భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఇంతకాలానికి ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. అది కూడా సుప్రీం కోర్టు చెబితే తప్ప ఢిల్లీ పోలీసులు స్పందించలేదు. రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇంతకాలం మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు ఢిల్లీ పోలీసులు.

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఇంతకాలానికి ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. అది కూడా సుప్రీం కోర్టు చెబితే తప్ప ఢిల్లీ పోలీసులు స్పందించలేదు. రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇంతకాలం మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు ఢిల్లీ పోలీసులు. బ్రిజ్‌భూషణ్‌పై కన్నాట్‌ ప్లేస్‌ పోలీసు స్టేషన్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మైనర్‌ రెజ్లర్‌ చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు అతడిపై పోక్సో యాక్ట్ ప్రకారం ఓ ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఇక ఇతర రెజ్లర్లు చేసిన ఫిర్యాదులను బేస్‌ చేసుకుని మరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఈ రెండింటిపైనా విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. ఈ అంశంపై మే 5వ తేదీన మరోసారి విచారిస్తామని, అప్పటిలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పైగా నిరసన చేస్తున్న రెజ్లర్లు, ఫిర్యాదు చేసిన వారి జాబితాలో ఉన్న మైనర్‌ రెజ్లర్‌ భద్రతకు సంబంధించి కూడా ఢిల్లీ పోలీసులు బాధ్యత తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. మైనర్‌ రెజ్లర్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఆమెకు తగినంత భద్రత కల్పించాల్సిందిగా ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను సుప్రీం ఆదేశించింది. ఇతర రెజ్లర్ల భద్రతను కూడా పోలీసు కమిషనరే సమీక్షించాలని సూచించింది. అలాగే దర్యాప్తుకు సంబంధించిన డాక్యుమెంట్ల విషయంలో కూడా గోప్యత పాటించాలని చీఫ్‌ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ పీ.ఎస్‌. నరసింహలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలా ఉంటే బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదుపై ఢిల్లీ పోలీసులు స్పందించడం పట్ల రెజ్లర్లు సంతృప్తి వ్యక్తం చేశారు కానీ బజరంగ్‌, వినేశ్‌, సాక్షి తదితర రెజ్లర్లు ఇంకా జంతర్‌మంతర్‌ దగ్గర నిరసన కొనసాగిస్తున్నారు. బ్రిజ్‌భూషణ్‌ అరెస్ట్‌ అయ్యేంత వరకు నిరసన కొనసాగిస్తామని బజరంగ్‌ తెలిపారు. ' మా విజయంలో ఇది తొలి మెట్టు మాత్రమే. మా నిరసన ఇంకా కొనసాగుతుంది. బ్రిజ్‌భూషణ్‌ను అన్ని పదవుల నుంచి తప్పించాలి. జైలుకు పంపాలి. లేకపోతే అతడు విచారణను ప్రభావితం చేస్తాడు' అని రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ తెలిపారు.

ఢిల్లీ పోలీసులు తమ పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని సాక్షి మాలిక్‌ ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది కాబట్టి నిరసన ముగించమని తమపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. 'కరెంట్‌ కట్‌ చేసి గేట్లు మూసేశారు. భోజనం, నీళ్లు కూడా లోపలికి రానివ్వడం లేదు. నేను ఏసీపీతో మాట్లాడాను. ఏం చేస్తారో చేసుకోండి అని ఆయన జవాబిచ్చాడు. వారు ఏం చేసినా మా ఆందోళన కొనసాగిస్తాం. మీ ఇంటి అమ్మాయిలైతే ఇలాగే చేస్తారా? బ్రిజ్‌భూషణ్‌ చట్టం కంటే పెద్దవాడయ్యాడు' అని సాక్షి మాలిక్‌ చెప్పారు. మరోవైపు ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడం తనకు మంచిదేనన్నాడు బ్రిజ్‌భూషణ్‌. విచారణలో అన్ని విధాల సహకరిస్తామన్నాడు. ఎవరిపట్లా తాను తప్పుగా వ్యవహరించలేదని తెలిపాడు.

Updated On 29 April 2023 12:33 AM GMT
Ehatv

Ehatv

Next Story