✕
దేశమంతటా శరన్నవరాత్రుల వైభవం కనిపిస్తోంది. అమ్మవారి ఆలయాలన్నీ విద్యుద్దీపాల వెలుగులతో కళకళలాడుతున్నాయి. వివిధ అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గా నవరాత్రులు పాడ్యమి నుంచి మొదలయ్యాయి. ఆ రోజున అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిచ్చారు. దక్షుని ప్రథమ పుత్రిక సతీదేవి. ఆమె శివుడి అర్ధాంగి. తన తండ్రి చేతిలో అవమానం పొందిన యోగాగ్నిని తనకు తానే సృష్టించుకుని దహనమయ్యింది సతీదేవి.

x
9 Durga Devi Avatars
-
- దేశమంతటా శరన్నవరాత్రుల వైభవం కనిపిస్తోంది. అమ్మవారి ఆలయాలన్నీ విద్యుద్దీపాల వెలుగులతో కళకళలాడుతున్నాయి. వివిధ అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గా నవరాత్రులు పాడ్యమి నుంచి మొదలయ్యాయి. ఆ రోజున అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిచ్చారు. దక్షుని ప్రథమ పుత్రిక సతీదేవి. ఆమె శివుడి అర్ధాంగి. తన తండ్రి చేతిలో అవమానం పొందిన యోగాగ్నిని తనకు తానే సృష్టించుకుని దహనమయ్యింది సతీదేవి. జన్మజన్మలకు తనకు పరమేశ్వరుడే భర్త కావాలని కోరుకుంది. ఆమె కోరిక మేరకు హిమశైలాధిపతి హిమవంతునికి కూతురుగా జన్మించింది. అప్పటి నుంచి శైలపుత్రిగా ప్రఖ్యాతిగాంచింది. ఆమె వాహనం ఎద్దు. మనుషులు ఎద్దు మొద్దు స్వరూపాలైపోకుండా చురుకుదనాన్ని కలిగించడానికి సంకేతం శైలపుత్రి.
-
- దుర్గాదేవి రెండో అవతారం బ్రహ్మచారిణి. ఈమె పర్వతపుత్రి అయిన పార్వతిగా జన్మించి, ఆ పరమశివుడిని భర్తగా పొందాలనే కోరికతో ఘోర తపస్సు చేశారు. కైలాస పర్వతం మీద దొరికే పచ్చి కూరగాయలను తింటూ కొన్నేళ్లు, పండుటాకులు తింటూ కొన్నేళ్లు, ఆ ఆకులు కూడా తినకుండా కొన్నేళ్లు తపస్సు చేసింది. పర్ణం అంటే ఆకు. ఆకులు కూడా తినకపోవడం వల్ల ఆమెకు అపర్ణ అనే పేరు స్థిరపడింది. ఈమె కుడి ఏతిలో పద్మం. అ నుంచి క్ష వరకు ఉండే అక్షరమాల, ఎడమచేతలో కమండలం ఉంటాయి. పరమేశ్వరుని పతిగా పొందే వరకూ ఈమె బ్రహ్మచారిణే! ఈమెకు కన్యాకుమారి అనే మరో పేరుంది. నేటి తమిళనాడులో కన్యాకుమారి అగ్రం అంటారు. ఆంగ్లేయులు కేప్ కామరిన్ అన్నారు.
-
- దుర్గామాత మూడో అవతారం చంద్రఘంట. అమ్మవారి ఈ రూపం కళ్యాణ కారకం, శుభప్రదం. చంద్రఘంట వాహనం పెద్దపులి. పెద్దపులి వంటి క్రూర రాక్షసులను తల్లి అణచివేస్తుంది. మీకు ఏ ఆపదరాకుండా కాపాడటానికి నేను ఉన్నాను. భయపడకండి అంటూ భక్తులకు ఘంటానాదం వినిపిస్తుంది.
-
- నాలుగో అవతారం కూష్మాండ. అంటే బూడిద గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయ రూపంలో ఉన్న అండం పొదగడం వల్ల సకల ప్రాణికోటి ఆవిర్భవించిందని చెబుతుంటారు.
