సరిగ్గా 40 ఏళ్ల కిందట దేశంలో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రపంచం మర్చిపోలేని సంఘటన జరిగింది.
సరిగ్గా 40 ఏళ్ల కిందట దేశంలో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రపంచం మర్చిపోలేని సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్(Bhopal)లో జరిగిన దుర్ఘటన తల్చుకుంటే ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుంది. భయం ఆవరిస్తుంటుంది. విషవాయువులు తమ ప్రాణాలు తీస్తాయని నగర ప్రజలు అనుకోని ఉండరు. హాయిగా నిద్రపోతున్నారు. వారు నిద్రలో ఉన్నప్పుడే మృత్యువు విషవాయువు రూపంలో వారిని కమ్మేసింది. ప్రాణాలు తీసింది. అప్పటి భయానక దృశ్యాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్(Union Carbide India Limited) నుంచి వెలువడిన విషవాయువులు వేలాది మందిని బలి తీసుకున్నాయి. లక్షలాది మంది ఆ విషవాయువు ప్రభావానికి లోనయ్యారు.
1984, డిసెంబర్ 3వ తేదీ. అర్ధరాత్రి కావొస్తోంది. అందరూ గాఢ నిద్రలో మునిగిపోయారు. ఆ నిశీధి వేళ పురుగు మందుల ప్లాంట్‌లో ప్రమాదం సంభవించింది. అత్యంత ప్రమాదకర విష వాయువు మిథైల్ ఐసోసైనేట్ విడుదలయ్యింది. భోపాల్ నగరంలోని మూడొంతుల భాగం విషతుల్యమయ్యింది. వేలాది మంది నిద్రలోనే చనిపోయారు. భూగర్భ జాలాలు కలుషితమయ్యాయి. భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 56 వార్డులు ఉంటే, అందులో 36 వార్డులలో విష వాయువులు వ్యాపించాయి. పాతిక వేల మందికి పైగా మరణించారు. అయిదు లక్షల మంది విష వాయువు ప్రభావానికి లోనయ్యారు. గర్భస్థ శిశువులపై కూడా ప్రభావం చూపింది. చాలా మంది శారరీక, మానసిక దివ్యాంగులయ్యారు.
ఫ్యాక్టరీ నుంచి విషవాయువులు వెలువడుతున్నాయని, దాన్ని మూసివేయాలని ఈ దుర్ఘటన జరగడానికి ముందే షానవాజ్ ఖాన్ అనే లాయర్ నోటీసులు పంపారు. అయినా ఆ హెచ్చరికలను ఫ్యాక్టరీ యాజమాన్య పట్టించుకోలేదు.