2009 ఎన్నికల్లో జూ.ఎన్టీఆర్(Jr NTR) తెలుగుదేశం పార్టీ కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగాడు.
2009 ఎన్నికల్లో జూ.ఎన్టీఆర్(Jr NTR) తెలుగుదేశం పార్టీ కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్పుడు టీడీపీలో ఉన్నారు.. జూ.ఎన్టీఆర్‌కు ప్రతిరోజు వెన్నుదన్నుగా నిలిచారు. జూ.ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించుకొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆస్పత్రి బెడ్ మీద పడుకొని కూడా టీడీపీకి(TDP) ఓటు వేయాలని ప్రచారం చేశారు జూ.ఎన్టీఆర్. 2009లో టీడీపీ ఓటమి చెందింది. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాలను పక్కనబెట్టి తన సినిమాలు తాను చేసుకుంటూ కుటుంబంతో గడుపుతున్నాడు. ఆ సమయంలోనే జానకీరామ్, తండ్రి హరికృష్ణ మరణంతో ఆయన బాగా కృంగిపోయారు. హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య గ్యాప్ పెరిగిందనే చెప్పాలి. టీడీపీకి జూ.ఎన్టీఆర్ దూరంగా ఉండడం, అంతే కాకుండా భువనేశ్వరి విషయంలో వైసీపీ నేతలు మాట్లాడిన తీరుపట్ల జూ.ఎన్టీఆర్ పెద్దగా స్పందించకపోవడం, చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు తరలించినప్పుడు కూడా జూ.ఎన్టీఆర్ నుంచి స్పందన రాకపోవడం పట్ల వీరి మధ్య మరింత గ్యాప్ పెరిగిందని భావిస్తున్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ప్రదానం సందర్భంగా జూ.ఎన్టీఆర్ వెళ్లకపోవడం, అసలు ఆయనకు ఆహ్వానం ఉందా లేదా అనేది కూడా చర్చకు దారితీసింది. 2019 ఎన్నికల ఓటమి తర్వాత టీడీపీ పగ్గాలు జూ.ఎన్టీఆర్‌కు అప్పగించాలని టీడీపీ అసంతృప్త నేతలు బహిరంగంగా మాట్లాడంతో అప్పటి నుంచి మరింత గ్యాప్ ఏర్పడిందని కూడా ఓ వర్గం విశ్లేషణ.
ఈ మధ్యే మోక్షజ్ఞ(Mokshagna) తెరంగేట్రం చేశారు. దీనిపై జూనియర ఎన్టీఆర్ స్పందిస్తూ మోక్షజ్ఞకు ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే విజయవాడ వరద బాధితులకు జూ.ఎన్టీఆర్ రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ చెక్కును అందించేందుకు చంద్రబాబుతో భేటీ అవుతారని అన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. జూ.ఎన్టీఆర్‌తో పాటు రాంచరణ్ కూడా కలిసి చంద్రబాబుకు చెక్కును అందిస్తారని ప్రకటించారు. అయితే అనూహ్యంగా చంద్రబాబును జూ.ఎన్టీఆర్ కలవలేకపోయారు. చంద్రబాబును జూ.ఎన్టీఆర్ ఎందుకు కలవలేదన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదా, జూ.ఎన్టీఆర్‌ను కలవడం చంద్రబాబుకు ఇష్టం లేదా అన్న కోణంలో కూడా మాట్లాడుకుంటున్నారు. తన అరెస్ట్, భువనేశ్వరిపై అనుచితంగా మాట్లాడిన వైసీపీ నేతల తీరుపట్ల జూ.ఎన్టీఆర్ మౌనంగా ఉన్నారన్న కోపంలో చంద్రబాబు ఏమైనా ఉన్నారా అనే ప్రశ్న లేవనెత్తుతోంది. ఎన్నికల సమయంలో కూడా పార్టీకి అనుకూలంగా జూనియర్ స్పందించలేదన్న విషయాన్ని చంద్రబాబు మనసులో పెట్టుకున్నారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
ఎన్టీఆర్‌ను కలిసే ఉద్దేశం లేకనే చంద్రబాబు అవాయిడ్ చేశారా అనేది హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చోటా మోటా హీరోలకు కూడా అపాయింట్ మెంట్ ఇచ్చాడు. అలాంటిది ఎన్టీఆర్‌కు ఇవ్వకుండా ఉండరు. ఈ రోజు చంద్రబాబు వరదలపై సమీక్షల నేపథ్యంలో బిజీగా ఉండి అపాయింట్ మెంట్ ఇవ్వలేదా అనేది కూడా చర్చిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా తారక్ కలవడానికి వచ్చినపుడు ఓ 10 నిమిషాలు కేటాయించడం పెద్ద విషయేమి కాదు. అయితే ఎన్టీఆర్ సినిమా దేవర ఈనెల 27న విడుదల కాబోతుంది. దీంతో చంద్రబాబును కలిసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని మరో వర్గం వాదన. ఈ సినిమాకు నిర్మాతగా కల్యాణ్‌రాం ఉన్నారు. కల్యాణ్‌రాం, జూ.ఎన్టీఆర్ కలిసి వరద బాధితుల చెక్ చంద్రబాబుకు అందిస్తారా లేదా సీఎంవోకు చెక్ పంపిస్తారా అనేది చూడాల్సి ఉంది.