కువైట్‌లో(Kuwait) జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో(Fire accident) 50 మంది ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయపడిన వారు కూడా ఉన్నారు.

కువైట్‌లో(Kuwait) జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో(Fire accident) 50 మంది ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయపడిన వారు కూడా ఉన్నారు. వారిలో మంచిర్యాల జిల్లాకు చెందిన కొట్టె గంగయ్య ఒకరు.

మంచిర్యాల (Manchirial)జిల్లా లక్షెటిపేట మండలం పాత కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కొట్టె గంగయ్య (49) కువైట్ లోని 'హైవే సూపర్ మార్కెట్' లో గత పన్నెండు ఏళ్లుగా హెల్పర్(Helper) గా పనిచేస్తున్నాడు. సూపర్ మార్కెట్ యాజమాన్యం తన సిబ్బంది కోసం కువైట్ లోని మంగాఫ్ ప్రాంతంలో ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ లో వసతి సౌకర్యం అంటే లేబర్‌ అకామిడేషన్‌ను కల్పించింది. రెండో అంతస్తులోని ఓ గదిలో గంగయ్యతో పాటు మరో తెలుగువ్యక్తి, ఇద్దరు మలయాళీలు ఉన్నారు. ప్రమాదం జరిగిన రోజున ఓ మలయాళీ మార్నింగ్ డ్యూటీకి వెళ్లాల్సి ఉంది. అతడు పొద్దున్నే లేచి స్నానం ముగించుకుని వచ్చి గట్టిగా కేక వేశాడు. ఆ అరుపుకు మిగతా ముగ్గురు నిద్ర లేచారు. అప్పటికే దట్టమైన పొగ ఆవరించింది. చుట్టూ చీకటి. ఏం చేయాలో పాలుపోలేదు ఆ నలుగురికి.. గంగయ్య తప్ప మిగతా ముగ్గురు ప్రాణాలు కాపాడుకోవడం కోసం రెండో అంతస్తు నుంచి కిందకు దూకారు. వాళ్ల కాళ్లు విరిగాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దూకేందుకు ధైర్యం చాలని గంగయ్య తన మొబైల్ ఫోన్ లోని టార్చ్ లైట్ వెలుగులో పరిసరాలను గమనించాడు. దట్టమైన పొగ వలన కళ్ళు మండినా, చిమ్మ చీకటిలో గోడను పట్టుకుని మెల్ల మెల్లగా కిటికి దగ్గరకు వెళ్లి కేబుల్ వైరు సహాయంతో కింది అంతస్తు లోని రేకులపై దూకాడు. పక్క బిల్డింగ్ వాళ్ళు వేసిన నిచ్చెన సాయంతో కిందికి దిగాడు. ప్రస్తుతం గంగయ్య కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు స్కానింగ్, ఎక్స్-రే తదితర పరీక్షలు చేసి వైద్యం అందిస్తున్నారు. శరీరానికి అక్కడక్కడ చిన్న గాయాలయ్యాయని, మానసిక ఒత్తిడి కారణంగా గుండె వేగంగా కొట్టుకోవడం, బీపీ పెరగడం వంటివి జరిగాయని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story