✕
పద్మవిభూషన్(Padma vibhushan) పురస్కారాన్ని అందుకోబోతున్న వైజయంతిమాల(Vyjayantimala) తమిళ నటే అయినప్పటికీ జీవితం, సంఘం సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యారు. వేగుచుక్క, విజయకోట వీరుడు, బాగ్దాద్ గజదొంగ వంటి డబ్బింగ్ సినిమాలతో అలరించారు. ఆమె గొప్ప డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే. ఐక్యరాజ్యసమితిలో భరతనాట్యం చేసిన తొలి భారతీయ నృత్యకారిణి ఈమెనే! 1968లోనే పద్మశ్రీని అందుకున్న ఆమెకు ఇప్పుడు పద్మవిభూషణ్ అందుకుంటున్నారు. వైజయంతిమాలకు బాలీవుడ్లో బ్రహ్మండమైన గుర్తింపు ఉంది. కాకపోతే ఆనాడు ఆమె ఇద్దరు హీరోల మధ్యన నలిగిపోయింది. అయిదో దశకంలో హిందీ సినీరంగంలో పెద్ద హీరోలంటే దిలీప్‌కుమార్, రాజ్‌కపూర్, దేవానంద్. దేవానంద్ స్టయిల్ డిఫరెంట్. తన పనేదో తను చూసుకుంటాడే తప్ప ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోడు.

x
vyjayanthimala love story-
-
- పద్మవిభూషన్(Padma vibhushan) పురస్కారాన్ని అందుకోబోతున్న వైజయంతిమాల(Vyjayantimala) తమిళ నటే అయినప్పటికీ జీవితం, సంఘం సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యారు. వేగుచుక్క, విజయకోట వీరుడు, బాగ్దాద్ గజదొంగ వంటి డబ్బింగ్ సినిమాలతో అలరించారు. ఆమె గొప్ప డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే. ఐక్యరాజ్యసమితిలో భరతనాట్యం చేసిన తొలి భారతీయ నృత్యకారిణి ఈమెనే! 1968లోనే పద్మశ్రీని అందుకున్న ఆమెకు ఇప్పుడు పద్మవిభూషణ్ అందుకుంటున్నారు. వైజయంతిమాలకు బాలీవుడ్లో బ్రహ్మండమైన గుర్తింపు ఉంది. కాకపోతే ఆనాడు ఆమె ఇద్దరు హీరోల మధ్యన నలిగిపోయింది. అయిదో దశకంలో హిందీ సినీరంగంలో పెద్ద హీరోలంటే దిలీప్‌కుమార్, రాజ్‌కపూర్, దేవానంద్. దేవానంద్ స్టయిల్ డిఫరెంట్. తన పనేదో తను చూసుకుంటాడే తప్ప ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోడు. రాజ్‌కపూర్(Raj kapoor), దిలీప్‌కుమార్‌లు(Dilip Kumar) అలా కాదు. వారిద్దరి మధ్య ఎప్పుడూ స్పర్థలు ఉండేవి. వారిద్దరూ పెషావర్‌కు చెందినవారే. 1923 డిసెంబర్లో దిలీప్‌కుమార్ జన్మించాడు. 