మహాభారతంలోని విరాటపర్వం ఆధారంగా రూపొందిన అద్భుత చిత్రరాజం నర్తనశాల(Narthanashala). నటరత్న ఎన్టీఆర్(NTR) బృహన్నలగా, అర్జునుడుగా, మహానటుడు ఎస్వీ రంగారావు కీచకునిగా,మహానటి ద్రౌపదిగా, ఉత్తరకుమారుడిగా రేలంగి నటించిన ఈ దృశ్యకావ్యం విడుదలయ్యి నేటికి సరిగ్గా 60 ఏళ్లు. షష్టిపూర్తి జరుపుకుంటున్న ఈ పౌరాణిక చిత్రం(Periodic Movie) గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం! అపవాదు, పంతులమ్మ సినిమాలలో హీరోయిన్గా నటించిన లక్ష్మీరాజ్యం(Lakshmi Rajyam) 1941లో రెవిన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శ్రీధర్‌రావును పెళ్లి చేసుకున్నారు. 1951లో వీరిద్దరు రాజ్యం పిక్చర్స్ సంస్థను ప్రారంభించారు. మొదటి ప్రయత్నంగా 1952లో దాసి సినిమాను తీశారు. అది బాగా ఆడింది. 1956లో ఎస్వీఆర్‌తో హరిశ్చంద్ర తీశారు. మూడేళ్లకు శ్రీకృష్ణ లీలలు సినిమాను నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత నర్తనశాలను ప్లాన్ చేశారు. అంతకు ముందు ద్రౌపది పేరుతో సినిమా తీయాలనుకున్నారు కానీ సినిమా నిడివి బాగా పెరిగిపోతుందనే భావనతో కేవలం విరాటపర్వ(Virataparam) కథకే పరిమితమయ్యి నర్తనశాల తీయడానికి సంసిద్ధులయ్యారు.
గూడవల్లి రామబ్రహ్మం నిర్మించిన ఇల్లాలు, అపవాదు సినిమాలలో నటించిన లక్ష్మీరాజ్యానికి రామబ్రహ్మం స్నేహితులైన సముద్రాల రాఘవచార్యతో పరిచయం ఏర్పింది. ఆయన పాండిత్యం ఎంత గొప్పదో ఆమెకు తెలుసు. అందుకే నర్తనశాల సినిమా రచన చేయాల్సిన బాధ్యతను ఆయనకు అప్పగించారు. తిక్కన రచించిన విరాటపర్వగాధకు స్వల్పమైన మార్పులు చేర్పులతో సముద్రాల అద్భుతమైన స్క్రీన్‌ప్లేను సమకూర్చారు. సంభాషణలతో పాటు కొన్ని పాటలు, పద్యాలను కూడా రాశారు. మాటల విషయానికి వస్తే కీచకుడు, బృహన్నల, ద్రౌపది తదితర పాత్రలకు అనుగుణంగా సంభాషలను పలికించారు సముద్రాల. కీచక పాత్రధారి ఎస్వీరంగారావుకు ఒక సుదీర్ఘమైన స్వగతం ఉంటే బాగుటుందని చిత్ర దర్శకుడు కమలాకర కామేశ్వరరావుకు అనిపించింది.
ఆ విషయాన్ని సముద్రాలకు చెప్పారు. అయితే ఆ సమయంలో సముద్రాల అస్వస్థులుగా ఉండటం వల్ల, స్వగతం రాసే పనిని తన కుమారుడు సముద్రాల రామానుజాచార్యకు అప్పగించారు. ఆయన కూడా పండితుడే. అప్పటికే జూనియర్ సముద్రాలగా పేరు తెచ్చుకున్నారు. రామానుజాచార్య కేవలం 15 నిమిషాలలో కీచకుడి స్వగతాన్ని రాసి కమలాకర కామేశ్వరరావు చేతిలో పెట్టారు. కామేశ్వరరావు అబ్బురపడిపోయారు. ఆ స్వగతాన్ని చూసి ఎస్వీ రంగారావు కూడా ముగ్ధుడయ్యారట! సుదీర్ఘ సమాసాలతో, సంస్కృత పదాలతో రాసిన ఆ మాటలు ఎస్వీఆర్ నోట అద్భుతంగా పలికాయి. అందుకే ఆయన విశ్వ నట చక్రవర్తి అయ్యారు. ఉత్తమ నటుడిగా జకార్తాలో అవార్డును అందుకున్నారు.