-
- అయిదో అవతారం స్కందమాత. పార్వతీ మాతకు గణపతి, కుమారస్వామి అనే ఇద్దరు కొడుకులు. కుమారస్వామికి మరో పేరు స్కందుడు. ఏ తల్లికైనా ఉన్న ఇద్దరు కొడుకుల్లోనూ రెండో వాడంటేనే ముద్దు. అందుకే కుమారస్వామిని ఒడిలో ఆప్యాయంగా కూర్చోబెట్టుకుంది. స్కందునికి ఆరు ముఖాలుంటాయి. అరి అంటే శత్రువు. షట్ అంటే ఆరు. మనిషిలోని కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరుగురు శత్రువులను కుమారస్వామి జయించాడనడానికి సంకేతమే ఆరు ముఖాలు. స్కందమాతకు నాలుగు చేతులుంటాయి. రెండు చేతుల్లో పద్మాలుంటాయి. ఆ తల్లి కటాక్షానికి లోనైనవారి హృదయపద్మాలు వికసిస్తాయి. మిగిలిన రెండు చేతుల్లోను బాల కుమారస్వామిని ఒడిలో పెట్టుకుని పట్టుకుంటుంది. చిన్నపిల్లాడు ఒడిలోంచి జారి కిందపడిపోకుండా ఆ తల్లి కాపాడుతుంది. జారి పడిపోవడం అంటే పతనం కావడం. తనను నమ్మిన భక్తులు పతనం కాకుండా ఆ తల్లి కాపాడి ఉద్ధరిస్తుందనడానికి సంకేతమే ఇది.
-
- దుర్గామాత ఆరో అవతారం కాత్యాయని. తనకు పార్వతీమాత కూతురుగా జన్మించాలని కాత్య అనే రుషి తపస్సు చేశాడు. అతనికి కూతురుగా ఆమె జన్మించింది కనుక కాత్యాయని అనే పేరు వచ్చింది. ఈమె కాత్య మహర్షికి కూతురుగా భాద్రపద మాసంలో బహుళపక్షంలో చతుర్దశినాడు జన్మించింది. తరవాత శుక్లపక్షంలో సప్తమి అష్టమి నవమి తిథుల్లో కాత్యాయన మహర్షి పూజలందుకుని, దశమినాడు మహిషాసురునిపై విజయం సాధించింది. అందుకే ఆ రోజు విజయదశమి అయింది. ఆ మహిషాసురుని వూరు, నేటి కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుగా రూపాంతరం చెందిందంటారు. మహిషం అంటే దున్నపోతు. మనుషుల్లోని దున్నపోతు లక్షణాన్ని పోగొట్టడమే మహిషాసుర వధకు సంకేతం.
-
- తల్లి సప్తమ అవతారం కాళరాత్రి. కాళం అంటే చిమ్మచీకటి. తల్లి శరీరం చాలా నల్లగా భయంకరంగా ఉంటుంది. అందుకే ఆమెకు కాళిక అనే పేరు వచ్చింది. ఈమె వాహనం ఖరం అంటే గాడిద. ఈమె చెవులకు ధగధగ మెరిసే మణులు పొదిగిన కమ్మలుంటాయి. ఇప్పటికీ కాశీలో మణికర్ణిక అనే స్నానఘట్టం ఉంది. ఈమె తన కుడిచేతి ద్వారా భక్తులకు వరాలను గుప్పిస్తూంటుంది. మహాకవి కాళిదాసుకు, రామకృష్ణ పరమహంసకీ వరాలిచ్చినట్లు చదువుకున్నాం.
-
- తల్లి ఎనిమిదో అవతారం మహాగౌరి. ఈ తల్లి గౌరవర్ణం అంటే తెలుపు రంగు కలిగింది. ఈమె తెల్లటి ఎద్దు మీద స్వారీ చేస్తుంది. ఈమె ధరించిన చీర కూడా తెలుపే. తెలుపు స్వచ్ఛతకు సంకేతం. పరమశివుని భర్తగా పొందాలని కఠోర తపస్సు చేసింది. అందువలన ఆమె శరీరం నలుపురంగు అయింది. పరమశివుడు ఈమె తపస్సుకు ప్రసన్నుడై, నెత్తిమీదున్న గంగాజలంతో ప్రక్షాళన చేస్తాడు. అప్పుడు తిరిగి శ్వేతవర్ణశోభిత అయింది.
-
- తల్లి తొమ్మిదో అవతారం సిద్ధిదాత్రి భక్తుల కోరికలు సిద్ధింపజేసి, దానంచేసే దాత్రి ఈమె. అమరులైన దేవతలతో సిద్ధులు, గంధర్వులు, యక్షులు మొదలు దానవులు సహితం ఈ తల్లిని సేవించి తమతమ కోర్కెలు సిద్ధింపజేసుకున్నారని చెబుతారు. ఈమెకు శ్రీమన్నారాయణుని లాగా శంఖచక్ర గదాపద్మాలున్నాయి. శ్రీమన్నారాయణుని చెల్లెలు కావడం వల్ల నారాయణి అని స్తుతిస్తారు.

Ehatv
Next Story