వేటూరి సుందరరామమూర్తి(Vethuri Sundara Ramamurthy) మన మధ్య నుంచి నిష్క్రమించి అప్పుడే 13 ఏళ్లయ్యింది. అలా అనుకుంటాం కానీ ఆయన మన మధ్య లేనిదెప్పుడు? పాటగా ప్రతీరోజు మనల్ని పలకరిస్తూనే ఉన్నారు. ఆయన తెలుగు సినిమా కోకిలమ్మకు పాటల పందిరి వేశారు.

వేటూరి సుందరరామమూర్తి(Vethuri Sundara Ramamurthy) మన మధ్య నుంచి నిష్క్రమించి అప్పుడే 13 ఏళ్లయ్యింది. అలా అనుకుంటాం కానీ ఆయన మన మధ్య లేనిదెప్పుడు? పాటగా ప్రతీరోజు మనల్ని పలకరిస్తూనే ఉన్నారు. ఆయన తెలుగు సినిమా కోకిలమ్మకు పాటల పందిరి వేశారు. పాటలమ్మకు పట్టు చీరలు తొడిగించారు. పాటను పరవళ్లు తొక్కించారు. ఉరకలెత్తించారు. వేటూరి సుందరరామమూర్తి పుట్టింది పెదకళ్లేపల్లిలో ! 1936, జనవరి 29న! చదివింది మద్రాస్, విజయవాడలలో. తిరుపతి వెంకట కవులు, దైతాగోపాలం, మల్లాదిగార్ల దగ్గర శిష్యరికం.. ఆంధ్రప్రభలో ఉపసంపాదకత్వం.కె. విశ్వనాధ్ తీసిన ఓ సీతకథ తో సినీరంగ ప్రవేశం. ఆ తర్వాత చెప్పేదేముంది.

పాటకు జాతీయ గౌరవం తెచ్చిపెట్టారు. ఎనిమిది నందులను ఇంటికి పిలిపించుకున్నారు. పాటకు గౌరవం తెచ్చారు. ఇదీ వేటూరికి చెందిన సంక్షిప్త సమాచారం. ఇవాళ ఆ మహానుభావుడి వర్ధంతి. ఆయనను స్మరించుకోవాల్సిన సందర్భం ఇది! నిజంగానే వేటూరి సవ్యసాచి. ఆయన కళానికి రెండువైపులా పదునే! ఎలాంటి పాటనైనా అవలీలగా రాసేయగలరు. భాష భావుకతలు ఆయనకు రెండు కళ్లు. తెలుగు సినీ సరస్వతికి పాటల మాలలు అల్లిన సృజనశీలి. సినీ సంగీత లక్ష్మికి సుగంధాలను అద్దిన పదశిల్పి. అసలు తెలుగు సినిమా పాటను కోటి రూపాయల స్థాయికి తీసుకెళ్లింది వేటూరినే!
ఏడో దశకంలో పిల్ల తెమ్మరలా ప్రవేశించి, చిరుగాలిలా చెలరేగి, ప్రభంజనమై వీచారు.

వేటూరి పెన్ను చేయని విన్యాసం లేదు. రాయని భావ సౌందర్యం లేదు. సినిమా పాటకు కొత్త వగరునీ, పొగరునీ, పరిమళాన్నీ తెచ్చింది వేటూరే! తెలుగు సినిమా ఓ అందమైన పూలతోట అయితే.. ఆ పూదోటలో పెరిగిన పాటల చెట్టకు రంగు రంగుల పూలిచ్చారు. కొమ్మకొమ్మకో కోటిరాగాలనిచ్చారు. తెలుగు వారి హృదయాల్లో మల్లెలు పూయించారు. వెన్నెల కాయించారు. పాటలమ్మ కంఠంలోని హారానికి పదాల వజ్రాలను అందంగా, అలంకారంగా పొదిగిన ఆ పదశిల్పి నిజంగానే కారణజన్ముడు.. ఆయన వంటి కవి వెయ్యేళ్లకు కానీ పుట్టడు. ఈ సహాస్రాబ్దిలో పుడతారన్న నమ్మకం లేదు. ఆయన కలం సోకిన సినీ సంగీత నాదం ఝమ్మంటూ మోగుతూనే వుంటుంది. తెలుగువారి తనువులు ఆ మంగళనాదంతో ఊగుతూనే వుంటుంది..

Updated On 22 May 2023 4:38 AM GMT
Ehatv

Ehatv

Next Story