర్డింగ్ స్కూల్‌లో నర్సరీ చదువుతున్నాడో అయిదేళ్ల బాలుడు. ఎప్పటిలాగే బుధవారం కూడా స్కూలుకు వచ్చాడు. కాకపోతే వచ్చేటప్పుడు రహస్యంగా తన స్కూల్‌ బ్యాగ్‌లో గన్‌ పెట్టుకుని వచ్చాడు. వచ్చీ రావడంతోనే అదే స్కూల్లో మూడో తరగతి చదువుతున్న పదేళ్ల బాలుడిపై కాల్పులు జరిపాడు. అలెర్టయిన స్కూల్‌ యాజమాన్యం, సిబ్బంది ఆ బాలుడిని అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. బాలుడికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధిత విద్యార్థి దగ్గర కొంత సమాచారం సేకరించారు. తాను తన క్లాసుకు వెళుతున్న సమయంలో నర్సరీ విద్యార్థి బ్యాగు నుంచి గన్‌ తీసి తనపై కాల్పులు జరిపాడని చెప్పాడు. ఆపే ప్రయత్నం చేసినప్పుడు తన చేతిపై కాల్పులు జరిపాడని బాధిత విద్యార్థి తెలిపాడు. ప్రస్తుతం కాల్పులు జరిపిన బాలుడితో పాటు అతడి తండ్రి కూడా పరారీలో ఉన్నాడు. వారి కోసం పోలీసలు గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Eha Tv

Eha Tv

Next Story