1924 డిసెంబర్లో రాజ్‌కపూర్ పుట్టాడు. ఇద్దరూ ఓకే స్కూల్లో చదువుకున్నారు. రాజ్‌కపూర్ ఎప్పుడూ హుషారుగా ఉండేవాడు. తను నవ్వుతూ ఎదుటివారిని నవిస్తూ ఉండేవాడు. రాజ్‌కపూర్ ఉన్న చోట సందడి ఉండేది. పైగా నలుగురి దృష్టిలో పడాలనే తపన ఉండేది. అందుకోసం లేనిపోని గొప్పలు చెప్పుకునేవాడు. దిలీప్‌కుమార్ ఇందుకు పూర్తి భిన్నం. ఎవరితోనూ పెద్దగా కలిసేవాడు కాదు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా అంతే! రాజ్‌కపూర్ సినిమాలు ప్రజా సమస్యలను స్పృశించేవి. ఆ సినిమాల్లో కామెడీ కూడా ఉండేది. పైగా 24 ఏళ్లకే రాజ్‌కపూర్ దర్శక నిర్మాత అయ్యాడు. సొంతంగా స్టూడియో నిర్మించుకున్నాడు. అప్పటికే పెళ్లి కూడా చేసుకున్నాడు. దిలీప్ కుమార్ దర్శకత్వంలో జోక్యం చేసుకునేవాడు కానీ తనకు తానుగా దర్శకత్వం చేయలేదు. 37 ఏళ్లకు ఓ సినిమాను నిర్మించాడు. పైగా 43ఏళ్లకు కానీ దిలీప్ పెళ్లి చేసుకోలేదు. కాకపోతే దిలీప్ అంటే హీరోయిన్లకు ఇష్టంగా ఉండేది. భగ్న ప్రేమికుడి పాత్రలలో నటించినందు వల్ల కావచ్చు, అవివాహితుడవ్వడం వల్ల కావచ్చు. మహిళా అభిమానులు మాత్రం ఎక్కువగా ఉండేవారు. కామిని కౌశల్, మధుబాల ఈయన ప్రేయసీమణులే!
-
- ఈ సంగతి అలా ఉంచితే, రాజ్‌కపూర్ కథానాయకుడిగా పేరు తెచ్చుకునే సమయానికే నర్గీస్(Nargis) స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. 1948లో ఆగ్ సినిమా తీస్తున్నప్పుడు నర్గీస్‌ను హీరోయిన్గా తీసుకుందామనుకున్నాడు రాజ్‌కపూర్. అప్పటికే ఆమె దిలీప్‌కుమార్‌కు జోడిగా అనోఖా ప్యార్, మేలా సినిమాలలో నటిస్తోంది. మెహబూబ్‌ఖాన్ తీసిన అందాజ్ సినిమాలో మాత్రం రాజ్‌కపూర్, దిలీప్‌కుమార్, నర్గీస్‌లు కలిసి నటించారు. ఆ సినిమాలో నర్గీస్‌ను మూగగా ఆరాధించే ప్రేమికుడిగా దిలీప్ నటించాడు. ఆమెను అపార్థం చేసుకునే భర్తగా రాజ్‌కపూర్ నటించాడు. దిలీప్ కుమార్ పాటలను ముకేశ్ ఆలపించాడు. విషాదం ముకేష్ గొంతులో ఎంత గొప్పగా పలుకుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా చూసినవారికి దిలీప్‌పై తెలియని సానుభూతి ఏర్పడింది. దీన్ని రాజ్‌కపూర్ తట్టుకోలేకపోయాడు. నర్గీస్ ఎప్పటికీ తనతోనే నటించాలని అనుకున్నాడు. తమ గురించి నలుగురు మాట్లాడుకోవాలని కోరుకున్నాడు. ఆగ్ సినిమా పెద్దగా విజయవంతం కాకపోయినా వెంటనే బర్సాత్ సినిమాను ప్లాన్ చేశాడు. అది కూడా భారీ బడ్జెట్‌తో.. 1950లో వచ్చిన ఆ సినిమా సూపర్‌హిట్టయ్యింది.
