కేరళ(Kerala) అంటే దేవతలు నివసించే ప్రదేశం. అదో అందమైన సాంస్కృతిక ప్రదేశం. కేరళ కల్చర్‌ను చెరిపివేసి, మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేరళ సమాజం ఇలాంటి కుటీల యత్నాలను అడ్డుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు కేరళ గురించిన ప్రస్తావన ఎందుకంటే ఆ సమాజాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుందని చెప్పడానికి! ఆదో ఆదర్శవంతమైన సమాజం.

కేరళ(Kerala) అంటే దేవతలు నివసించే ప్రదేశం. అదో అందమైన సాంస్కృతిక ప్రదేశం. కేరళ కల్చర్‌ను చెరిపివేసి, మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేరళ సమాజం ఇలాంటి కుటీల యత్నాలను అడ్డుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు కేరళ గురించిన ప్రస్తావన ఎందుకంటే ఆ సమాజాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుందని చెప్పడానికి! ఆదో ఆదర్శవంతమైన సమాజం. అందుకు ఓ ఉదాహరణే పోతిచోరు. మనసున్న కొందరు తమకు తోచిన విధంగా అనాథలకు, అభాగ్యులకు సేవ చేస్తారు. వారి ఆకలిని తీరుస్తారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ పని చేస్తాయి. కానీ ఓ సమాజం మొత్తం సేవ కార్యక్రమంలో పాలుపంచుకోవడాన్ని ఎక్కడైనా చూశారా? కేరళలో అది సాధ్యమయ్యింది. కేరళలోనే సాధ్యమయ్యే ఆ విషయాన్ని ఓ యువజన సంస్థ చేసి చూపించింది..

