బాబూ మూవీస్ సంస్థ తీసిన మూగమనసులు(Muga manusulu) ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.
బాబూ మూవీస్ సంస్థ తీసిన మూగమనసులు(Muga manusulu) ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా పాటల కంపోజింగ్ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పాటు ఆత్రేయ, మహదేవన్, పుహళేంది ఉన్నారు. మ్యూజిక్ సిట్టింగ్‌లో అప్పుడే దాశరథి(Dasarathi krishnamacharya) కూడా వచ్చి చేరారు. అప్పట్లో తమిళంలో హిట్టయిన ఓ పాటను ఆదుర్తి సుబ్బారావు చిన్న హమ్ చేస్తూ కావేరి కరై ఇరిక్కి అన్నారు. వెంటనే దాశరథి అందుకుని గోదారి గట్టుంది అన్నారు. ఆదుర్తికి ఉత్సాహం వచ్చేసింది. ఆగకుండా కరై మేలే మరమిరిక్కి అంటూ పాడారు. మన దాశరథి ఊరికే ఉంటారా? వెంటనే గట్టు మీద చెట్టుంది అని అనేశారు. ఆదుర్తి కాసేపు ఆగారు. అప్పుడు మిగతాది చెప్పండి.. సాహిత్యం చెప్పేస్తానన్నారు దాశరథి. గుర్తుకు రావడం లేదండి.. అదే ఆలోచిస్తున్నాను అని అన్నారు ఆదుర్తి.. పోన్లేండి.. మీకు గుర్తుకురాకపోయినా ఫర్లేదు. మిగతా పాటను నేనే చెప్పేస్తానంటూ చెట్టుకొమ్మన పిట్టుంది.. పిట్ట మనసులో ఏముంది అంటూ పల్లవిని పూర్తి చేశారు దాశరథి. ఆనందంతో చప్పట్లు చరిచారు ఆదుర్తి. శభాష్ అన్నారు మహదేవన్.. మరి కాసేపటికే పాట కూడా పూర్తయ్యింది. రికార్డు కూడా అయ్యింది. సినిమా వచ్చాక రికార్డు సృష్టించింది. దాశరథి పాండిత్యం ఏపాటిదో చెప్పటానికి ఈ పాట చిన్న ఉదాహరణ మాత్రమే!