తమిళ దర్శకుడు పా.రంజిత్‌ది(Pa. Ranjith) ప్రత్యేకమైన శైలి.
తమిళ దర్శకుడు పా.రంజిత్‌ది(Pa. Ranjith) ప్రత్యేకమైన శైలి. ఆయన రూపొందించిన తంగలాన్(Thangalan) సినిమా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఆయన సినిమాలలో సామాజికసమస్యలు ఉంటాయి. వెనుకబాటుతనం ఉంటుంది. అణగారిన వర్గాల గొంతు ఉంటుంది. తన సినిమాల ద్వారానే రాజకీయాలను మాట్లాడతానని ఈ మధ్యనే పా.రంజిత్ చెప్పాడు కూడా! తంగలాన్ కంటే ముందు ఆయన ఆర్య హీరోగా సార్పట్ట పరంపర సినిమా తీశారు. ఆ సినిమా కూడా బ్రహ్మండమైన విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్ కూడా కచ్చితంగా ఉంటుందని దర్శకుడు ప్రకటించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులలో(National awards) సార్పట్ట పరంపరకు(Sarpatta Parampara) ఒక్క అవార్డు కూడా రాకపోవడం విస్మయం కలిగించింది. ఇదే విషయాన్ని పా.రంజిత్ కూడా అంటున్నారు. ఆ చిత్రానికి అవార్డు రాకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. రాజకీయాల కారణంగానే తనను తన పనిచేసుకోకుండా అడ్డుకుంటున్నారన్నారు. పలు క్రిటిక్స్ అవార్డులను పొందిన సార్పట్ట పరంపర సినిమా జాతీయ అవార్డుల జ్యూరీకి ఎందుకు కనిపించలేదో అర్థం కావడం లేదన్నారు. సార్పట్ట పరంపర చిత్రానికి అర్హత లేదా అని ప్రశ్నించారు. తన భావాలను ప్రామాణికంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిరాకరించారనే ఆరోపణను చేశారు. ఉద్దేశపూర్వకంగానే తన పనిని గుర్తించకూడదని కొందరు పనికట్టుకుని చేస్తున్నారని పా.రంజిత్ ఆరోపించారు.