మరో నాలుగు రోజుల్లో దేశం కృష్ణాష్టమి(Krishnashtami) చేసుకోనుంది. ఇప్పటికే ఆ పండుగ వాతావరణం వచ్చేసింది. అసలు శ్రావణ బహుళ అష్టమి(Sravana Bahula Ashtami) వచ్చిందంటే చాలు. సమస్త భారతమూ గోకులమవుతుంది. ధర్మస్థాపన కోసం సాక్షాత్తూ భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించిన పుణ్య తిథి ఇది! కృష్ణ అంటే మానవాళి దు:ఖాలు పోగొట్టేవాడని అర్థం. ఆ నామస్మరణే సకల ఐశ్వర్యాలను సమకూర్చిపెడతాయి. ఆయన జగద్గురువు. కృష్ణం వందే జగద్గురుమ్‌ అంటారందుకే! ఆ నందనందనుడికి ఎన్నో ఆలయాలున్నాయి.

మరో నాలుగు రోజుల్లో దేశం కృష్ణాష్టమి(Krishnashtami) చేసుకోనుంది. ఇప్పటికే ఆ పండుగ వాతావరణం వచ్చేసింది. అసలు శ్రావణ బహుళ అష్టమి(Sravana Bahula Ashtami) వచ్చిందంటే చాలు. సమస్త భారతమూ గోకులమవుతుంది. ధర్మస్థాపన కోసం సాక్షాత్తూ భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించిన పుణ్య తిథి ఇది! కృష్ణ అంటే మానవాళి దు:ఖాలు పోగొట్టేవాడని అర్థం. ఆ నామస్మరణే సకల ఐశ్వర్యాలను సమకూర్చిపెడతాయి. ఆయన జగద్గురువు. కృష్ణం వందే జగద్గురుమ్‌ అంటారందుకే! ఆ నందనందనుడికి ఎన్నో ఆలయాలున్నాయి. వాటిల్లో సుప్రసిద్ధమైన క్షేత్రం గురువాయూర్‌ ఆలయ(Guruvayur Temple) విశిష్టతలను ఇప్పుడు తెలుసుకుందాం! గురువాయూర్‌లో ఆ జగద్రక్షకుడు బాలకృష్ణుడిగా వెలిశాడు. గురువాయూరప్పన్‌గా పూజలందుకుంటున్నాడు. శ్రీకృష్ణభగవానుడి ఆలయాల ప్రస్తావన వస్తే ముందుగా గుర్తుకొచ్చేది కేరళలోని(Kerala) గురువాయూర్‌ ఆలయం. త్రిసూర్‌(Thrissur) జిల్లాలోని గురువాయూర్‌లో నెలవై ఉన్న ఈ ఆలయం అయిదు వేల ఏళ్ల కిందటదని అంటారు.

కాకపోతే ఆలయ నిర్మాణానికి సంబంధించి చారిత్రక ఆధారాలు లేకపోయినా ప్రాచీన ఆలయమన్న విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు. క్రీస్తుశకం 14-16 శతాబ్దాలకు చెందిన తమిళ సాహిత్య గ్రంధాలు కోక సందేశం, నారాయణీయంలో గురువాయూర్‌ శ్రీకృష్ణదేవాలయ వర్ణన ఉంది. ప్రాచీనమైనదే అయినా క్రీస్తుశకం 1638లో ఆలయ పునర్నిర్మాణం జరిగినట్టు ఆధారాలున్నాయి.
భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రంలోని శ్రీకృష్ణభగవానుడి దివ్యమనోహరరూపాన్ని ఎంతసేపు చూసినా తనివితీరదు చతుర్భుజాలతో పాంచజన్యం, సుదర్శన చక్రం, కౌమోదకి, తామర పువ్వును ధరించి శ్రీకృష్ణుడు దర్శనమివ్వడం విశేషం.

ఆ మోహనరూపుడు జన్మించినప్పుడు దేవకి వసుదేవులకు ఇదే రూపంతో దర్శనమిచ్చాడట! గురువాయూర్‌ను దక్షిణ భారత ద్వారకగా పిలుచుకునేది అందుకే! ఆ వాసుదేవుడి మంగళస్వరూపం అతి సుందరం. ఆనందకరం. దేవతల గురువు బృహస్పతి. అంటే గురువు, వాయుదేవుడు కలిసి పరశురాముడి సహాయంతో సముద్రగర్భంలో చేరకుండా కాపాడిన కృష్ణుని విగ్రహాన్ని ఈ పవిత్ర ప్రదేశంలో ప్రతిష్టించారు. అప్పటి వరకు రుద్రతీర్థం పేరుతో విలసిల్లిన ఈ క్షేత్రానికి ఆనాటి నుంచి వారి పేరు మీదుగా గురువాయూర్‌ అని వ్యవహరించసాగారు. ఆలయానికి ఉత్తరాన ఇప్పటికీ రుద్రతీర్థం ఉంది. ఆ పరమేశ్వరుడే సకుటుంసమేతంగా ఇక్కడే మహావిష్ణువు కోసం తపమాచరించాడని స్థలపురాణం చెబుతుంది. స్వామికి ఈ కోనేటి నీటితోనే నిత్యం అభిషేకం చేస్తారు అర్చకులు.
స్థలపురాణం మరో గాధను కూడా చెబుతుంది. తక్షకుడి కాటుకు పరీక్షిత్తు మరణిస్తాడు. ప్రతీకారంగా ఆయన కుమారుడు జనమేజయుడు సర్పయాగాన్ని నిర్వహిస్తాడు.

