లవకుశ సినిమా (Lava Kusa Movie)తెలుగువారి స్థిరాస్తి. కమర్షియల్‌గా లవకుశ సాధించిన విజయం నభూతో నభవిష్యతి! సినిమా విడుదలైనప్పుడు టికెట్ ధరలు పావలా నుంచి రూపాయి వరకు ఉండేవి. నగరాల్లో మహా అయితే రెండు రూపాయలు ఉంటుందేమో! అప్పుడు రాష్ర్ట జనాభా మూడు కోట్లు.
లవకుశ సినిమా (Lava Kusa Movie)తెలుగువారి స్థిరాస్తి. కమర్షియల్‌గా లవకుశ సాధించిన విజయం నభూతో నభవిష్యతి! సినిమా విడుదలైనప్పుడు టికెట్ ధరలు పావలా నుంచి రూపాయి వరకు ఉండేవి. నగరాల్లో మహా అయితే రెండు రూపాయలు ఉంటుందేమో! అప్పుడు రాష్ర్ట జనాభా మూడు కోట్లు. ఆ రోజుల్లోనే లవకుశ సినిమా కోటి రూపాయలు వసూలు చేసిందంటే సినిమా స్టామినా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. 50 నుంచి 60 లక్షల జనాభా ఉన్న వంద కేంద్రాలలో 1.98 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. అంటే జనాభాకు మించి నాలుగు రెట్ల టికెట్లు అమ్ముడయ్యాయన్నమాట. దీన్ని బట్టి సినిమా సాధించిన రికార్డును అర్థం చేసుకోవచ్చు. ఇవాళ్టి రోజున ఇలాంటి ఆదరణ ఏ సినిమాకైనా లభించిందే అనుకుందాం! అది అవలీలగా రెండు వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది.. అంటే లవకుశ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఇప్పటి రోజుల్లో రెండు వేల కోట్లతో సమానం అన్న మాట. పైగా ఈ వసూళ్లన్నీ కేవలం దక్షిణ భారతానికే పరిమితం. ఇప్పుడంటే సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి కానీ, అప్పట్లో ఓ ప్రాంతానికే పరిమితమయ్యేవి.
1964 నూతన సంవత్సరం రోజున అంటే జనవరి 1న వరంగల్ రాజరాజేశ్వరి థియేటర్ యాజమాన్యం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం ఆ పట్నంలో లవకుశ చిత్రాన్ని 4,34,800 మంది చూసారు. అయితే అప్పటి వరంగల్ జనాభా కేవలం ఒక లక్ష మాత్రమే. ఆ ప్రకారం ఒక్కో ప్రేక్షకుడు ఎన్నెన్ని సార్లు ఈ సినిమాని చూసారో ఊహించుకోవచ్చు. అలాగే ఈ చిత్రం కర్ణాటక(Karnataka)లోనూ ఒకే థియేటర్‌లో 35 వారాలు ప్రదర్శింపబడింది. మళ్లీ 1977, 1980లో ఈ సినిమా రిపీట్ రన్ గా రిలీజ్ అయ్యి శతదినోత్సవాలు జరుపుకుంది. ఇలా మూడు సార్లు ఓ చిత్రం బెంగళూరులో వందరోజులు ఆడటం అన్నది కన్నడ సినిమాలకు కూడా సాధ్యం కాలేదు.
1963 మార్చి 29న విడుదలైన ఈ సినిమా విడుదలైన 26 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. లేట్‌రన్‌లో 46 కేంద్రాలలో వందరోజులు ఆడిన ఏకైక సినిమా లవకుశనే! అలాగే తెలుగునాట మొట్టమొదటిసారిగా 500 రోజులు ఆడిన సినిమా కూడా లవకుశనే! అంతకు ముందు రికార్డు కూడా ఎన్టీఆర్‌దే! ఆయన నటించిన పాతాళభైరవి సినిమా 245 రోజులు ఆడింది. అంటే దానికి రెట్టింపు రోజులు లవకుశ ఆడిందన్నమాట. రిపీట్ రన్‌లలో కూడా లవకుశ సినిమాలాగా ఆడిన సినిమా మరోటి లేదు. రిపీట్ రన్‌లలోని ప్రదర్శనలన్నీ కలిపితే వందకు పైగా కేంద్రాలలో ఏడాదిపైగా రన్‌ను నమోదు చేసిన సినిమా అవుతుంది. లవకుశ తమిళ వెర్షన్(Lava kusa Tamil Version) కూడా ఘన విజయం సాధించింది. మదురైలో 40 వారాలు ఆడింది. హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా సిల్వర్‌జూబ్లీ చేసుకుంది. ఒకే చిత్రం ద్వారా ఒకే హీరో మూడు భాషలలో రెండుసార్లు విజయాలను సాధించడం ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యమయ్యింది. దేశంలో మరే నటుడికి ఈ ఖ్యాతి లేదు. ఆ రెండు సినిమాలు పాతాళభైరవి, లవకుశ. అదే ఏడాది నేషనల్ ఫిల్మ్ అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా లవకుశ రాష్ట్రపతి నుంచి బహుమతి అందుకుంది. ఒకే సంవత్సరం లవకుశ, నర్తనశాల, కర్ణన్ (తమిళం) వంటి మూడు అవార్డు చిత్రాలలో నటించినందుకు ఎన్టీఆర్ రాష్ట్రపతి నుంచి ప్రత్యేక బహుమతి అందుకున్నారు. ఇలా మూడు చిత్రాలకు కలిపి ఒకేసారి జాతీయ బహుమతిని ఇప్పటి వరకు మరే నటుడూ అందుకోలేదు.. దటీజ్ ఎన్టీఆర్!