సినిమాకు సుసర్ల దక్షిణామూర్తి సంగీతం అందించారు. ఇందులోని జనని శివకామిని పాట ఇప్పటికీ దుర్గగుళ్లలో వినిపిస్తుంటుంది. ఇక సలలితరాగ సుధారస సారం, నరవరా ఓ కురువరా, ఎవరి కోసం ఈ మందమాసం, సఖియా వివరించవే, దరికి రాబోకు రాబోకు రాజా అన్న పాటలు ఆల్ టైమ్ హిట్స్‌గా నిలిచాయి. నృత్య దర్శకత్వాన్ని వెంపటి పెదసత్యం, ఛాయా గ్రహణాన్ని ఎమ్.ఎ.రెహమాన్ అందించారు. ఈ చిత్ర విజయంలో వీరి పాత్ర ఎంతో ఉంది. అక్టోబర్ 11, 1963న విడుదలైన నర్తనశాల సినిమా పలు కేంద్రాలలో శతదినోత్సవాన్ని జరుపుకుంది. 1963లో జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది.నర్తనశాలలో జయగణనాయక విఘ్న వినాయక అనే పాట ఉంది. ఈ గేయం చాలా పాపులరయ్యింది. ఎంతగా అంటే ఇక్కడ నృత్య పూజలు ఈ పాటతోనే జరిగేటంతగా! ఒక్కమాటలో చెప్పాలంటే అది సంప్రదాయంగా మారింది. ఇక ఈ సినిమాలో భీముడిగా దండమూడి రాజగోపాల్ నటించారు.
ఆయన ప్రముఖ బాడీ బిల్డర్. ఈ పేరుతో విజయవాడలో స్టేడియం కూడా ఉంది. పలు అంతర్జాతీయ క్రీడా పోటీలలో ఈయన పాల్గొన్నారు. నర్తనశాల ఘన విజయం సాధించడంతో రెండేళ్ల తర్వాత వచ్చిన వీరాభిమన్యు సినిమాలో ఈయనకు భీముడి వేషం లభించింది. ఇందులో పహిల్వాన్ నెల్లూరు కాంతారావు జీమూతమల్లుడి వేషం వేశారు. అతడికీ భీముడికీ మధ్య పోరాటం చాలా గొప్పగా తీశారు. ఇందులో అభిమన్యుడి పాత్రను పోషించిన శోభన్‌బాబు రెండేళ్ల తర్వాత వచ్చిన వీరాభిమన్యులో పూర్తి స్థాయి నాయకపాత్రను వేశాడు. అర్జునుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగిస్తున్న దృశ్యాన్ని ఛాయగ్రాహకుడు రెహమాన్ ఆకట్టుకునే విధంగా చిత్రీకరించారు. బాణం చివర అర్ధచంద్రాకారంపై ఒక యువతి కూర్చుని కురు సేనా వాహినిపై మత్తుమందు వెదజల్లినట్టు అద్భుతంగా చిత్రీకరించారు. నిజానికి ఈ సినిమాలో నపుంసకుడైన బృహన్నల వేషాన్ని ఒప్పుకుని ఎన్టీఆర్ గొప్ప సాహసమే చేశారు.
ఎందుకంటే అప్పటికే ఆయన అగ్రశ్రేణి హీరో! ధీరోదాత్త పాత్రలకు పెట్టింది పేరు. అలాంటిది పేడి రూపంలో హొయలు ఒలికించాల్సిన బృహన్నల వేషం వేయడం సాహసం కాక మరేమిటి. ఏమాత్రం తేడా వచ్చినా ఆయన ఇమేజ్‌కు పెద్ద దెబ్బ తగిలేది. సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆ పాత్రను ఒప్పకోవద్దని వారించారు. అయినా ఎన్టీఆర్ లెక్క చేయలేదు. అప్పటికే శాస్త్రీయ నృత్యంలో గొప్ప పేరు తెచ్చుకున్న ఎల్.విజయలక్ష్మికి నాట్యం నేర్పే పాత్ర కాబట్టి ఆమెతో సమానంగా నాట్యం చేయాల్సి ఉంటుంది. ఆ ఒక్క కారణంతోనే ఎన్టీఆర్ మొదట ఈ వేషం వేయడానికి నిరాకరించారు. లక్ష్మీరాజ్యం నచ్చచెప్పితే ఒప్పుకున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున వెంపటి సత్యం దగ్గరకు వెళ్లి నాట్యం నేర్చుకున్నారు ఎన్టీఆర్. నపుంసకుల నడక, హావభావాల కోసం వారిని పరిశీలించి కష్టపడి సాధన చేశారు. వేషం బృహన్నలది అయినప్పటికీ వేసేది ఎన్టీఆర్ కాబట్టి మరీ ఎబ్బెట్టుగా కనిపించకుండా కొంత ఠీవిగా కనబడటం కోసం కళాదర్శకుడు టి.వి.ఎస్.శర్మ, మేకప్‌మన్ హరిబాబు, పీతాంబరం, భక్తవత్సలం తదితరులు ఎంతో శ్రమించరు. చాలా స్కెచ్‌లు వేశారు. మొత్తంగా ఎన్టీఆర్‌ను అందంగా తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ సాహసం ఫలించింది. ఆయన నటనకు ప్రేక్షకులు అబ్బురపడ్డారు. ప్రశంసలు అందించారు.