-
- మరుసటి ఏడాది ఆవారా తీశాడు. అది కూడా పెద్ద హిట్టే! అదే సమయంలో దిలీప్‌కు జోడిగా జోగన్, బాబుల్, హల్చల్, దీదార్ సినిమాల్లో నర్గీస్ నటిస్తోంది. బర్సాత్ సినిమా షూటింగ్ అప్పుడే రాజ్‌కపూర్ ప్రేమలో నర్గీస్ పడిపోయింది. నర్గీస్ తల్లి ప్రేమను అంగీకరించలేదు. అయితే ఆవారా సినిమా తీస్తున్నప్పుడు నర్గీస్ తల్లి చనిపోయింది. అప్పటికే తండ్రి కూడా చనిపోవడంతో నర్గీస్‌కు అడ్డుచెప్పేవారు లేకుండాపోయారు. 192 నుంచి 1956 వరకు నర్గీస్ వరుసగా రాజకపూర్తోనే నటించింది. రాజకపూర్ సొంత సినిమాలు ఆహ్, శ్రీ420 సినిమాలే కాకుండా బయట నిర్మాతలు తీసిన అన్హోనీ, అంబర్, ఆశియానా, ధూన్, పాపి, చోరీచోరి సినిమాల్లోనూ రాజకపూర్తో కలిసి నర్గీస్ నటించింది. ఈ మధ్య కాలంలో దిలీప్‌కుమార్‌తో శికస్త్ అనే సినిమాలో మాత్రమే నటించింది. మొత్తంగా దిలీప్ కుమార్ ప్రేమలో నర్గీస్ పడకుండా చూడటంలో రాజ్‌కపూర్ సక్సెసయ్యాడు. దిలీప్‌లా తాను కూడా విషాదపాత్రలను పండించగలనని నిరూపించుకోవడానికి ఆహ్ (ప్రేమలేఖలు)తీశాడు.తెలుగు, తమిళ భాషలలో ఇది విజయవంతం అయ్యింది కానీ హిందీలో ఆడలేదు. 1956లో దిలీప్ నటించిన దేవదాస్ సినిమా ఘన విజయం సాధించింది. చోరీచోరీ సినిమాతో నర్గీస్, రాజ్‌ల ప్రేమకథకు పుల్‌స్టాప్ పడింది. ఆ సినిమా షూటింగ్ అప్పుడు ఒకే గదిలో పద్మినితో కలిసి రాజ్‌కపూర్ ఉండటాన్ని నర్గీస్ చూసిందని అంటుంటారు. అందుకే రాజ్‌కపూర్ నుంచి దూరంగా వెళ్లిపోయింది. మదర్ ఇండియా సినిమాలో తన కొడుకుగా నటించిన సునీల్‌దత్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు కూడా దూరమయ్యింది.
-
- నర్గీస్ తన పక్కన నటించడం మానేసిన తర్వాత నిమ్మితో కలిసి దిలీప్ కుమార్ ఆన్, దాగ్, ఉడన్ ఖటోలా సినిమాలు చేశాడు. మధుబాలతో(Madhubala) కలిసి తరానా, సంగ్దిల్, మొఘల్ ఏ ఆజమ్ సినిమాలలో, మీనాకుమారితో కలిసి ఫుట్‌పాత్, అమర్, ఆజాద్ సినిమాలలో దిలీప్ నటించాడు. దేవదాస్ సినిమాలో చంద్రముఖి పాత్ర వేయడం కోసం బాంబేకు వచ్చిన వైజయంతిమాలను చూసి దిలీప్‌కుమార్ మనసు పారేసుకున్నాడు. మొదట్లో వైజయంతిమాల చేసిన సినిమాలన్నీ సెకండ్‌గ్రేడ్ హీరోలతోనే కావడం విశేషం. 1957లో వచ్చిన నయా దౌర్ సినిమా నిర్మాణసమయంలో మధుబాల తండ్రికి, దర్శక నిర్మాత బీఆర్ చోప్రా మధ్య గొడవ ఏర్పడింది. సినిమా అవుట్‌డోర్‌లో తీస్తానని బీఆర్ చోప్రా చెబితే సరేనని ఒప్పుకున్న మధుబాల తండ్ర తీరా షూటింగ్ మొదలయ్యాక అవుట్డోర్ షూటింగ్‌ను ఒప్పుకునే పరిస్థితే లేదని తెగేసి చెప్పాడు. ఎక్కడ దిలీప్ ప్రేమలో పడి తనను విడిచిపెట్టివెళ్లిపోతుందేమోనన్నది తండ్రి భయం! దాంతో మధుబాలపై చోప్రా కేసు పెట్టాడు. మధుబాల ప్లేస్‌లో ఎవరిని తీసుకోవాలా అని చోప్రా ఆలోచిస్తుంటే వైజయంతిమాల పేరు చెప్పాడు దిలీప్.కేసు విచారణ అప్పుడు మధుబాలకు వ్యతిరేకంగా దిలీప్ సాక్ష్యం చెప్పాడు. దాంతో దిలీప్- మధుబాల మధ్య పూడ్చుకోలేని అగాథం ఏర్పడింది. అప్పటికే ఒప్పుకున్న మొఘల్ ఏ ఆజమ్ సినిమాలో వీరిద్దరు రోమాన్స్‌ను అద్భుతంగా పండించారు. ఇదే వారిద్దరు కలిసి నటించిన ఆఖరు సినిమా.
