Life Imprisonment : ప్రముఖ నటుడి కుమారుడికి జీవిత ఖైదు
గత ఏడాది థాయ్‌లాండ్‌లోని కో ఫంగన్ ద్వీపంలో ఒక వ్యక్తిని చంపి, అవయవాలను ముక్కలు చేసిన కేసులో ప్రసిద్ధ స్పానిష్ నటుడి కుమారుడికి జీవిత ఖైదు విధించారు.
గత ఏడాది థాయ్‌లాండ్‌లోని కో ఫంగన్ ద్వీపంలో ఒక వ్యక్తిని చంపి, అవయవాలను ముక్కలు చేసిన కేసులో ప్రసిద్ధ స్పానిష్ నటుడి కుమారుడికి జీవిత ఖైదు విధించారు. టెలివిజన్ స్టార్ రోడోల్ఫో సాంచో అగ్యురే కుమారుడు డేనియల్ సాంచో బ్రోంచలో కొలంబియన్ ప్లాస్టిక్ సర్జన్ ఎడ్విన్ అరియెటా ఆర్టిగాను చంపేశాడు. మొదట తాను ఆత్మరక్షణ కోసమే ఈ పనిచేశానని డేనియల్ చెప్పుకొచ్చాడు. కానీ ఆ తర్వాత సాక్ష్యాలు అతడికి వ్యతిరేకంగా ఉండడంతో డేనియల్ చేసిన తప్పును ఒప్పుకోవాల్సి వచ్చింది. 2023 ఆగస్టులో జరిగిన హత్యకు డేనియల్ నేరాన్ని అంగీకరించాడని BBC నివేదించింది.
30 ఏళ్ల డేనియల్ అప్పట్లో తనను అరియెటా బందీగా చేసుకున్నాడని తెలిపాడు. అతడి నుండి తప్పించుకోడానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే తాను చంపాల్సి వచ్చిందని అప్పట్లో చెప్పాడు. ఈ కేసు స్పెయిన్‌లో ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటనను కవర్ చేయడానికి చాలా మంది జర్నలిస్టులు థాయ్‌లాండ్‌కు వెళ్లారు. డేనియల్ శవాన్ని దాచిపెట్టడం, ఆస్తులను నాశనం చేయడం వంటి నేరాలకు పాల్పడ్డాడని కూడా తేలింది.
కో స్యామ్యూయ్ ద్వీపం న్యాయస్థానం, హత్యకు పాల్పడినందుకు అతనికి మరణశిక్ష విధించింది. అయితే, విచారణ సమయంలో డేనియల్ సహకరించిన కారణంగా యావజ్జీవ కారాగార శిక్షకు తగ్గించారు. డేనియల్.. అరియెటా కుటుంబానికి పరిహారంగా 4 మిలియన్ భాట్ ($118,000) చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించబడింది.
డేనియల్ ఒక కత్తి, రబ్బరు గ్లోవ్స్, క్లీనింగ్ ఏజెంట్ బాటిల్‌ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని థాయ్ మీడియా నివేదించింది. ఈ హత్య ముందస్తు ప్రణాళికతో జరిగినదని పోలీసులు నిర్ధారించారు. డేనియల్ ఏడు ప్రదేశాలకు పోలీసులను తీసుకుని వెళ్ళాడు. అక్కడ అతను ప్లాస్టిక్ సంచుల్లో అరియెటా ఛిద్రమైన శరీరాన్ని పారవేసినట్లు చూపించాడు. ఆన్‌లైన్‌లో పరిచయమైన తర్వాత డేనియల్ ను అరియెటా కలవడానికి అంగీకరించారని నివేదికలు పేర్కొన్నాయి. సాంచో నటుల కుటుంబం నుండి వచ్చాడు. అతని తల్లి నటి సిల్వియా బ్రోంచాలో, అతని తాత దివంగత నటుడు ఫెలిక్స్ ఏంజెల్ సాంచో గ్రేసియా మంచి పేరున్న నటుడిగా గుర్తింపు పొందారు.