కేరళలోని కట్టక్కాడ..ఉదయం అయిదున్న గంటలు.. సౌమ్య వంటగదిలో చాలా బిజీగా ఉంది. రబ్బర్‌ కూలీ అయిన తన భర్తకు, స్కూలు వెళుతున్న తన ఇద్దరు పిల్లలకు వంట చేసే పనిలో ఉంది.. ఓ పక్క అన్నం ఉడుకుతోంది. మరో పక్క సాంబర్‌ ఘుమఘుమలాడుతోంది. నలుగురు ఉన్న ఆ కుటుంబానికి ఒకటిన్నర బియ్యం వండితే సరిపోతుంది. కానీ సౌమ్య మాత్రం ఆ రోజు రెండు గ్లాసుల బియ్యాన్ని వండుతున్నది. అప్పటికే ఆమె క్యాబేజీ కూర రెడీ చేసి పెట్టింది. క్యాబేజీ కూర, సాంబార్‌ కూడా తన కుటుంబానికి అవసరమయ్యే దానికంటే ఎక్కువే వండింది.. రాబోయే అతిథి కోసం ఆమె ఈ వంట చేయడం లేదు. నిజానికి తను అదనంగా వండే ఆహారాన్ని ఎవరు తింటారో కూడా ఆమెకు తెలియదు. తన భర్తకు, పిల్లలకు సరిపడే ఆహారాన్ని పక్కన పెట్టేసి మిగతాదంతా అంటే అన్నం, సాంబారు, క్యాబేజీ కూరలను చక్కగా ప్యాక్‌ చేసింది సౌమ్య.. బైక్‌ మీద వచ్చిన ఇద్దరు యువకులకు ఆ ప్యాకేట్‌ను సంతోషంగా అందించింది.. ఆ భోజన పొట్లాన్ని పోతిచోరు అంటారు.. ఒక్క సౌమ్యనే కాదు, కేరళలో ఇలా వేలాది మంది మహిళలు తమ కుటుంబానికి సరిపడా వంట కంటే అదనంగా వండుతారు. తమ తాహతుకు, తమ శక్తికి సరిపడే వంటను వండుతారు. కొంతమంది నలుగురైదుగురికి సరిపడా వంటను కూడా వండుతారు. వారు చేసిన భోజన పొట్లం ఏ అతిథికి చేరుతుందో, ఎవరు తింటారో వారికి తెలియదు. అయినా వారు చాలా ఇష్టంగా వంట చేస్తారు. దాన్ని వారు ఎప్పుడూ కష్టమనుకోలేదు.. అదో సేవగా భావించారు. అలా అందించేవారు డబ్బున్న వారు కాదు. మధ్యతరగతి ప్రజలు.. వారు వండుకునే దానిలో కొంచెం ఇలా చక్కగా ప్యాక్‌ చేసి పొట్లాల రూపంలో అందిస్తారు. ఇలా రోజుకు 40 వేల భోజనం పొట్లాలు వస్తాయి. నమ్మశక్యంగా లేదు కదూ! సామాన్య ప్రజల దగ్గర నుంచి యువత వరకు అందరూ ఇలా తమకు తోచినన్ని ఆహార పొట్లాలను అందిస్తూ వస్తున్నారు. ఇలా కేరళలో ఆరేళ్ల నుంచి జరుగుతోంది. ఆ భోజన పొట్లాలు ఎక్కడికి వెళతాయో తెలుసా? ఆయా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు, ప్రయాణికులకు, వృద్ధులకు అందుతాయి. ఈ బృహత్కార్యాన్ని సీపీఐ (ఎం) యువజన విభాగం అయిన డెమెక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీవైఎఫ్‌ఐ)
2017లో మొదలు పెట్టింది. అప్పుడు తిరువనంతపురం మెడికల్ కాలేజీలో 300 పోతిచోరు ప్యాకేట్లతో మొదలైన ఈ సేవా కార్యక్రమం ఇప్పుడు 40 వేల భోజన పొట్లాల వరకు చేరింది. ఈ పోతిచోరును హృదయపూర్వం అని కేరళలో పిలుచుకుంటారు. అంతే మార్టీ మీల్‌ పార్సెల్‌ అన్నమాట. ప్రస్తుతం కేరళలోని 14 జిల్లాలలోని 50 ఆసుపత్రులకు ప్రతి రోజు 40 వేల ఆహార పోట్లాలు అందుతున్నాయి. ఈ ఆహారపు పొట్లాలన్నీ ఒక్కొక్కరి ఇళ్ల నుంచి సేకరించినవే: డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు పక్కా ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ప్రతి సంవత్సరం హృదయపూర్వం కార్యక్రమానికి సంబంధించిన క్యాలెండర్‌ను మందుగానే రూపొందిస్తారు. ఆ జాబితా ఆధారంగా డీవైఎఫ్‌ఐ మండలి కమిటీలు బాధ్యత తీసుకుంటాయి.
ముందురోజు డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు వారి ప్రాంతంలోని ఇళ్లకు వెళ్లి మరుసటి రోజు మధ్యాహ్న భోజనాన్ని అదనంగా ఒకరి కోసం వండమని కోరతారు. విశేషమేమిటంటే ఎవరూ ఒకరి కోసం అదనంగా వండరు. అందరూ ఇద్దరు లేదా ముగ్గురి కోసం వండుతారు. అయిదు వరకు ఆహారపొట్లాలను సమకూర్చే కుటుంబాలు కూడా చాలానే ఉన్నాయి. ఆ తర్వాత ఈ సేకరించిన అదనపు ఆహారాన్ని కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రులలో పంపిణీ చేస్తారు. సమాజం మద్దతుతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో, వరదలు వచ్చినప్పుడు ఆకలితో అలమటించిన అభాగ్యుల ఆకలి తీర్చాయి ఈ ఆహారపు పొట్లాలు. అంతేనా డ్యూటీలో ఉన్న పోలీసులకు, ప్రయాణికులకు, ఆసుప్రతిలో ఉన్నవారి కడుపు కూడా నింపుతున్నాయి. ఈ పోతిచోరు కార్యక్రమంలో అనేకానేక ఆసక్తికరమైన ఘటనలు కూడా జరిగాయి. మలప్పురం మంపాడ్‌ ఎంఈఎస్‌ కళాశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రాజేశ్‌ మోంజీకి చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ఈ ఏడాది జనవరిలో తన తల్లి చికిత్స కోసం కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీలో ఆయన ఉండాల్సి వచ్చింది. ఆయనకు ఈ పోతిచోరు పొట్లం అందింది. పొట్లం విప్పి చూస్తే ఓ చిన్నారి రాసిన చిన్న పేపరు ముక్క కనిపించింది. అందులో ' ఈ పోతిచోరు ఎవరికి అందుతుందో వారు ముందుగా నన్ను క్షమించాలి. మా అమ్మ ఇంట్లో లేదు. నేను స్కూల్‌కు వెళ్లే తొందరలో ఈ వంట చేశాను. పొట్లాన్ని సిద్ధం చేశాను. నేను వండిన వంట రుచిగా లేదు. అలాగే మీరు త్వరగా కోలుకోండి' అని ఆ పాప రాసింది. అది చదివిన రాజేశ్‌ కంటి నుంచి నీటిబోట్లు రాలాయి. ఆ పొట్లంలో ఉన్న ప్రతి అన్నం మెతుకు ఆ చిన్నారి ప్రేమతో నిండిపోయింది అని రాజేశ్‌ తన ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నాడు. ఇది కేవలం ఆహారం కాదు.. అంతకు మించి.. అందుకే కేరళలోని తల్లులు, అక్కలు, చెల్లెళ్లు, అన్నదమ్ముళ్లందరూ ఈ కార్యక్రమంలో ఆనందంగా పాలు పంచుకుంటున్నారు. 'పోతిచోరు సేకరణ ఎప్పుడు అన్నది తెలుసుకుని ఇలా పిడికెడు అన్నం పంచుకోవడం అన్నది చాలా సంతోషంగా ఉంది. నేను చేయగలిగినంతలో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అని ఓ గృహిణి తన భావనను పంచుకున్నారు. ఇది ఆమె ఒక్కరి భావన కాదు.. కేరళ సమాజం భావన! దీన్ని దాతృత్వంగా పరిగణించవద్దని, ప్రస్తుతం యువతలో పెరుగుతున్న స్వార్థాన్ని అంతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని సీపీఎం ఎంపీ రహీమ్‌ అంటున్నారు.. హ్యట్పాఫ్‌ టు కేరళ.

Updated On 26 Jun 2023 2:17 AM GMT
Ehatv

Ehatv

Next Story