తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda surekha) చేసిన జుగుప్సాకరమైన, అత్యంత నీచమైన కామెంట్లు తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపుతున్నాయి.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda surekha) చేసిన జుగుప్సాకరమైన, అత్యంత నీచమైన కామెంట్లు తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపుతున్నాయి. సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమై కొండా సురేఖను తప్పపడుతోంది. ఇండస్ట్రీలోని మహిళలకు ఏదైనా జరిగితే ముందుగా స్పందించే గాయని చిన్మయి శ్రీపాద కూడా రియాక్టయ్యారు. కొండా సురేఖ వ్యాఖల తర్వాత కొన్ని యూ ట్యూబ్ చానళ్లు సమంత పేరుతో చేసిన వీడియోలు అత్యంత దారుణమన్నారు. 'దురదృష్టవశాత్తూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, మీడియాకు చెందిన వ్యక్తులు పెట్టిన దారుణ వీడియోలు, పోస్టులు చూశా. తమ మైలేజీ పెంచుకోవడంతో పాటు డబ్బు, క్లిక్స్, వ్యూస్ కోసం కొన్ని తెలుగు యూట్యూబ్ ఛానళ్లు సమంత పేరును ప్రముఖంగా ప్రస్తావించాయి. చివరికి అర్థమైంది ఏంటంటే, నెటిజన్ల దృష్టిని ఆకర్షించడానికి వీళ్లందరికీ ఆమె పేరు కావాలి. మరో మార్గం లేదు. ఒక్క విషయమైతే కచ్చితంగా చెప్పగలను. కలలో కూడా ఆమె స్థాయిని ఎవరూ అందుకోలేరు. వీళ్ల కర్మకాలిపోవాలని కోరుకోవడానికి నవరాత్రికి మించిన మంచి సమయం మరొకటి లేదు' అని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఓ నెటిజన్ చిన్మయికి ఓ ప్రశ్న వేశాడు. 'బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ (phone tapping case) వివాదంపై సమంత కచ్చితంగా స్పందించాలి. సమంత ఫోన్ ట్యాపింగ్‌కు గురైన విషయం నిజమా? కాదా? చెప్పండి' అని అడిగాడు. అందుకు చిన్మయి చక్కటి సమాధానం ఇచ్చారు. ఆమె ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని, రాజకీయ నాయకులు వాళ్ల నోటికొచ్చింది మాట్లాడుతారని, చేయాల్సింది చేస్తారని, వాళ్లు ఎవరూ జవాబుదారీగా ఉండరని చిన్మయి సమాధానమిచ్చారు.