ఇంట్లోంచి బయటకు రావడం సంక్లిష్టం అయితే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కలిగిస్తాయి ప్రభుత్వాలు.
ఇంట్లోంచి బయటకు రావడం సంక్లిష్టం అయితే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కలిగిస్తాయి ప్రభుత్వాలు. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ఇదే జరుగుతోంది. వాయు కాలుష్యంతో ఆ నగరం విలవిలలాడుతోంది. ప్రస్తుతం అక్కడ వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయిలో ఉంది. ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 కంటే ఎక్కువగా నమోదైంది. పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి మరింత ఎక్కువగానే ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 50 శాతం మంది సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కలిగించింది. 'కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం మంది ఉద్యోగులు (Employees) ఇంటి నుంచి పనిచేస్తారు. దీని అమలు కోసం ఈ రోజు మధ్యాహ్నం సచివాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించనున్నాం’ అని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. వాయు కాలుష్య తీవ్రతను తగ్గించడానికి నగర వ్యాప్తంగా కృత్రిమ వర్షం కురిపించాలని ఢిల్లీ సర్కారు భావిస్తోంది. ఇందుకు అనుమతించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.