అందులో వేలాది పాములు అగ్నిగుండంలో పడి మరణిస్తాయి. ఈ పాపఫలితంగా జనమేజయుడు కుష్టువ్యాధిగ్రస్తుడవుతాడు. గురు దత్తాత్రేయస్వామి సలహా మేరకు గురువాయూర్‌లో తపమాచరిస్తూ కృష్ణుడి సేవలో తరిస్తాడు. స్వామి కటాక్షంతో రోగ విముక్తుడవుతాడు. నాలుగు చేతులతో మెడలో తులసీమాలతో ఉన్న కృష్ణభగవానుడి విగ్రహం చూడటానికి రెండు కన్నులూ చాలవు. అసలా మూల విరాట్టును అన్ని విగ్రహాల్లా రాతితోనో, పంచలోహలతోనే తయారు చేయలేదు. పాతాళాంజనమనే విశిష్ట వనమూలికలతో రూపొందించారు. మందస్మితంతో విరాజిల్లుతోన్న ఆ మూర్తి సుందర స్వరూపాన్ని చూస్తే చాలు సకలపాపాలు తొలగిపోతాయి.

ఉపనయన వివాహాది కార్యక్రమాలే కాదు, నామకరణాలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు వంటి సమస్త శుభకార్యాలన్నీ ఇక్కడ ప్రతి రోజూ జరుగుతాయి. మొక్కులు తీర్చిన స్వామికి తులాభారాలను సమర్పించుకుంటారు భక్తులు.. తమ స్థాయికి తగినట్టుగా బంగారమో, వెండో, కూరగాయలో, ఆకుకూరలో, బెల్లమో, పంచదారో ఏదో ఒకటి తులాభారం తూగుతారు. కొందరేమో భక్తిపూర్వకంగా స్వామివారికి ఆభరణాలను సమర్పించుకుంటారు. భక్తులు ఇచ్చిన అమూల్య ఆభరణాలను ఓ ప్రత్యేక గదిలో భద్రపరుస్తారు.

ఈ గదిని పంచనాగులనే అయిదు సర్పాలు కంటికి రెప్పలా కాపాడుతుంటాయట! వైష్ణవ పర్వదినాలన్నీ ఇక్కడ బ్రహ్మండంగా జరుగుతాయి. మరీ ముఖ్యంగా జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుతారు. ఉట్టి కొట్టడాలు, కోలాటాలు, సంగీత నృత్య కార్యక్రమాలనైతే చెప్పనే అక్కర్లేదు. ఎంతో పవిత్రమైన ఆలయం కాబట్టే ఈ కార్యక్రమాలను భక్తిశద్ధలతో నిర్వహిస్తారు.
ప్రతిరోజూ ఉదయం ఏనుగుల ఘీంకారాలతో ఆలయ ద్వారాలు తెరచుకుంటాయి.. సాయంత్రం ఆలయమంతా దీపాలు వెలిగిస్తారు. ఈ ఆలయంలో నారాయణీయమ్‌ గ్రంథ పారాయణ చేస్తే రోగాలు దరిచేరవని భక్తుల నమ్మకం. బాలకృష్ణుడి రూపంలో గురువాయూరప్పన్‌ ఈ ఆలయంలో సంచరిస్తుంటాడని విశ్వాసం.

ఇక్కడ కొలువైన గురువాయురప్పన్‌ను కన్నన్‌(Guruvayurappanu Kannan), ఉన్ని కృష్ణన్‌(Unni Krishnan), బాలకృష్ణన్‌ అని రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. ఉదయం మూడు గంటలకే ప్రధానపూజారి పరగడుపుతో ఆలయానికి వచ్చి నాదస్వరంతో చిన్నికృష్ణుడిని నిద్రలేపుతారు. ప్రతి రోజు విగ్రహాన్ని పాలు, కొబ్బరినీళ్లు, గంధం, అత్తరుతో అభిషేకిస్తారు. అనంతరం పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో మూర్తిని అలంకరిస్తారు. స్వామి ఉత్సవ విగ్రహాన్ని అంబారీ ఎక్కించి మేళతాళాలతో ఆలయం చుట్టూ మూడు ప్రదక్షణలు చేయిస్తారు. ఇవీ గురువాయూర్‌ ఆలయ విశిష్టతలు!

Updated On 2 Sep 2023 2:23 AM GMT
Ehatv

Ehatv

Next Story