-
- నయాదౌర్ బ్రహ్మండమైన విజయాన్ని సాధించడంతో దిలీప్‌కుమార్- వైజయంతిమాల జంటకు క్రేజ్ పెరిగింది. తర్వత వీరిద్దరు కలిసి నటించిన మధుమతి, పైఘామ్ కూడా సూపర్‌హిట్టయ్యాయి. దిలీప్-మీనాకుమారి కలిసి నటించిన యహూదీ, కోహినూర్ చిత్రాలు కూడా బాక్సాఫీసు దగ్గర విజయాలు సాధించాయి. 1961లో దిలీప్‌కుమార్ సొంతంగా గంగా జమునా సినిమా తీశాడు. అందులో వైజయంతిమాలనే హీరోయిన్గా తీసుకున్నాడు. వైరుధ్యభావాలనున్న అన్నదమ్ముల కథ ఇది. అన్న బందిపోటు. తమ్ముడు పోలీసు ఆఫీసర్. ఇద్దరి మధ్య ఘర్షణ సినిమా మెయిన్ థీమ్. ఎందుకోగానీ ఈ సినిమాకు బోల్డన్నీ సెన్సార్ కష్టాలు వచ్చిపడ్డాయి. 50 కట్స్ చెప్పారు. అయితే ఇక సినిమా కథేముంటుందని దిలీప్ ఆవేదన చెందిన ఆనాటి ఇన్ఫర్మేషర్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్టర్ కేస్కర్ దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నాడు. ఆయన పట్టించుకోకపోవడంతో నెహ్రూ దగ్గరకు వెళ్లాడు. అప్పుడు కానీ సినిమా విడుదల కాలేదు. ఈ తతంగమంతంటికీ ఏడాది సమయం పట్టింది. అదే టైమ్‌లో రాజ్‌కపూర్ జిస్ దేశ్‌మే గంగా బహతీహై అనే సినిమా తీశాడు. ఇందులో పద్మిని హీరోయిన్. ఇదేమో బ్లాక్ అండ్ వైట్ సినిమా. గంగా జమునా సినిమానేమో కలర్. పైగా పద్మిని కంటే వైజయంతిమాలనే అప్పటికి పాపులర్. దిలీప్‌కుమార్ సినిమా ముందుగా విడుదల అయితే తన సినిమా పోతుందన్న భయంతో రాజ్‌కపూర్ తన పలుకుబడిని ఉపయోగించి గంగాజమునాకు అడ్డంకులు కలిగించాడన్న వదంతి బాగా వ్యాపించింది. రూమరే అయినప్పటికీ దిలీప్ మాత్రం నమ్మాడు. చివరకు జిస్ దేశ్ మే గంగా బహతీ హై సినిమా రిలీజయ్యాకే గంగా జమునా వచ్చింది.రెండు సినిమాలు విజయవంతమయ్యాయి. తనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు గ్యారంటీ అని దిలీప్ అనుకున్నాడు. కానీ ఉత్తమ నటిగా వైజయంతిమాలకు అవార్డు వచ్చింది. అలాగే మాటలకు, సినిమాటోగ్రఫీకి అవార్డులు వచ్చాయి. మరోవైపు జిస్ దేశ్ మే గంగా బహతీహై సినిమాకు ఉత్తమచిత్రం, ఉత్తమనటుడు, ఉత్తమ ఎడిటింగ్, ఆర్ట్ డైరెక్షన్లకు కూడా అవార్డులు వచ్చాయి. అవార్డులను కూడా రాజ్‌కపూర్ మేనేజ్ చేసి సంపాదించుకున్నాడనే అనుమానం దిలీప్లో ఉండింది.
