తెలుగు ప్రేక్షకుల బంగారు కలలకు వెండితెర ప్రతిరూపం. స్ఫురద్రూపం. జగన్మోహన రూపం. గంభీర స్వరం ఆయన్ను నవరసనటనా దురంధరుడిగా తీర్చిదిద్దాయి. అయిదు దశాబ్దాల పాటు మూడు తరాల ప్రేక్షకులను అసమాన అభినయంతో మెప్పించగలిగారంటే ఆయన ఆంగికాభినయాలే కారణం.

తెలుగు ప్రేక్షకుల బంగారు కలలకు వెండితెర ప్రతిరూపం. స్ఫురద్రూపం. జగన్మోహన రూపం. గంభీర స్వరం ఆయన్ను నవరసనటనా దురంధరుడిగా తీర్చిదిద్దాయి. అయిదు దశాబ్దాల పాటు మూడు తరాల ప్రేక్షకులను అసమాన అభినయంతో మెప్పించగలిగారంటే ఆయన ఆంగికాభినయాలే కారణం. నిండైన వ్యక్తిత్వం. నిలువెత్తు తెలుగుతనం ఆయన్ను యుగపురుషుడిని చేశాయి.. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల సమర్థతే ఆయన్ను తిరుగులేని నటుడిని చేశాయి. నవరసాలను అలవోకగా ఒలికించగల నైపుణ్యమే ఆయన్ను మర్చిపోలేని మహానటుడిని చేశాయి. నిజంగా ఆయన యుగానికొక్కడే. ఆయన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు.. ఇన్నేసి విశేషణాలు ఆయనకుగాక ఇంకెవరికుంటాయి? ఆ కళాప్రపూర్ణుడు పోషించని పాత్ర లేదు. నవరసాలు ఆయనకు కొట్టిన పిండి..

నవరసాలను మెప్పించగలవాడే పరిపూర్ణనటుడు. నటుడన్నాక ఏ పాత్రకైనా ప్రాణం పోయాలి. ఏ రసాన్నయినా కష్టపడకుండా ప్రేక్షకులు ఇష్టపడేలా నటించాలి. మహానటుడు ఎన్టీయార్‌ నవరసాలను అద్భుతంగా పండించారు. ప్రేక్షకులకు కన్నుల పండుగ చేశారు. సాధారణంగా హీరోలెవ్వరూ హాస్య పాత్రలను పోషించడానికి అంతగా ఇష్టపడరు. కానీ రామారావు అలాకాదు. ఎన్నో సినిమాల్లో కామెడీ టచ్‌ వున్న పాత్రలను ధరించారు. అతి సంక్లిష్టమైన హాస్యాన్ని అద్భుతంగా పండించారు.. వద్దంటే డబ్బు, గుండమ్మకథ, దేవాంతకుడు, తిక్కశంకరయ్య మొదలైన చిత్రాల్లో హాస్య ప్రధానమైన పాత్రలను ధరించి ప్రేక్షకులకు హాయిగా, ఆహ్లాదంగా నవ్వుకునే అనుభూతిని కలిగించారు...

ఇతిహాసాన్ని సృష్టించే వాడే కథానాయకుడు. చరిత్రలో తనకంటూ కొన్ని పుటలను ఏర్పరచుకునేవాడే ధీరోదాత్తుడు. ఎన్టీయార్‌లో(Sr.NTR) ఈ లక్షణాలు పుష్కలంగా వున్నాయి కాబట్టే రౌద్ర రసం అద్వితీయంగా పోషించాడు.. తన వాళ్లు ఆపదలో వున్నప్పుడు, తనకు ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఎన్టీయార్‌ కనబరిచే నటన రోమాంచితులను చేస్తుంది. తనను తనవాళ్లను కాపాడుకోవడం కోసం ఎన్టీయార్‌ కాలరుద్రుడిలా విజృంభిస్తాడు. నిజానికి కోపం పాత్రకి రాకూడదు. ఆ పాత్రను చూస్తున్న మనకు రావాలి. మన కళ్లు కోపంతో ఎరుపెక్కాలి... మన పిడికిళ్లు అప్రయత్నంగా బిగుసుకుపోవాలి. రుద్రరూపం దాల్చి రౌద్రరసాన్ని మహాద్భుతంగా పండించిన ఎన్టీయార్‌ నట విశ్వ రూపాన్ని చూస్తే మీరే ఒప్పుకుంటారు. శృంగార రసాన్ని పోషించడం కూడా సంక్లిష్టమే. ఎన్టీయార్‌ శృంగార రస ప్రధాన ప్రాతలను అనేకం ధరించాడు. రక్తి కట్టించాడు. కేవలం హీరోయిన్‌తో డ్యూయెట్లు పాడుకునేవాడు శృంగార కథానాయకుడు కానే కాడు. ముఖ భంగిమల్లో, పలికే సంభాషణల్లో, నడకలో, నడతలో మాధుర్యాన్ని, లాలిత్యాన్ని ఏకకాలంలో పలికించాలి. అప్పుడే శృంగార కథానాయకుడనిపించుకుంటాడు. ఈ గుణగణాలన్నీ ఎన్టీయార్‌లో వున్నాయి. అందుకే ఆయన శృంగార రాముడనిపించుకున్నాడు.

