ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని పిల్లల ఆసుపత్రిలో శనివారం రాత్రి
ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని పిల్లల ఆసుపత్రిలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు శిశువులు మరణించారని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో మొత్తం 12 మంది నవజాత శిశువులు ఉన్నారని, వారిలో ఒకరు అప్పటికే చనిపోయారని, ఆరుగురు అగ్నిప్రమాదం తర్వాత మరణించారని అధికారులు ధృవీకరించారు. మిగిలిన ఐదుగురిని చికిత్స కోసం మరొక ఆసుపత్రిలో చేర్చారని పోలీసులు తెలిపారు.
ఢిల్లీ పోలీసులు న్యూ బోర్న్ బేబీ కేర్ హాస్పిటల్ యజమాని నవీన్ కిచిపై IPC సెక్షన్లు 336 (ఇతరుల వ్యక్తిగత భద్రతకు ప్రమాదం), 304A (నిర్లక్ష్యం వల్ల మరణం), 34 (నేరపూరిత చర్య) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. శనివారం రాత్రి 11.30 గంటలకు, న్యూ బోర్న్ బేబీ కేర్ హాస్పిటల్‌తో పాటు పక్కనే ఉన్న భవనంలో మంటలు చెలరేగడంతో వివేక్ విహార్ పోలీస్ స్టేషన్‌కు పిసిఆర్ కాల్ వచ్చింది. ఘటనపై ఆరా తీసేందుకు పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ ద్వారా 16 ఫైర్ టెండర్లను పంపించారు. ఆదివారం తెల్లవారుజామున మంటలు అదుపులోకి వచ్చాయి.