-
- దక్షిణాది నిర్మాతలు ఎస్. కృష్ణమూర్తి(S krishna murthy), టి.గోవిందరాజన్లు పెళ్లికానుక సినిమాను హిందీలో తీశారు. హిందీ సినిమాకు కూడా శ్రీధరే దర్శకత్వం వహించాడు. రాజ్‌కపూర్, వైజయంతిమాలను హీరోహీరోయిన్లుగా తీసుకున్నారు. మద్రాస్‌లో షూటింగ్ జరిగింది. అప్పుడు వైజయంతిమాలను చూసిన రాజ్‌కపూర్ మోహంలో పడిపోయాడు. దిలీప్‌కు దూరం చేయాలనే ప్లాన్ వేశాడు. తన అందాజ్ సినిమాను కొద్దిగా మార్పులు చేర్పులు చేసి సంగమ్‌గా తీద్దామనుకుంటున్నానని దిలీప్‌తో చెప్పాడు రాజ్‌కపూర్. నర్గీస్ ప్లేస్‌లో వైజయంతిమాల ఉంటుందని, నువ్వు ఏ పాత్ర వేసినా నాకు అభ్యంతరం లేదన్నాడు. అప్పుడు దిలీప్‌కుమార్ 'నువ్వు హీరో పాత్రనైనా వదులుకో. లేదా దర్శకత్వ బాధ్యతలను మరొకరికైనా అప్పగించు. అప్పుడు నేను నటిస్తాను ' అని చెప్పాడు. ఇది రాజ్‌కపూర్‌కు నచ్చలేదు. అందుకే దిలీప్‌కుమార్ ప్లేస్‌లో రాజేంద్రకుమార్‌ను తీసుకున్నాడు. మరోవైపు పద్మినితో రాజ్‌కపూర్ ఎక్కువ కాలం రిలేషన్‌ను మెయింటైన్ చేయలేదు. ఆషిక్ సినిమా హీరోహీరోయిన్లుగా వారి చివరి సినిమా. చాన్నాళ్ల తర్వాత మేరా నామ్ జోక్‌లో పద్మినికి వేషం ఇచ్చాడు రాజ్‌కపూర్. సంగమ్ సినిమా షూటింగ్ విదేశాలలో కూడా జరిగింది. అందుకే సినిమా పూర్తి కావడానికి చాలా కాలం పట్టింది.