రాతి గుండెలను సైతం కరిగించి కన్నీరు మున్నీరు చేయగల శక్తి ఒక్క కరుణరసానికే వుంది. కరుణ రసాన్ని ఒలికిస్తున్న పాత్రను చూస్తే కళ్లు చెమ్మగిల్లాలి. దు:ఖం పొంగుకురావాలి. చిరంజీవులు సినిమాలో భగ్న ప్రేమికుడిగా, రక్త సంబంధంలో ఆత్మీయానురాగాలు పంచే అన్నగా, బడిపంతులు సినిమాలో కొడుకుల నిరాదరణకు లోనైన ఓ బడిపంతులుగా రామారావు నటించిన అనేక పాత్రలను చూసి ప్రేక్షకులు కంట తడి పెట్టారు. పీడితుల కోసం, బాధితుల కోసం సర్వస్వాన్ని త్యాగం చేయగలవాడే వీరుడు. ఏటికి ఎదురీదేవాడే మొనగాడు. ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నమ్ముకున్నవారి కోసం పోరాడేవాడే ధీరోదాత్తుడు. ఇవన్నీ వీర రస ప్రధాన లక్షణాలు. ఇలాంటి పాత్రలను పోషించడంలో ఎన్టీయార్‌కు మరెవ్వరూ సాటిరారు. ఎన్టీయార్‌ అసమాన నటుడు. రాముడి పాత్ర వేసి జనాలను మెప్పించిన ఆయనే రావణుడి పాత్రా వేసి శభాష్‌ అనిపించుకున్నాడు.కృష్ణుడిగా ఆరాధనలు అందుకుంటున్న సమయంలోనే దుర్యోధనుడి పాత్రను అనితర సాధ్యంగా పోషించాడు. ఎన్ని వందల పాత్రలు వేసినా ఎన్టీయార్‌కు రావణుడి పాత్రంటే అమితమైన ఇష్టం. భక్తాగ్రేసరుడు అయిన రావణాసురుడి పాత్రను నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో తీర్చి దిద్దిన ఘనత ఎన్టీయార్‌కే దక్కుతుంది. పరమశివుడి పరమ భక్తుడైన రావణుడు ..ఆ స్వామి కరుణా కటాక్షాల కోసం కైలాసాన్నే పెకిలిస్తాడు.. అప్పటికీ నీలకంఠుడు ప్రత్యక్షం కాకపోతే పేగులు బైటకు లాగి రుద్రవీణ మీటుతాడు. ఆ బీభత్స రసాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తాడు.

ప్రేక్షకుల గుండెల్లో తోటరాముడిగా(Thota ramudu) గూడు కట్టుకున్న ఎన్టీయార్‌ నిజమైన కథానాయకుడు. అమాయకత్వం, నిజాయితీ, నిబద్దత, నిర్బీతి, పట్టుదల, అంకితభావం ఇవన్నీ వున్నాయి. కత్తి పట్టి కదనరంగంలో దూకి వైరి పక్షాలను కకావికలం చేయడమే అభిమానులకు కావాలి. ఎన్టీయార్‌ నుంచి అభిమానులు కోరుకున్నది కూడా అదే. మాస్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటుడుకి శాంతరసం పోషించడం చాలా చాలా కష్టం. కష్టమైనదే రామారావుకు ఇష్టం. శాంత రసాన్ని కూడా ఆయన సునాయాసంగా పోషించాడు.. వాస్తవానికి శాంత రస పోషణ చూసే ఆంధ్రదేశమంతా ఆయన్ను ఆరాధిస్తోంది. కృష్ణుడు(Krishna), రాముడు(Rama), మహా విష్ణువు(Maha Vishnu) ఒకటేమిటి అనేక పాత్రలు శాంత రసానికి ప్రతీకలుగా నిలిచాయి. ఎన్టీయార్‌ పోషించిన కొన్ని పాత్రలను చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. సినీ లోకం అద్భుతం. మహాద్భుతం నివ్వెరపోయి చూసింది. ఇప్పటికీ ఆశ్చర్యంగానే వుంటుంది. ఆ పాత్రలు ఎన్టీయార్‌ కోసమే పుట్టాయా. లేక ఆ పాత్రలను పోషించడానికే ఎన్టీయార్‌ పుట్టాడా? ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. లేకపోతే నవ యవ్వనంలో వున్నప్పుడు పండు ముదుసలి భీష్ముడి పాత్రను వేయడం ఎవరివల్ల అవుతుంది? వేసే సాహసం ఎవరైనా చేయగలరా? అగ్రనటుడిగా నీరాజనాలు అందుకుంటున్న తరుణంలో బృహన్నల పాత్రను పోషించగలరా? ఈ రెండు పాత్రలు చూస్తే చాలు అద్భుత రసపోషణ ఎలా వుంటుందో అర్థమవుతుంది. హఠాత్తుగా బోనులో చిక్కుకున్న సింహాన్ని ఎప్పుడైనా చూశారా? భయానకంగా వుంటూ చూసేవాళ్లను భయభ్రాంతులను చేస్తుంది. ప్రతినాయకులు నట సింహం ఎన్టీయార్‌ను బంధించినప్పుడూ అంతే. ప్రేక్షకులు భయభ్రాంతులకు గురవడం ఖాయం. భయానక రస పోషణ అలాంటిది మరి! అందరికీ సాధ్యం కాదు. సంకెళ్లను తుత్తునీయలు చేస్తున్నప్పుడు, బంధనాలను తెంచుకుంటున్నప్పుడు ఎన్టీయార్ నటన కట్టలు తెంచుకుంటుంది. సినిమాలో ప్రతినాయకులకే కాదు, సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కూడా భయం పుట్టిస్తుంది. భయానక రస పోషణంటే అదే మరి!

Updated On 27 May 2023 6:52 AM GMT
Ehatv

Ehatv

Next Story