ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రాకేశ్ మాస్టర్ వయసు 53 సంవత్సరాలు. ఇటీవల విజయనగరం నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా వడదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు తీవ్ర రక్త విరోచనాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే గాంధీ ఆసుపత్రిలో చేర్చినప్పటికీ, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. మధ్యాహ్నం 12 గంటలకు రాకేష్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రాకేష్ మాస్టర్ తుది శ్వాస విడిచినట్టు గాంధీ వైద్యులు ప్రకటించారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (Rakesh Master) అనారోగ్యంతో కన్నుమూశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రాకేశ్ మాస్టర్ వయసు 53 సంవత్సరాలు. ఇటీవల విజయనగరం నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా వడదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు తీవ్ర రక్త విరోచనాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే గాంధీ ఆసుపత్రిలో చేర్చినప్పటికీ, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. మధ్యాహ్నం 12 గంటలకు రాకేష్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రాకేష్ మాస్టర్ తుది శ్వాస విడిచినట్టు గాంధీ వైద్యులు ప్రకటించారు.
రాకేష్ మాస్టర్ నేపథ్యం
రాకేష్ మాస్టర్ పూర్తి పేరు ఎస్. రామారావు. 1968 సంవత్సరంలో తిరుపతిలో రాకేష్ మాస్టర్ జన్మించాడు. డ్యాన్స్ మాస్టర్ కావాలన్న కోరికతో హైదరాబాద్‌కు వచ్చి ముక్కురాజు మాస్టర్ వద్ద శిష్యరికం చేశారు. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ కొరియో గ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు రాకేష్ మాస్టర్ శిష్యులే. వేణు, మణిచందన, ప్రభాస్, ప్రత్యూష మొదలైన సినీ నటులకు కూడా రాకేష్ మాస్టర్ శిక్షణ ఇచ్చారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, వరం, అమ్మో పోలీసోళ్లు..దాదాపు 1500 సినిమాలలోని పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈటీవీ వేదికగా ప్రారంభమైన డ్యాన్స్ షో ఢీలో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్‌గా వ్యవహరించాడు. అదే విధంగా జబర్దస్త్ కామెడీ షోకు సంబంధించి పలు ఎపిసోడ్లలో రాకేష్ మాస్టర్ పార్టిసిపెంట్‌గా కూడా పాల్గొన్నాడు. కరోనా లాంటి కష్ట సమయంలో చాలామంది పేదవాళ్ళకి తనవంతుగా సహాయం కూడా చేశారు. 2020 సంవత్సరంలో గ్లోబల్ హ్యమన్ పీస్ యూనివర్సిటీ వారు సేవా రంగంలో రాకేష్ మాస్టర్‌కు డాక్టరేట్ ప్రకటించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా రాకేష్ మాస్టర్
ప్రస్తుతం రాకేష్ మాస్టర్ మరణవార్త సోషల్ మీడియాలో గుప్పుమంది. ఆయనకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆయన చేసిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నా..సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉన్నారు. తన కెరీర్‌ను చాలా మంది డాన్స్ మాస్టర్లు నాశనం చేసారని చెప్పి యూట్యూబ్‌లో ఫేమస్ అయ్యారు. అయితే రాకేష్ మాస్టర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అతనికి మతిస్థితిమితం లేదని కొందరు రూమర్లు పుట్టించారు. విషయం ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఆయనది. దీనికి తోడు మద్యం అలవాటు కూడా ఆయనకు ఇండస్ట్రీలో అవకాశాలను దూరం చేసింది. తరచూ ఇండస్ట్రీ ప్రముఖులు, స్టార్ హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచేవారు. ఇదే అదునుగా పలు యూట్యూబ్ చానళ్లు తాము ఫేమస్ అయ్యేందుకు రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూలను వాడుకున్నాయి. ఈ క్రమంలో భార్యా పిల్లలు సైతం రాకేష్ మాస్టర్‌ను వదిలేసి వెళ్లారు. అలాగే ప్రియు శిష్యుడు శేఖర్ మాస్టర్‌తోనూ మనస్పర్థలు తలెత్తడంతో అతను కూడా దూరమయ్యాడు.
రాకేష్ మాస్టర్ మృతిపట్ల సినీ ఇండస్ట్రీ సంతాపం
కొరియోగ్రాఫర్ రాకేష్ మృతిపట్ల సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులతోపాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాకేష్ మాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నటుడు ప్రభాస్ ట్వీట్ చేశారు. ఇటీవల టాలీవుడ్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖులు స్వర్గస్తులు అవుతూ అందర్నీ శోక సంద్రంలోకి నెట్టివేస్తున్నారు. తాజాగా రాకేష్ మాస్టర్ హఠాన్మరణం అందరినీ షాక్‌కు గురి చేసింది.
సోమవారం బోరబండలో రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు
గాంధీ వైద్యులు రాకేష్ మాస్టర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రి నుంచి రాకేష్ మాస్టర్ మృతదేహాన్ని బోరబండలోని స్వగృహానికి తరలించారు. సోమవారం బోరబండ స్మశాన వాటికలో రాకేష్ మాస్టర్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.