-
- ఈలోపు రాజ్‌కపూర్ పబ్లిసిటీ డిపార్ట్మెంట్ పనిగట్టుకుని వైజయంతిమాలను రాజ్‌కపూర్ కొత్త ప్రియురాలిగా ప్రచారం చేసింది. ఇదంతా దిలీప్‌కు కోపం తెప్పించింది. అప్పటికే వైజయంతిమాలతో కలిసి లీడర్ సినిమాలో నటిస్తున్నారు. పైగా ఇది సినిమాస్కోప్ సినిమా. ఫిల్మిస్తాన్ సంస్థ పతాకంపై శశధర్ ముఖర్జీ తీశాడు. ఆయన అన్న కుమారుడు రామ్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. సినిమా కథ పెద్దదే.. పాటలు కూడా చాలానే ఉన్నాయి. ఇందులో దిలీప్ కామెడీ కూడా చేశాడు. కాకపోతే స్క్రిప్ట్‌లో వేలు పెట్టాడు. దర్శకత్వంలో కాలు పెట్టాడు. అనుకున్న సమయం కంటే సినిమా చాలా ఆలస్యంగా పూర్తయ్యింది. అటు సంగమ్, ఇటు లీడర్.. ఈ రెండు సినిమాల మధ్య వైజయంతిమాల బాగా నలిగిపోయింది. ఇద్దరూ ఒకేసారి డేట్స్ అడిగేవారు. ఏం చేయాలో పాలుపోకపోయేది ఆమెకు! 'నా సినిమా కంటే రాజ్ సినిమాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు' అని దిలీప్ ఆడిపోసుకునేవాడు. ఇదే మాటను అటు రాజ్‌కపూర్ కూడా అనేవాడు. ఇది చాలదన్నట్టు రాజ్‌కపూర్-వైజయంతిమాల మధ్య ఏదో ఉందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. అవి ఎవరు పుట్టించారో ముందే చెప్పాను. ఈ ప్రేమకథ రక్తి కట్టడానికి బోల్డంత చెప్పేవారు. వైజయంతి మాల మైసూర్ మహారాజు కూతురని, ఆర్కె స్టూడియోలోని రాజ్ కుటీరంలోనే రాత్రుళ్లు వైజయంతి గడుపుతోందని.. అదనీ ఇదనీ అనేక కథలను ప్రచారం చేశారు. సంగం సినిమా ఘన విజయం సాధిస్తే, లీడర్ సినిమా పరాజయంపాలైంది.. ఇది దిలీప్‌కు పుండు మీద కారం చల్లినట్టయ్యింది.
-
- లీడర్ నిర్మాణంలో ఉన్నప్పుడే కర్దార్ అనే దర్శక నిర్మాత దిలీప్ హీరోగా దిల్ దియా దర్ద్ లియాఅనే సినిమాను మొదలు పెట్టాడు. దిలీప్ సూచన మేరకు ఇందులో వహీదా రెహమాన్‌ను హీరోయిన్గా తీసుకున్నారు. ఈ సినిమా విషయంలో కూడా దిలీప్ మితిమీరి జోక్యం చేసుకున్నాడు. కథను మార్చేశాడు. కర్దార్‌ను పక్కన పెట్టేసి తనే డైరెక్ట్ చేశాడు. సినిమా ఘోరంగా దెబ్బతింది.అయినప్పటికీ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రాముడు భీముడు సినిమాను హిందీలో తీస్తూ దిలీప్కుమార్నే హీరోగా ఎంచుకున్నాడు బి.నాగిరెడ్డి. హీరోయిన్లుగా వైజయంతిమాల, మాలా సిన్హాలను అనుకున్నాడు. మాలాసిన్హా ప్లేస్‌లో తర్వాత ముంతాజ్‌ను తీసుకున్నారు. దర్శకుడు చాణక్యనే అయినప్పటికీ దిలీప్‌కుమారే దర్శకత్వం చేస్తుండటం వైజయంతిమాలకు నచ్చలేదు. కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆమె సినిమా నుంచి వైదొలిగింది. ఆమె ప్లేస్‌లో వహీదారెహమాన్ను తీసుకోవాల్సివచ్చింది. తనను దిలీప్ కుమారే సినిమా నుంచి తొలగించాడని తన ఆత్మకథలో వైజయంతి మాల రాసుకొచ్చింది. అప్పటికే రాజ్‌కపూర్ వ్యక్తిగత డాక్టర్ అయిన బాలిని పెళ్లి చేసుకుంది. అయినా కానీ తనను కాదని రాజ్‌కపూర్ క్యాంప్‌లోకి వెళ్లిపోయిందన్న కోపం దిలీప్లో ఉండేది.
-
- ఎనిమిది రోజుల ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని బాంబేకు తిరిగి వెళుతున్నప్పడు నాగిరెడ్డి మేనేజర్ వచ్చి తర్వాతి డేట్స్ ఎప్పుడు ఇస్తారో రాత పూర్వకంగా ఇవ్వండి అని అడిగాడు.తాను ఇప్పుడు ఏ సంతకాలు పెట్టనని చెప్పేసి వైజయంతి విమానం ఎక్కేసింది. అదే విమానంలో ఆమెతో నజరానా, సూరజ్ సినిమాలు తీసిన నిర్మాత వీనస్ కృష్ణమూర్తి ఉన్నాడు. అదేమిటి ఇలా కొత్తగా అడుగుతున్నారు అని ఆయనతో చెప్పంది వైజయంతిమాల. అదేమిటీ నీకు తెలియదా? నిన్ను తీసేసి వహీదారెహమాన్ను పెట్టుకున్నారు కదా అని చెప్పాడు. బాంబేకు రాగానే వెంటనే ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మన్మోహన్ కృష్ణకు కంప్లయింట్ చేసింది. ఆయన నాగిరెడ్డికి నోటీసు పంపించాడు. సినిమాపై స్టే వచ్చింది. ఆ మరుసటి రోజు నాగిరెడ్డి మేనేజర్ బాంబేకు వచ్చి సారీ చెప్పి ఒప్పుకున్న ప్రకారం రెమ్యూనిరేషన్ ఇచ్చి వెళ్లాడు. ఈ సినిమాలోనే కాదు, గుడిగంటలు హిందీ వెర్షన్ ఆద్మీ సినిమాకు కూడా వహీదానే తీసుకోమని చెప్పాడు దిలీప్. తర్వాత దిలీప్, వైజయంతిమాల బద్ధ శత్రువులయ్యారు. ఫలితంగా 1968లో వారిద్దరూ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సంఘర్ష్ నిర్మాణం ఆగిపోయింది. అప్పటికే సినిమాకు బాగా ఖర్చు పెట్టేశారు. హీరోయిన్ను మార్చే ఛాన్స్‌లేదు. దర్శకుడు రవైల్ ఇద్దరి దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పుకున్నాడు. మొత్తానికి ఇద్దరూ మెత్తపడ్డారు. షూటింగ్ మళ్లీ మొదలయ్యింది. అది కూడా రొమాంటిక్ సీన్‌తోనే! ఏమవుతుందో చూడాలనే ఆసక్తితో జర్నలిస్టులంతా వచ్చారు. దిలీప్‌కుమార్, వైజయంతిమాల ఇద్దరూ ప్రొఫెషనల్సే కావడం వల్ల కెమెరా ముందు రొమాన్స్‌ను అద్భుతంగా పండించారు. కానీ సీన్ కంప్లీట్ అయ్యాక ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. మొహాలు కూడా చూసుకోలేదు. 1968లో రిలీజైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత దిలీప్‌తో వైజయంతిమాల కలిసి నటించలేదు. రాజ్కపూర్తోనూ అంతే! వారిద్దరి ఛాయలోకి కూడా వెళ్లలేదు. దేవానంద్, ఉత్తమ్‌కుమార్, షమ్మీ కపూర్, ధర్మేంద్ర, రాజేంద్రకుమార్లతో నటించిన వైజయంతిమాల 1970లో సినిమాలకు గుడ్‌బై చెప్పింది. దీవార్ సినిమాలో తల్లి పాత్ర చేయమని యాష్ చోప్రా అడిగినా సున్నితంగా కాదనేసింది. హీరోయిన్‌గానే సినిమాల నుంచి వైదొలిగింది. తర్వాత డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తూ వచ్చింది. ఇప్పటికీ ఆమె యాక్టివ్గానే ఉంది.

Ehatv
Next Story